రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారు
ABN, Publish Date - Sep 02 , 2024 | 11:59 PM
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపరిచారని తర్వాత వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయ ఘాట్‌లో ఆమె సోమవారం వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు.
సీఎంగా స్టీల్‌ప్లాంట్‌ను జగన పట్టించుకోలేదు
ప్రత్యేక హోదా గురించి మాట్లాడనే లేదు
కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
వేంపల్లె, సెప్టెంబరు 2: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపరిచారని తర్వాత వచ్చిన వారు రాష్ట్రాభివృద్ధిని నీరుగార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఇడుపులపాయ ఘాట్‌లో ఆమె సోమవారం వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం ప్రజలందరికి తీరనిలోటని అన్నారు. ఆయన మరణంతో 700 కుటుంబాల్లో విషాదం నెలకొందని ఆవేదన వెలిబుచ్చారు. ఆయనలా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవ్వరూ పరిపాలన చేయలేదన్నారు. జలయజ్ఞం అటకెక్కించారు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీలను పట్టించుకోలేదని అన్నారు. ప్రత్యేకహోదా గురించి మాట్లాడే వారే కరువయ్యారన్నారు. సీఎం అయిన వైఎస్ జగన జిల్లావాసిగా కనీసం స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బీజేపీని ఎప్పుడూ వ్యతిరేకించేవారని ఆయన ఆశయాలను సాధించకపోగా బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని జగనను ఉద్దేశించి విమర్శించారు. వైఎస్సార్ ఆశయసాధనకు కాంగ్రె్‌సపార్టీ కట్టుబడి ఉందని, ఆయన బిడ్డగా ముందుకు సాగుతానని ప్రత్యేక హోదా కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని అన్నారు.
వైఎస్సార్‌కు జగన, షర్మిల వేర్వేరుగా నివాళి
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన పిల్లలు జగన, షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు. మొదట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి భార్య వైఎస్ భారతి, తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు సుధీకర్‌రెడ్డి, ఎంపీ అవినాశరెడ్డి ఇతర ముఖ్యనేతలతో కలిసి సోమవారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఫాదర్ నరేశ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఘాట్ ఆవరణలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి మొక్కుకున్నారు. ఆయన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప మేయర్ సురేశబాబు తదితరులు పాల్గొన్నారు. 8గంటలకు జగన ఇడుపులపాయ నుంచి బయలుదేరి రోడ్డుమార్గాన కడప చేరుకుని అక్కడి నుంచి విమానంలో విజయవాడ వెళ్లారు. ఇడుపులపాయ నుంచి జగన వెళ్లిన 15 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు సుధీకర్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. తండ్రి సమాధి వద్ద పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఫాదర్ నరేశ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. ఘాట్ ఆవరణలోని తండ్రి విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్సార్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తులసిరెడ్డి, అఫ్జల్‌ఖాన, సల్లాఉద్దీన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 02 , 2024 | 11:59 PM