Perni Nani:పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
ABN, Publish Date - Dec 30 , 2024 | 05:17 PM
Perni Nani: రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెకు ముందుస్తు బెయిలు మంజూరు చేస్తూ.. కృష్ణాజిల్లా కోర్టు సోమవారం ఆదేశించింది.
మచిలీపట్నం, డిసెంబర్ 30: రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సోమవారం కృష్ణాజిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీస్ విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
బందరు మండలం పోట్లపాలెంలో సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు. వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ.. తొలుత పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాంతో బియ్యం షార్టేజ్‌కు సంబంధించి.. 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి ఆమె చెల్లించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులోభాగంగా గోడౌన్‌లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అదనంగా మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ముందస్తు బెయిల్ కోసం జయసుధ పెట్టుకున్న పిటిషన్‌పై మచిలీపట్నంలోని జిల్లా కోర్టులో వాదనలు ఇప్పటికే పూర్తయిన విషయం విధితమే.
Also Read: కొత్త ఏడాదిలో వారిద్దరికి సినిమా చూపిస్తాం
అందుకు సంబంధించిన తీర్పును రిజర్వు చేసి ఉంచామని.. దీనిని డిసెంబర్ 30వ తేదీన ఈ తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో అందుకు సంబంధించిన తీర్పును జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈ రోజు ప్రకటించారు. మరోవైపు 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేయడంతో.. ఈ వ్యవహారంపై పేర్ని కుటుంబం ఎలా స్పందిస్తుందనే ఓ చర్చ అయితే జిల్లాలో వాడి వేడిగా నడుస్తోంది.
Also Read: రేవంత్ ఈగో చల్లబడింది..
మరోవైపు.. గత జగన్ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పేర్ని నాని.. ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించే వారు. అంతేకాదు.. ఆయనకు మంత్రి పదవి లేకున్నా.. ప్రతి అంశంపై మాట్లాడుతుండే వారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించే వారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు.
Also Read: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు
Also Read: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక
అలాంటి వేళ.. వార్షిక తనిఖీల్లో పేర్ని నాని సతీమణికి సంబంధించిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఈ బియ్యం మాయం కేసులో తమ తప్పు ఒప్పుకున్నట్లుగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయిలు సైతం చెల్లించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మరింది. అలాగే ఈ వ్యవహరంపై తీవ్ర చర్చ సాగుతోన్న సమయంలో.. మాజీ మంత్రి పేర్ని నాని సరైన రీతిలో స్పందించక పోవడం పట్ల విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Dec 30 , 2024 | 05:36 PM