Perni Nani: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు
ABN, Publish Date - Dec 30 , 2024 | 02:48 PM
Perni Nani: గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో పేర్ని నాని ఫ్యామిలీకి వరుసగా గట్టి దెబ్బలు తగులుతోన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి పేర్ని ఫ్యామిలీ కోట్ల రూపాయిల్లో నగదు చెల్లించింది. అయితే గోడౌన్‌లో బియ్యం షార్టేజ్ మరింత పెరిగింది.
మచిలీపట్నం, డిసెంబర్ 30: రేషబ్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహరంలో తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా పేర్ని నాని రూ. 1.79 కోట్ల చెల్లించారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నులకు షార్టేజ్ పెరిగింది. దీంతో ఈ షార్టేజ్‌కు సైతం పైన్ చెల్లించాలని పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ.. సోమవారం నోటీసులు జారీ చేశారు. ఆ క్రమంలో అదనంగా రూ. 1.67 కోట్లు చెల్లించాలని జేసీ నోటీసుల్లో స్పష్టం చేశారు.
బందరు మండలం పోట్లపాలెంలో సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు.
వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ.. తొలుత పేర్ని నాని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాంతో బియ్యం షార్టేజ్‌కు సంబంధించి.. 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి చెల్లించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులోభాగంగా మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అదనంగా మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదీకాక ముందస్తు బెయిల్ కోసం జయసుధ పెట్టుకున్న పిటిషన్‌పై జిల్లా కోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వు చేసి ఉంచారు. ఈ తీర్పును డిసెంబర్ 30న వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Updated Date - Dec 30 , 2024 | 05:18 PM