ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెనూ.. వదల్లేదు...

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:45 PM

కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువులను ఎవరో ఒకరికి ఆన్‌లైన్‌ చేయడం చూశాం.. అయితే డబ్బు వేటలో బరి తెగించిన ఇద్దరు తహసీల్దార్లు తాము ఎంతో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్నామన్న సంగతి పక్కన పెట్టేసి.. సుమారు 50 సంవత్సరాలుగా ప్రజలు నివాసం ఉంటున్న పల్లెను ఓ వైసీపీ నాయకుడికి ఆన్‌లైన్‌ చేసేశారు.

సర్వే నెంబరు-129లో ఉన్న గ్రామం

దర్జాగా ఆన్‌లైన్‌ చేసేశారు..

సహకరించిన రెవెన్యూ అధికారులు

తవ్వేకొద్దీ.. బయటపడుతున్న పాపాలు

వైసీపీ జమానాలో పరాకాష్ఠకు అవినీతి

వైసీపీ పాలనలో ఎక్కువగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొన్న శాఖ రెవెన్యూ.. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎన్నో సంఘటనలు మనకు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనం చదవబోతున్న సంఘటన మాత్రం నభూతో.. నభవిష్యత్‌.. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువులను ఎవరో ఒకరికి ఆన్‌లైన్‌ చేయడం చూశాం.. అయితే డబ్బు వేటలో బరి తెగించిన ఇద్దరు తహసీల్దార్లు తాము ఎంతో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్నామన్న సంగతి పక్కన పెట్టేసి.. సుమారు 50 సంవత్సరాలుగా ప్రజలు నివాసం ఉంటున్న పల్లెను ఓ వైసీపీ నాయకుడికి ఆన్‌లైన్‌ చేసేశారు. అవినీతి అక్రమాల చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక పేజిని లిఖించుకున్నారు. అంతటి ఘనమైన ఆ తహసీల్దార్లు ఎవరో? పల్లెను ఆన్‌లైన్‌ చేయించుకున్న ఘనుడు ఎవరో ? తెలుసుకోవాలంటే.. కింది కథనం చదవాల్సిందే..

(రాయచోటి-ఆంధ్రజ్యోతి):

రామాపురం మండలం బండపల్లె గ్రామం పొత్తుకూరుపల్లెలో సర్వే నెంబరు 75/2లో 6.02 ఎకరాలు, సర్వే నెంబరు 129లో 15.75 ఎకరాలకు పైనే భూమి ఉంది. పై రెండు సర్వే నెంబర్లలో కలిసి సుమారు నాలుగు ఎకరాలలో 75 ఇళ్లు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లలో భూమిని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సదిపిరాళ్ల రాంబాబురెడ్డి పేరు మీద ఇద్దరు తహసీల్దార్లు ఆన్‌లైన్‌ చేశారు. ఈ భూమి 1970 నుంచి తమ పెద్దలు అనుభవంలో ఉందని ఈ భూమి తమదే అనడానికి ఆధారాలు ఉన్నా అప్పటి తహసీల్దార్‌ అతడికి ఆన్‌లైన్‌ చేసినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. 75/2 సర్వే నెంబరులోని 6.02 ఎకరాలను ఆన్‌లైన్‌ చేశారు. ఇందులో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్లు ఉన్నాయి. సదిపిరాళ్ల రాంబాబురెడ్డి పేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు, 1బి వంటి రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ తప్పుడు రికార్డులతో రాంబాబురెడ్డి పొందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సర్వే నెంబరు 75/2 విషయమై వివాదం నడుస్తోంది. తొలుత ఈ వివాదం కడప జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో నడిచింది. అయితే వివాదాన్ని పట్టించుకోకుండా అప్పటి రామాపురం తహసీల్దార్‌ ఖాజాబీ రాంబాబురెడ్డి పేరు మీద మొత్తం 6.02 ఎకరాలను 28/6/2022న ఆన్‌లైన్‌ చేసింది. రెండు ఎకరాలలో పల్లె ఉందన్న విషయాన్ని పట్టించుకోకుండా ఆన్‌లైన్‌ చేయడానికి తహసీల్దార్‌ ధైర్యం చేసిందంటే ఆమెకు ఎంత ముట్టిందో? అని పలువురు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబరు 75/2 స్థలం వివాదంలో ఉందని రామాపురం రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న వీఆర్‌వో నుంచి తహసీల్దార్‌ వరకు అందరికీ తెలిసినా సరైన పత్రాలు లేకపోయినా రాంబాబురెడ్డి పేరు మీద ఆన్‌లైన్‌ అయిపోయింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న గ్రామస్థులు రాంబాబురెడ్డి పేరు మీద ఉన్న ఆన్‌లైన్‌ తొలగించమని ఆ తహసీల్దార్‌ను పలుమార్లు అడిగినా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయారు. అయినా ఇప్పటి వరకు ఆ తహసీల్దార్‌ మీద ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటమే కారణం. ఇంకా ఈ సమస్య పరిష్కరించుకోలేక.. ప్రజలు అల్లాడుతుంటే రెవెన్యూ అధికారులు చేసిన మరో బాగోతం బయటపడింది.


