Students should not feel విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు
ABN, Publish Date - Sep 18 , 2024 | 11:39 PM
విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కేజీబీవీ జూనియర్ కళాశాలను, వసతి గృహాన్ని పటిష్టంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కస్తూర్భా వసతిగృహం తనిఖీలో కలెక్టర్
వీరబల్లి, సెప్టెంబరు 18: విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కేజీబీవీ జూనియర్ కళాశాలను, వసతి గృహాన్ని పటిష్టంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీరబల్లి మండలంలోని కేజీబీవీ జూనియర్ కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహం కెపాసిటీ ఎంత, ప్రస్తుతం ఉన్న విద్యార్థినుల సంఖ్య ఎంత, రోజువారీ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా, వసతి గృహ నిర్వహణ, విద్యార్థినులకు పాఠాల బోధన, ఉపాధ్యాయుల పనితీరు తదితర అంశాల్లో కేజీబీవీ నిర్వాహకులకు, విద్యార్థినులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులందరూ బాగా చదువుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. కష్టపడిన వారికి కచ్చితమైన ఫలితం లభిస్తుందని, కేవల చదువుకున్నామని కాకుండా సృజనాత్మకత జోడించి విద్యా ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసుకోవాలని తెలిపారు. అనుమతి లేకుండా ఇతరులను, బయటి వారిని ఎవరినీ వసతి గృహంలోకి అనుమతించరాదని, విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో మమేకమై వారితో పాటు కూర్చుని భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, కేజీబీవీ జూనియర్ కళాశాల వసతి గృహ నిర్వాహకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 18 , 2024 | 11:39 PM