Attack On Jagan: వైఎస్ జగన్‌పై దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు
ABN, Publish Date - Apr 15 , 2024 | 10:34 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై (YS Jagan Reddy) జరిగిన రాళ్ల దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు వెల్లడించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సీపీ.. రాయితో దాడిచేసిన వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పుకొచ్చారు..
విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై (YS Jagan Reddy) జరిగిన రాళ్ల దాడి కేసులో సీపీ క్రాంతి రాణా కీలక విషయాలు వెల్లడించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సీపీ.. రాయితో దాడిచేసిన వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పుకొచ్చారు. ‘ సీఎం జగన్‌పై చేత్తోనే రాయిని విసిరారు. నిందితుడు ఎయిర్ గన్, క్యాట్ బాల్ వాడారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పడిన రాయి కూడా చేతిలో సరిపోయేంత ఉంది. కింద జనాల్లో నుంచే రాయిపైకి విసిరారు. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారు. అందుకే జగన్, వెల్లంపల్లి శ్రీనివాస్‌కు గాయాలు అయ్యాయి. నిందితుడు దొరికితే కుట్రం కోణం తెలుస్తుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. 307 సెక్షన్ కింద కేసు పెట్టాం. రాయి దాడి చేసిన వారి వివరాలు తెలిస్తే ఇవ్వాలని కోరుతున్నాం. కేసు విచారణ అవసరమైన సమాచారం ఇస్తే రెండు లక్షలు బహుమతి ఇస్తాం. ఆధారాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎనిమిది బృందాలు 40మందితో ఈ కేసు విచారణకు పని చేస్తున్నాయి. త్వరలోనే కేసును చేధిస్తున్నాం. ఇచ్చిన ఫిర్యాదు, జరిగిన ఘటన ఆధారంగా 307 సెక్షన్ పెట్టాం’ అని సీపీ మీడియాకు వెల్లడించారు.
కరెంట్ కట్ చేయడం వెనుక..!
‘నందిగామలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన వేరు. అప్పుడు అన్ని కోణాల్లో విచారణ చేశాం. ఫిర్యాదు చేసిన వారిని రావాలని కోరినా స్పందించలేదు. అన్ని పరిశీలించిన తరువాతే.. ఆ సెక్షన్‌లు పెట్టాం. జగన్‌పై దాడి ఘటనలో సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మకండి. జగన్‌పై దాడిచేసిన వారిని త్వరలోనే పట్టుకుంటాం. కరెంట్ వైర్లు తగిలే అవకాశం ఉండటం, రద్దీ రోడ్డులో కరెంట్ వైర్లతో ఇబ్బంది రాకుండా మేమే కరెంట్ చేశాం. అందుకే అక్కడ చీకటి వాతావరణం ఏర్పడింది. ఇదంతా సీఎం భద్రతా కోసం ప్రోటోకాల్‌లో భాగంగానే చేశాం. చీకటి, జనాల రద్దీని ఆసరాగా చేసుకొని నిందితుడు దాడి చేశాడు. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం. దాడి జరిగినపుడు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించాం. 50 మందికి పైగా అనుమానితులను విచారించాం. అతి త్వరలోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటాం’ అని సీపీ రాణా కేసు దర్యాప్తు పురోగతిని ఫొటోలు, వీడియోల ద్వారా వివరించారు.
Updated Date - Apr 16 , 2024 | 12:12 AM