129 సర్వేలోనూ.. ఇదే వ్యవహారం

గ్రామంలోని మరో సర్వే నెంబరు-129లో 15.75 ఎకరాలకుపైగా భూమి ఉంది. ఇందులో సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 35కి పైగా ఇళ్లు ఉన్నాయి. ఇందులో ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ సర్వే నెంబరులోని 15 ఎకరాలను కూడా సదిపిరాళ్ల రాంబాబురెడ్డి పేరు మీద ఆన్‌లైన్‌ చేశారు. ఇక్కడ కూడా పల్లె ఉన్నా ఆన్‌లైన్‌ చేసేశారు. ఎన్నికల సమయంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్‌ ఈ సర్వే నెంబరులో భూమిని ఆన్‌లైన్‌ చేసినట్లు సమాచారం.

డబ్బు కోసం ఏ గడ్డికరచడానికైనా సిద్ధం

ఎన్నికలకు ముందు జగనన్న సిద్ధం.. సిద్ధం అంటూ రాష్ట్రమంతా తిరిగాడు. అయితే అంతకుముందే ఆయన పాలనలో కొందరు తహసీల్దార్లు డబ్బు కోసం ఏ గడ్డి కరచడానికైనా సిద్ధపడ్డారని పలువురు పేర్కొంటున్నారు. సాధారణంగా భూములకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో నుంచి ఎవరి పేరైనా తీసేయాలన్నా? నమోదు చేయాలన్నా? కొన్ని నిబంధనలు పాటించాలి. ఎవరి పేరైనా తొలగించాలంటే రికార్డుల్లో ఉన్న వ్యక్తికి నోటీసులు ఇచ్చి సంజాయిషీ తీసుకుని ప్రభుత్వ పరంగా అన్ని నిబంధనలు పాటించి అతడి పేరు తొలగించాలి. అదే ఎవరి పేరైనా నమోదు చేయాలంటే అతను ఆ ఆస్తికి సంబంధించి సమర్పించే రికార్డులన్నీ పరిశీలించి నిబంధనలను అనుసరించి నమోదు చేయాలి. అయితే ఇక్కడ అటువంటి నిబంధనల పట్టింపు లేకుండా అన్నీ జరిగిపోయాయి. అధికారులు లంచాలు తీసుకుని రికార్డుల్లో పేర్లు తొలగించి నమోదు చేయడం వల్ల వివాదాలు ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పల్లెను ఆన్‌లైన్‌ చేసిన విషయం బయటపడి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం సంజాయిషీ కూడా అడగలేదు. దీంతో రెవెన్యూలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

న్యాయం చేయాలంటూ...

వైసీపీ ప్రభుత్వ పాలనలో అక్రమార్కులకు అధికారులు వంత పాడారు. దీంతో బాధితుల గోడు పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని అధికారులను కోరుతున్నారు. సర్వే నెంబరు-129లో పల్లెను ఆన్‌లైన్‌ చేసిన విషయమై గురువారం గ్రామస్థులు రామాపురం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మూడు తరాలుగా తాము నివాసం ఉంటున్న పల్లెను వేరే వ్యక్తికి ఆన్‌లైన్‌ చేశారని, వెంటనే ఆ ఆన్‌లైన్‌ను తొలగించాలని సుమారు వంద మంది ప్రజలు తహసీల్దార్‌ను కోరారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయడంతో పాటు పల్లెను ఆన్‌లైన్‌ చేసిన తహసీల్లార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Nov 08 , 2024 | 11:45 PM