CM Chandrababu: మా ప్రభుత్వంలో రాజకీయ కక్షకు తావులేదు... కానీ
ABN, Publish Date - Aug 15 , 2024 | 11:21 AM
Andhrapradesh: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు.
అమరావతి, ఆగస్టు 15: 78వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day 2024) సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామన్నారు.
Chandrababu: ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారిగా జెండా ఎగురవేసిన చంద్రబాబు
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలు దశలవారీగా చెల్లిస్తున్నామన్నారు. టెలీ మెడిసిన్‌ను విస్తృత పరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్‌ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తామని... గిరిజన గర్భిణీలను వసతి కేంద్రాలకు తరలించి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడించారు. తద్వారా మాతాశిశు సంరక్షణ చేపడతామన్నారు. ‘‘ఎన్టీఆర్ బేబీ కిట్స్’’ను తిరిగి ప్రవేశ పెడతామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నామని సీఎం అన్నారు.
జనాభా వృద్ధిపై దృష్టి
గత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా అవినీతికి కేంద్రంగా మార్చుకుందని విమర్శించారు. రేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు అల్లాడిపోయారని... అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేస్తోందన్నారు. నిత్యావసరాల ధరలను నియంత్రిస్తామన్నారు. ప్రస్తుత సమాజంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా దేశంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టామని.. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు రెండు దశాబ్దాల క్రితం చొరవ తీసుకుని పలు కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. అయితే నేడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాలని.. లేకపోతే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతుందన్నారు. ఇది దేశ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ కారణంగా జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్యత దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించామన్నారు. అందుకే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగించామన్నారు. సంతానోత్పత్తిలో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంతో సహా దక్షిణాది రాష్ట్రాలు ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Chandrababu: రాజధాని లేని స్థితి నుంచి రాష్ట్ర పాలన ప్రారంభించాం..
‘‘జీరో టాలరెన్స్’’
యువ భారత్ కోసం డెమోగ్రఫిక్ మేనేజ్ మెంట్ ఆవశ్యకతను గుర్తించి ముందుకు సాగుదామని చెప్పారు. ప్రజల జీవితాలు మార్చేందుకే టెక్నాలజీ ని సమర్థవంతంగా వినియోగిస్తే పాలనలో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. పేదల బతుకుల్లో పెను మార్పులు తేవచ్చన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చన్నారు. టెక్నాలజీకి ఉత్తమ ప్రభుత్వ పాలసీలు తోడైతే అనూహ్యమైన విజయాలు సాధించవచ్చని చెప్పుకొచ్చారు. భారతదేశంలో టెక్నాలజీ ఉపయోగం పెరగడం వల్ల పేదరికం తగ్గిందని ఇటీవలే ఐక్యరాజ్య సమితి తెలిపిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర, పారదర్శక పాలన అందించవచ్చన్నారు. పీ4 తో పేదరిక నిర్మూలన చేయవచ్చన్నారు. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు. పేదరికం లేని సమాజం టీడీపీ విధానమని స్పష్టం చేశారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చన్నారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. తమ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ‘‘జీరో టాలరెన్స్’’ అని స్పష్టం చేస్తున్నామన్నారు.
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం
ఉమ్మడి రాష్ట్రంలో మత ఘర్షణలు, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని నిర్మూలించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందన్నారు. నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్‌ను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలన్నారు. నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదని.. కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నానన్నారు. అవినీతికి పాల్పడి.. ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తామన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించమని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ నినాదం.. విధానమని మరోసారి స్పష్టం చేశారు.
CM Chandrababu: తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాం: సీఎం చంద్రబాబు
ఆ వర్గాలకు గుడ్ న్యూస్..
ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమ న్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించామన్నారు. ఈ క్రమంలో నేడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశామని.. నేడు సుప్రీం కోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఇచ్చిన పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఆదరణ, ముందడుగు, చైతన్యం, రోష్నీ వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. మహిళల భద్రత, ఆత్మ గౌరవానికి పెద్ద పీట వేస్తామన్నారు. అందరికీ న్యాయం జరగాలి అనే తమ విధానానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేయాలన్నారు. ఇందుకు మనమందరం కంకణబద్ధులం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు జాతి నెంబర్-1 గా చేయాలనే సంకల్పానికి మీ సహకారం కోరుతున్నానన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మీ ఆశీస్సులు సదా ఉండాలి...
"రాజ్యాంగం ఎంత మంచిదయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. అదే విధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడు అయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులూ మంచివారే కాబట్టి ప్రజలకు నూటికి నూరుశాతం మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YS Sharmila: పంద్రాగస్టు రోజున ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు
Anagani Satyaprasad: విశాఖలో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి అనగాని
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 15 , 2024 | 11:35 AM