People should participate స్వర్ణాంధ్ర విజనలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
ABN, Publish Date - Sep 25 , 2024 | 11:47 PM
స్వర్ణాంధ్ర విజనలో ప్రజలందరూ భాగస్వాములై అమూల్యమైన అభిప్రాయాలను తెలపాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు.
కలెక్టర్ లోతేటి శివశంకర్
కడప (ఎడ్యుకేషన), సెప్టెంబరు 25: స్వర్ణాంధ్ర విజనలో ప్రజలందరూ భాగస్వాములై అమూల్యమైన అభిప్రాయాలను తెలపాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. బుధవారం కడప నగరం ఉక్కాయపల్లె ప్లాజా వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర-2047 వార్డుసభలో కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందరోజుల పాలనపై ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం చేపడుతోందన్నారు. ప్రజలందరూ జిల్లా ఆర్థికాభివృద్ధికి అమూల్యమైన సలహాలు, సూచనలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలపాలని సూచించారు. 2047నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న నేపధ్యంలో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన-2047తో సంక్షేమ అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా రూపకల్పన చేశారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో వాగులు, వంకలు చెరువులు డ్రైనేజీలపై ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హౌసింగ్ పథకం కొనసాగుతుందని మార్చి 2025 లోపు స్థలం పొందిన ప్రతి ఒక్కరూ గృహాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఆర్.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 40వ డివిజనలో డ్రైన్లు సరిగా లేవని, అందుకు రూ.27 లక్షలు మంజూరు చేయాలని కోరగా 15రోజుల్లో పనులు చేపట్టి త్వరగా పూర్తిచేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
2న ఆదరణ పరికరాలు పంపిణీ : కలెక్టర్
టీడీపీ ప్రభుత్వంలో ఆదరణ కింద మంజూరైన పరకరాలను అక్టోబరు 2న లబ్ధిదారులకు అందిస్తామని కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. బుధవారం మహిళా ప్రాంగణంలో నిరుపయోగంగా నిల్వ చేసిన కుట్టుమిషన్లను, స్కిల్ మిషనరీ యంత్రాలను, గార్బేజ్ ఆటోలు, బైండింగ్ మిషన్లను కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఆదరణ కింద ఈ మిషనరీలు మంజూరయ్యాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీటన్నింటినీ పక్కనబెట్టి మహిళా ప్రాంగణలో నిరుపయోగంగా ఉంచారని తెలిపారు. వీటన్నింటినీ అందుబాటులోకి తెచ్చి అక్టోబరు 2న గాంధి జయంతి రోజున లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైవో నందన, అడిషనల్ కమిషనర్ రాకేశచంద్రన, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Sep 25 , 2024 | 11:47 PM