కాంట్రాక్టర్లుగా.. అధికారులు..!
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:28 PM
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. అయితే రాజకీయ నాయకులను, అధికారులను డబ్బుతో గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా అదే ఏరియాలో తిష్టవేస్తున్నారు. మేం ఎన్నేళ్లయినా ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
బినామీ పేర్లతో కోట్లాది రూపాయల పనులు
చేసేది కింది స్థాయి ఉద్యోగం
పైస్థాయి అధికారులను సైతం మేనేజ్ చేసే స్థాయికి..
ఇదీ ఎస్పీడీసీఎల్‌లో కొందరి తీరు
ఎస్పీడీసీఎల్ కొందరు అధికారులకు కల్పతరువుగా మారింది. అడ్డగోలు సంపాదనకు ఎస్పీడీసీఎల్‌ను మించిన శాఖ లేదంటారు. ఇంటికి బిగించే కనెక్షన మొదలుకుని వ్యవసాయ మోటారు కనెక్షన్లు, అదనపు లైన్లు ఇలా ప్రతిదానిలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఇది కొందరు అధికారులు చేసే అవినీతి. మరికొందరు మాత్రం బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కోట్లకు పడగలెత్తుతున్నారు. అడ్డగోలుగా సంపాదనతో పైస్థాయి అఽధికారులకు, రాజకీయ నేతలకు లక్షలు పడేస్తూ మేనేజ్ చేసుకుంటున్నారు.
(కడప-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. అయితే రాజకీయ నాయకులను, అధికారులను డబ్బుతో గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా అదే ఏరియాలో తిష్టవేస్తున్నారు. మేం ఎన్నేళ్లయినా ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కేవలం తన ఉద్యోగ బాధ్యతలను మాత్రమే నిర్వహించాలి. అయితే ట్రాన్సకోలో కొందరు అధికారులు ఉద్యోగంతో పాటు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేయడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. డివిజన స్థాయి అధికారులే అడ్డగోలు సంపాదనకు తెరలేపారు. రాజకీయ నేతలను అడ్డుపెట్టుకుని ఒకేచోట తిష్టవేసి తాను సంపాదించుకున్న అవినీతి సొమ్ములో కొంత వారికి పంచుతూ.. కోట్లాది రూపాయల పనులు చేసుకుంటున్నారు. వీరందరికీ పులివెందుల ‘సార్’ ఆదర్శంగా ఉండడం గమనార్హం. ఆయన బాటలోనే మైదుకూరు, ప్రొద్దుటూరు, దువ్వూరు, వనిపెంట, రాజంపేటలో కింది స్థాయి ఉద్యోగులు కూడా కాంట్రాక్టు పనులు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులకే సవాల్ విసురుతున్నారు. అంతా ఆ సార్ మహిమ అంటూ ట్రాన్సకోలో పెద్ద చర్చ నడుస్తోంది.
పులివెందుల సారా మజాకా
పులివెందుల.. ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఎమ్మెల్యే వైఎస్ జగనమోహనరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి నాన్న దివంగత రాజశేఖర్‌రెడ్డి రెండుసార్లు సీఎంగా పనిచేశారు. వివేకా హత్యతో పులివెందుల పేరు మారుమోగింది. ఆ కేసులో ఎంపీ అవినాశరెడ్డిని సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. పులివెందుల పేరు అట్ల మోగిపోతే .. ఎస్పీడీసీఎల్‌లో ఓ అధికారి పుణ్యమా అని మళ్లీ ఇప్పుడు ఆ శాఖలో పులివెందుల సార్ పేరు వినిపిస్తోంది. ఆయన అక్కడ దశాబ్దం పైగానే తిష్ట వేశారు. అందరికీ బదిలీలు ఉంటాయేమో నాకు మాత్రం ఉండవు.. నేను ఎక్కడికీ పోను అని ధీమాగా ఉంటారు. ఆ సార్ అక్కడ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శ ఉంది. జగన హయాంలో ఎంపీ అవినాశరెడ్డి ఇతర ముఖ్య నేతల పేర్లు చెప్పుకుని పులివెందుల ఎస్పీడీసీఎల్ పరిధిలో కోట్లాది రూపాయల నిఽధులు ఊడ్చివేసారనే ప్రచారం ఉంది. ఉద్యోగం చేస్తే ఏం మజా ఉంటుంది అనుకున్నారేమో.. రాజకీయ నేతలతో సావాసం చేయడం, సొంతశాఖ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవడం ఈయన ప్రత్యేకత. సొంత బంధువు, ఎస్పీడీసీఎల్‌లో పనిచేసే సిబ్బందితో కలసి ఓ సంస్థ ఏర్పాటు చే శారు. ఆ సంస్థకు వార్షిక టర్నోవర్ రూ.3.50 లక్షలు మాత్రమే. అయితే పులివెందుల బాస్ ఆశీస్సులు ఉండడంతో వేంపల్లెలో రూ.17.50 కోట్ల టర్న్ కీ పనులను సొంతం చేసుకున్నారు. ‘వినిక’ కనస్ట్రక్షన పేరిట వేంపల్లెలో రూ.17.50 కోట్లతో పనులు చేపట్టారు. ఆ కాంట్రాక్టులో ఓ అధికారి మామ, ట్రాన్సకోలో పనిచేస్తున్న ఇద్దరు ఆపరేటర్లు ఉన్నారు. దీనిపై విజిలెన్సకు ఫిర్యాదు చేయగా సబ్‌స్టేషనలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌శర్మ, మహబూబ్‌పీరాలను తొలగించారు. అయితే ఆ సార్‌పై చర్యలు లేకపోవడం గమనార్హం. ఇప్పుడు తిరిగి ఆ ఇద్దరిలో ఒకరిని మీటర్ రీడింగ్ తీసే విధుల్లో పెట్టుకోవడం విశేషం.
ఆయన అవినీతే వీరికి ఆదర్శం
పులివెందుల సార్ బాటలో కొందరు ఎస్పీడీసీఎల్ ఉద్యోగులు పయనించడం మొదలు పెట్టారు. మైదుకూరు డివిజనలోని దువ్వూరు సెక్షనలో పనిచేస్తున్న ఓ లైనమాన ఏకంగా కాంట్రాక్టర్ అవతారమెత్తి రూ.46.15 లక్షలతో 14 పనులు చేయడం గమనార్హం. ఓ సంఘాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు పనులు చేయడం ప్రశ్నించే అధికారులను బెదిరించడం, ధర్నాలు చేయడం ఈయన ప్రత్యేకత. పైస్థాయి అధికారులను డమ్మీ చేసి విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం సాగుతోంది. అడ్డగోలుగా వెనకేసుకున్న ఇతను పైస్థాయి అధికారులను మేనేజ్ చేసే స్థాయికి ఎదిగారంటారు. ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరులో ఓ ఏఈ, వనిపెంటలో బినామీ అవతారమెత్తి కోట్లాది రూపాయల పనులు చేయిస్తున్నారు. ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా వీళ్లని ఏం చేయలేరు. ఎందుకంటే ఏ ఎండకా గొడుగు అన్నట్లుగా వీరు పార్టీల గొడుగు పట్టుకుని తిరుగుతుంటారు. ఇకనైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎస్పీడీసీఎల్ ఉద్యోగులే కోరుతున్నారు.
Updated Date - Sep 06 , 2024 | 11:28 PM