సరిహద్దు ప్రాంతంలో జూదం ఫుల్...!
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:17 PM
మండల సరిహద్దు ప్రాంతమైన టి.పసలవాండ్లపల్లె, మర్రిపాడు, శెట్టివారిపల్లె, సంగసముద్రం, తరిగొండ, నడిమిఖండ్రిగ అటవీ ప్రాంతాల్లో జూదం విచ్చలవిడిగా సాగుతోంది.
చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు
ఇన్‌ఫార్మర్లతో సమాచారం లీక్
గుర్రంకొండ, ఆగస్టు 29: మండల సరిహద్దు ప్రాంతమైన టి.పసలవాండ్లపల్లె, మర్రిపాడు, శెట్టివారిపల్లె, సంగసముద్రం, తరిగొండ, నడిమిఖండ్రిగ అటవీ ప్రాంతాల్లో జూదం విచ్చలవిడిగా సాగుతోంది. ఈ జూదంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పేకాటకు అన్నమయ్య జిల్లా నుంచే కాక అనంతపురం, కడప జిల్లాతో పాటు వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జూదరులు వస్తున్నారు. ఈ జూదరులకు పేకాట నిర్వాహకులు ఫోన్ల ద్వారా సమాచారం ఇసున్నారు. ఏ రోజు ఎక్కడ జూదం ఆడేది సెల్‌ఫోన్ ద్వారా నిర్వాహకులు లొకేషన్‌ను షేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూదరులు చడీచప్పుడు లేకుండా అక్కడికి చేరుకుంటున్నారు. ఇలా జూదం గుర్రంకొండ మండలంలో విచ్చలవిడిగా సాగుతోంది. గుర్రంకొండ మండలంలోని టి.పసలవాండ్లపల్లెలో ఎక్కువగా కొండలు, అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని జూదరులు తమ కార్యకలాపాలకు చక్కగా వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా జూదం జరిగే ప్రాంతం వరకు నిర్వాహకులు రెండు మూడు చోట్ల ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జూదం ఆడుతున్న సమాచారం పోలీసులకు తెలిసి పట్టుకోవడానికి వస్తే నిర్వాహకులు ఏర్పాటు చేసిన వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా సమాచారం ఇస్తారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపే జూదరులు అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు. పోలీసులను చూసి పరుగెత్తలేని వారు మాత్రమే పట్టుబడుతున్నారు. పోలీసులకు పట్టుబడిన జూదరుల వద్ద అధిక మొత్తంలో సొమ్ము దొరికినా మొత్తం చూపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈనెల 9వ తేదీ టి.పసలవాండ్లపల్లె-చెర్లోపల్లె సరిహద్దు ప్రాంతంలో జూదరులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చిన్నమండెం, పెద్దమండెం, గుర్రంకొండ మండలాలకు చెందిన 12 మంది పట్టుబడగా వారి వద్ద నుంచి రూ.41,600 నగదు, 20 ద్విచక్ర వాహనాలను కేసులో చూపించారు. అప్పటిలో ఈ పేకాట శిబిరంలో సుమారు 40 మందికి పైగా ఉన్నట్లు, సుమారు రూ.20 లక్షల పైగా నగదు జూదంలో చేతులు మారినట్లు గ్రామస్థులు చర్చించుకున్నారు.
నిర్వాహకులకు అండగా ఇన్‌ఫార్మర్లు
గుర్రంకొండ మండలంలో జూదం నిర్వహించే నిర్వాహకులకు కొందరు దళారులు ఇన్‌ఫార్మర్లుగా ఉన్నట్లు ప్రజలు, గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. దీంతో మండలంలో టి.పసలవాండ్లపల్లె, మర్రిపాడు, శెట్టివారిపల్లె, తరిగొండ, చెర్లోపల్లె, నడిమిఖండ్రిగ, గుర్రంకొండ ప్రాంతంలో జూదం ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగానే ఈ సమాచారాన్ని పోలీసుల ద్వారా కొందరు దళారులు తెలుసుకుని జూదరులకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు జూదం జరిగే ప్రదేశానికి చేరుకునేలోపే జూదరులు పరారవుతున్నారు. ఇందుకు గానూ ఇన్ఫార్మర్లకు కొంత మొత్తంలో నగదు, మద్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇన్‌ఫార్మర్లు ప్రతిరోజూ వేలాది రూపాయలను సొమ్ము చేసుకోవడం విశేషం. ఈ దళారులతో పోలీస్‌స్టేషన్‌లో జరిగే ప్రతి చిన్న సమాచారం బయట వ్యక్తులకు క్షణాల్లో చేరిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది చివరలో జూదరులకు సహకరిస్తూ పోలీసు కదలికలపై నిర్వాహకులకు సమాచారం చేరవేసే ఓ కానిస్టేబుల్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. అధికారులు స్పందించి దళారులు, ఇన్‌ఫార్మర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
జూదంపై ప్రత్యేక నిఘా ఉంచాం
- మధు రామచంద్రుడు, ఎస్‌ఐ గుర్రంకొండ
మండలంలోని పలు సరిహద్దు గ్రామాల్లో జరిగే జూదంపై నిఘా ఉంచాము. జూదరులకు ఎవరైనా సహకరిస్తునట్లు తెలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవు. గ్రామాల్లో జూదరుల కదలికలపై నిఘా ఉంచి కట్టడి చేస్తాం. అలాగే నిర్వాహకుల వివరాలను సేకరిస్తున్నాము.
Updated Date - Aug 29 , 2024 | 11:17 PM