Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్..
ABN, Publish Date - Nov 01 , 2024 | 07:29 AM
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, గన్నవరం సభలో తాను కొన్ని హామీలు ఇచ్చానని.. అవి గుర్తున్నాయని, ఎలాంటి సందేహం అవసరం లేదని.. త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, అమెరికా: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ (Minister Lokesh) పర్యటన అమెరికా (America)లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహాన్ని (NTR Statue) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము (Venigandla Ramu), యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao), కోమటి జయరాం (Komati Jayaram) తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రవాస ఆంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అభిమానులు హెలికాప్టర్ నుంచి గులాబీ రేకులను వెదజల్లారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రెడ్ బుక్‌లో ఒక చాప్టర్ ఓపెన్ అయిందని, రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయిందని, మూడో చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని అన్నారు.
తగ్గేదే లేదు..
మనం తగ్గేదే లేదని.. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, గన్నవరం సభలో తాను కొన్ని హామీలు ఇచ్చానని.. అవి గుర్తున్నాయని, ఎలాంటి సందేహం అవసరం లేదని.. త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. ఆ ప్రభుత్వంలో తాను కూడా ఒక బాధితుడునేనని, యవగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, స్టూల్ ఎక్కి మాట్లాడితే అది తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తనకు అండగా నిలిచింది టిడిపి కార్యకర్తలని.. ఆ రోజే తాను రెడ్ బుక్ గురించి చెప్పానని... కానీ అప్పుడు సైకోకు ఎక్కలేదన్నారు. ఇప్పుడు భయపడుతు...గుడ్ బుక్ తీసుకువస్తానని... నోట్ బుక్‌లో ఏమి రాయాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కలుపుకుని ముందుకు తీసుకువెళ్లాలని.. రాష్ట్రం అప్పుడే ముందుకు వెళుతుందన్నారు. రెడ్ బుక్కే కాదు... పెట్టుబడులు కూడా రాష్ట్రానికి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రజలు మనపై గురుతరమైన బాధ్యత పెట్టారన్న సంగతి ఎప్పుడు ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల కోసం అమెరికాలో ఎంతో మందిని కలిసానని.. కానీ ఈ సభ తనకు సూపర్ కిక్ ఇచ్చిందని లోకేష్ అన్నారు. భారతదేశానికి సంక్షేమం అంటే ఏమిటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రపంచంలో తెలుగువారు తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో తాము ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. మిమ్మల్ని అందరూ ఎన్నారైలు అంటారు కానీ నేను మిమ్మల్ని ఎమ్మారైలని పిలుస్తానన్నారు. MRI అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ అని చెప్పారు. మీరు ఉపాధి అవకాశాల కోసం రెండు సూట్ కేసులు సర్దుకుని అమెరికా వచ్చారు.. కానీ మీ ఆలోచన అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలన్న తలంపేనని.. భారతదేశంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఉన్న ఎన్నారైలు అందరూ కలిసి సైకోని ఇంటికి పంపించామన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశమైంది ..
కూటమి పార్టీ గెలుపు ఏ ఒక్కరిదో కాదని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారిదని లోకేష్ అన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెట్టి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చేవారని, వాటికి కూడా భయపడకుండా ఎన్నారైలు నిలబడ్డారని కొనియాడారు. గత ప్రభుత్వం రూ. వెయ్యి పెన్షన్ కోసం ఐదేళ్ల పట్టిందని, కూటమి గెలిచిన వెంటనే పెన్షన్ పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీకి జోడెడ్ల బండి లాంటివన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశమైందని, ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారిని భయపెట్టారన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో భారతదేశంలో ఏ పార్టీకి రానంత మెజార్టీని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలి.. సైకోని తరిమి కొట్టాలన్న ఆలోచన తెలుగువారిలో వచ్చిందన్నారు.
టిడిపికి బలం బలగం పార్టీ కార్యకర్తలే..
ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తోందని... దానికి కారణం చంద్రబాబు నాయుడు (CBN) అని లోకేష్ అన్నారు. మంగళగిరి ప్రజలు తనను 91 వేల ఓట్లతో గెలిపించారన్నారు. TCS ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి కారణం చంద్రబాబేనన్నారు. టిడిపికి బలం బలగం పార్టీ కార్యకర్తలేనని, ఎన్టీఆర్ ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో తెలియదు గానీ.. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు కేవలం తెలుగుదేశానికి ఉన్నారన్నారు. చెయ్యని తప్పుకు చంద్రబాబును జైల్లో బంధించారని.. అది ఇప్పటికే తలుచుకుంటే బాధేస్తుందన్నారు. రాష్ట్రం భారతదేశమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు అండగా నిలిచారన్నారు. హైదరాబాదులో చంద్రబాబు కోసం 45 వేల మంది మద్దతుగా నిలిచారని లోకేష్ తెలిపారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ..
అట్లాంటా నుంచి తాను అభివృద్ధి చెందానని.. గుడివాడకు ఎంత కొంత చేయదలుచుకున్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు. తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ అంత ఖ్యాతి గడించిన వ్యక్తి మరొకరు లేరన్నారు. గత ఐదేళ్ల నుంచి తెలుగు ప్రజలు పడ్డ బాధ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బాధ తీరిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ సిస్టం ఎత్తేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనియాడారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను ఎమ్మెల్యే గా గెలిచానన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని దౌర్భాగ్యస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రవసాంధ్రులుగా మీ నియోజకవర్గాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరారు.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కామెంట్స్...
ఎన్టీఆర్ చేసిన పనులు చేయాలంటే ఎవరికైనా గట్స్ ఉండాలిని, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను రాజకీయాల్లో తీసుకొచ్చారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ఇప్పటికి అమలు చేస్తున్నామని, ఆ పథకాన్ని తీసే సాహసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు. పంచారామ క్షేత్రాలు ఎలా ఉంటాయో.. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కదిలించలేరని అన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఎన్టీఆర్ కల్పించారని.. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం పాటించడం లేదని.. అది ఆయన విజ్ఞాతకు వదిలేశామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు.
నగిరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ కామెంట్స్..
అట్లాంటా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ని చూస్తున్నట్టుందని, ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని భాను ప్రకాష్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే తెలుగువారి సత్తా ప్రపంచం మొత్తం తెలిసిందన్నారు. కోమటి జయరాం మాట్లాడుతూ.. అమెరికాలో సైతం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్న ఘనత మన తెలుగువారిదని, ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నారైలు అండగా ఉంటారని, చంద్రబాబు, లోకేష్‌ల సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకు వెళుతుందని కోమటి జయరాం వ్యాఖ్యానించారు.
Updated Date - Nov 01 , 2024 | 07:29 AM