AP News: ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెరగనుందా
ABN, Publish Date - Oct 09 , 2024 | 08:46 AM
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నెల11వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నట్లు తెలియవచ్చింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.
అమరావతి: ఏపీ (AP)లో మద్యం దుకాణాల (Liquor Shops) దరఖాస్తులకు ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మద్యం టెండర్ల షెడ్యూలును మార్చాలని ప్రభుత్వానికి పలువురు నుంచి విఙప్తులు వచ్చాయి. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో దరఖాస్తులకు గడువు పెంచే అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. బుధవారం సాయంత్రానికి మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేపి దరఖాస్తుల గడువు పెంచే అవకాశం ఉందని తెలియవచ్చింది. ఈ నెల 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది.
కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మద్యం దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి. మంగళవారం నాటికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2,503 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో 99 షాపులకు నంద్యాల జిల్లాలో 1,501 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపునకు 15 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, కోసిగి, ఆదోని, పత్తికొండ, ఆలూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 99 మద్యం దుకాణాలు ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా ఈ షాపులను లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఈ నెల ఒకటో తారీఖు నుంచి లీజుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేయవచ్చు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు నిర్ణయించారు. లాటరీ షాపు తగిలినా.. తగలకపోయినా ఈ డబ్బును వెనక్కి ఇవ్వరు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మద్యం షాపులకు దరఖాస్తులు చేయకుండా అడ్డుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు కొందరు మద్యం షాపు దరఖాస్తు చేయడానికి స్టేషనకు వెళితే ఎమ్మెల్యేతో చెప్పివచ్చావా..? అంటూ వింత ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విషయం మీదే ‘ఎమ్మెల్యే సారుతో చెప్పారా..? అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధి నాయకులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆఫ్‌లైన్, ఆనలైన్‌లో దరఖాస్తులు వెల్లువెత్తాయి. 5వ తేది వరకు కేవలం 128 దరఖాస్తులు వస్తే.. ఆంధ్రజ్యోతి కథనం తరువాత దరఖాస్తులు వెల్లువెత్తాయి. కేవలం ఈ మూడు రోజుల్లోనే 1,373 దరఖాస్తులు రావడం జిల్లా ఎక్సైజ్ శాఖ చరిత్రలో రికార్డు అని అంటున్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేయనున్న 123 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఈ నెల 11వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ప్రాంగణంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు. ఇందు కోసం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎనిమిది మంది ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తారు. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు బ్యాంకు కౌంటర్లలో నిర్దేశించిన నగదును చెల్లిస్తే వెంటనే 15 రోజులకు సరిపడా లైసెన్సును మంజూరు చేస్తారు. అయితే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఆయా సబ్‌డివిజన్‌ల ఎక్సైజ్ సీఐలు పరిశీలిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఈ 15 రోజుల వ్యవధిలోనే పూర్తిస్థాయి లైసెన్సులను ఇస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 123 మద్యం దుకాణాలకు 361 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసచౌదరి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు తెలిపారు. ఒక్కో షాపునకు కనీసంగా 20కి తగ్గకుండా దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కృత్తివెన్నులో మూడు, అవనిగడ్డలో ఒకటి, పెడనలో ఒకటి, నందివాడలో మూడు, పామర్రులో రెండు, గుడివాడలో రెండు, బాపులపాడులలో మూడు మద్యం దుకాణాలకు సోమవారం నాటికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలో అన్ని మద్యం షాపులకు దరఖాస్తులు వస్తాయని తెలిపారు. మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిన కేటాయించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సరిపడా సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించామని వారు వివరించారు. తొలుత కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని, అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు నోబుల్ కళాశాల ప్రాంగణానికి మార్పు చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాసర సరస్వతీ దేవి ఆలయంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు
సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 09 , 2024 | 11:04 AM