Shettivaripalle భయం గుప్పిట్లో.. శెట్టివారిపల్లె
ABN, Publish Date - Sep 23 , 2024 | 11:21 PM
మండల పరిధిలోని శెట్టివారిపల్లె గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొండప్రాంతం కావడం.. అడవి జంతువుల సంచారం కూడా ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
గ్రామం చుట్టూ కొండ ప్రాంతం, గాలేరు-నగిరి కాల్వ
రాత్రి వేళ అడవి జంతువులు చిరుతల సంచారం
బిక్కు బిక్కుమంటూ గ్రామ ప్రజల జీవనం
గత టీడీపీ ప్రభుత్వంలో ముంపు గ్రామంగా ప్రకటన
అమలు కాని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి హామీ
కూటమి ప్రభుత్వంపై ఆశలు
ముంపు గ్రామంగా ప్రకటించాలని వేడుకోలు
ముద్దనూరు సెప్టెంబరు 23: మండల పరిధిలోని శెట్టివారిపల్లె గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొండప్రాంతం కావడం.. అడవి జంతువుల సంచారం కూడా ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మండల కేంద్రానికి దాదాపు 18కిలో మీటర్ల దూరంలో శెట్టివారిపల్లె ఉంది. గ్రామంలో దాదాపు 270 గృహా లు, 800 పైగా జనాభా ఉన్నారు. గ్రామం గండికోట కొండకు అనుకొని ఉంది. అంతేకాకుండా గ్రామం ముందు వైపు గాలేరు-నగిరి ప్రధాన కాల్వ ఏర్పాటు చేశారు. కాల్వ మీదుగా తాడిపత్రి ప్రధాన రహదారికి దాదాపు 2కిలో మీటర్లు ఉంటుంది. ఈ గ్రామంలోకి వెళ్లాంటే రైల్వేబ్రిడ్జి కింద నుంచి వెళ్లాలి. ఇక వర్షం వస్తే కొండ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు గ్రామాన్ని చుట్టేస్తుంది. గ్రామంలోకి వెళ్లెందుకు గాలేరు-నగిరి కాల్వపై ఏర్పాటు చేసిన వంతెన ఒక్కటే మార్గం. ఈ బిడ్జి ప్రక్కన ఉన్న మట్టి కోతకు గురై ప్రమాదకరంగా ఉంది. గ్రామం లోకి కనీసం ఆటోలు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో గ్రామంలోకి వెళ్లాలన్నా, భయటకు రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చీకటి పడితే అడవి జంతుల సంచారంతో గ్రామ ప్రజలు భయం భయంగా గడపాల్సి వస్తుంది.
ముంపు గ్రామంగా ప్రకటించాలి
గ్రామాన్ని గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకునే వారే లేరు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకొని శెట్టివారిపల్లెను ముంపు గ్రామంగా ప్రకటిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏరియల్ సర్వే కూడా చేశారు. ఇళ్ల సర్వే కూడా అయ్యింది.కొందరు అధికారులు డబ్బులు తీసుకొని ఇళ్ల సర్వేలో భారీ అవకతవకలు చేశారని కొందరు ఫిర్యాదు చేయడంతో సర్వే నిలిచిపోయింది. అయితే ఈ విషయంలో 2019 ఎన్నికల్లో భాగంగా గ్రామంలో వైసీపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి శెట్టివారిపల్లెను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఎంపీ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు.. అధికారంలోకి వచ్చినా హామీని నెరవేర్చలేదు. దీంతో2024 ఎన్నికల్లో ఆ గ్రామ ప్రజలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పకడ్బందీగా సర్వే చేసి శెట్టివారి పల్లెను ముంపు గ్రామంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Sep 23 , 2024 | 11:21 PM