BJP, TDP, Janasena:నేడు మళ్ళీ బీజేపీ పెద్దలతో భేటీకానున్న బాబు, పవన్
ABN, Publish Date - Mar 08 , 2024 | 07:32 AM
న్యూఢిల్లీ: ఎన్డీయేలో తెలుగు దేశం, జనసేన చేరిక ఖరారైంది. బీజేపీతో పొత్తు కీలక దశకు చేరుకుంది. సీట్ల సర్దుబాటుపై మరో దఫా సమావేశం కానున్నారు. శుక్రవారం మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీకానున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో కీలక చర్చలు జరిగాయి. దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి.
న్యూఢిల్లీ: ఎన్డీయే(NDA)లో తెలుగు దేశం (TDP), జనసేన (Janasena) చేరిక ఖరారైంది. బీజేపీతో పొత్తు కీలక దశకు చేరుకుంది. సీట్ల సర్దుబాటుపై మరో దఫా సమావేశం కానున్నారు. శుక్రవారం మళ్ళీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీకానున్నారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నివాసంలో కీలక చర్చలు జరిగాయి. దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే బీజేపీ, జనసేనలకు కలిపి 6 స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలియవచ్చింది.
చివరికి బీజేపీకి 4 లోక్ సభ, 6 అసెంబ్లీ స్థానాలు ఇస్తామన్న టీడీపీ.. అయితే 6 లోక్ సభ ,10 అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం. టీడీపీ ఇస్తామంటున్న 4 స్థానాలు.. రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు.. బీజేపీ అడుగుతున్న 6 స్థానాలు.. రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, విజయవాడ , హిందూపూర్, అరకు.. ఎమ్మెల్యే స్థానాలు.. కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్ , జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక స్థానం ఇస్తామని టీడీపీ అంటోంది. కాగా 2014 లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ కోరింది. ఈరోజు జరగనున్న సమావేశంలో సీట్ల సర్దుబాటు ఖరారయ్యే అవకాశముంది.
కాగా తెలుగు దేశం, జనసేన, బీజేపీతో పొత్తు కీలక దశకు చేరుకుంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే అంశంపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 8గంటలకు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా వచ్చారు. ఇద్దరూ కలిసి రాత్రి 10.30 గంటలకు అమిత్‌షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చర్చల్లో పాల్గొన్నారు. గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... తమకు వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు కేటాయించాలని షా, నడ్డా కోరారు. వాటిని గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేద్దామన్నారు. 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు తమకు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ‘‘అసెంబ్లీలో మీరు సాధ్యమైనన్ని సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని మాకు తెలుసు. లోక్‌సభలో కనీసం 370 స్థానాలు నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
అందువల్ల ప్రతి మిత్రపక్షం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువగా అడుగుతున్నాం’’ అని బీజేపీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అయితే... బీజేపీ ఆశిస్తున్నన్ని స్థానాలు కాకుండా 4 లోక్‌సభ, 6అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని చంద్రబాబు, పవన్ పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా కేటాయించవచ్చునని చెప్పినట్లు తెలిసింది. గెలవలేని సీట్లు తీసుకోవడంవల్ల అక్కడ వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం. షాను కలిసేముందు పార్టీ నేతలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, రఘురామకృష్ణం రాజు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు కృష్ణదేవరాయలు తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు.
రాష్ట్ర బీజేపీ నేతలతో సమీక్ష...: అమిత్ షా, నడ్డా, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి మధుకర్... రాష్ట్ర బీజేపీ నేతలతో బుధవారమే సమావేశమయ్యారు. ఏపీలో ఎన్నిసీట్లకు పోటీ చేయాలన్న విషయంపై పొద్దుపోయేదాకా చర్చించారు. విజయావకాశాలు ఉన్న సీట్ల గురించి స్పష్టమైన అంచనాకు రావాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం మరోమారు సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా టీడీపీని 10లోక్‌సభ, 20 అసెంబ్లీ సీట్లు అడగాలని ప్రతిపాదించినట్లు సమాచారం. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ప్రముఖసినీనటుడు కృష్ణంరాజు సతీమణి పేరును ప్రస్తావించినట్లు సమాచారం. శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉండాలని, చంద్రబాబు, పవన్‌తో చర్చల తర్వాత మళ్లీ పిలిపిస్తామని రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల పేర్లతో సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.
Updated Date - Mar 08 , 2024 | 08:10 AM