Share News

వస్తారు.. వెళ్తారు.. సమస్యలు పరిష్కరించరు..!

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:44 AM

‘గడప గడపకు మన ప్రభుత్వం అని ఈ ప్రాంత ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్‌ ఎన్నోసార్లు వచ్చారు. వారికి మా సమస్యలను స్వయంగా దగ్గరుండి చూపించినా ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇప్పుడు వారిని కాదని కొత్తగా నేనే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ మీరొచ్చారు. చూసి వెళ్లిపోతారు తప్ప మా సమస్యలకు పరిష్కారం చూపించరు.’ అంటూ నగరంలోని 29వ డివిజన్‌ వాసులు వైసీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావును నిలదీశారు.

వస్తారు.. వెళ్తారు.. సమస్యలు పరిష్కరించరు..!
ఎమ్మెల్యే వెలంపల్లిని నిలదీస్తున్న స్థానికుడు కిరణ్‌

ఎమ్మెల్యే వెలంపల్లిని నిలదీసిన 29వ డివిజన్‌వాసులు

సమాధానం చెప్పలేక జారుకున్న వెలంపల్లి

అజిత్‌సింగ్‌నగర్‌/మధురానగర్‌, మార్చి 7 : ‘గడప గడపకు మన ప్రభుత్వం అని ఈ ప్రాంత ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్‌ ఎన్నోసార్లు వచ్చారు. వారికి మా సమస్యలను స్వయంగా దగ్గరుండి చూపించినా ఒక్కటి కూడా పరిష్కరించలేదు. ఇప్పుడు వారిని కాదని కొత్తగా నేనే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ మీరొచ్చారు. చూసి వెళ్లిపోతారు తప్ప మా సమస్యలకు పరిష్కారం చూపించరు.’ అంటూ నగరంలోని 29వ డివిజన్‌ వాసులు వైసీపీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావును నిలదీశారు. ‘ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించలేనప్పుడు, మేము చెప్పిన సమస్యలను పరిష్కరించలేనప్పుడు ఎవరొచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా మాకేంటి లాభం’ అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 29వ డివిజన్‌ కొబ్బరితోట, యూవీ నరసరాజు రోడ్డు ప్రాంతంలో గురువారం ఉదయం ‘జగనన్న కావాలి.. శీనన్న రావాలి..’ కార్యక్రమంలో భాగంగా వెలంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు వెళ్లి వైసీపీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. గద్దె బాబూరావు రోడ్డులో అత్కూరి కిరణ్‌ అనే వ్యక్తితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ ఇంటి వద్దకు వచ్చిన వెలంపల్లి శ్రీనివాసరావును ప్రశ్నించారు. ఐదేళ్లుగా రోడ్డు అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణం పూర్తికాకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే 108 అంబులెన్స్‌ డివిజన్‌లోకి రావడానికి ఇబ్బందిగా ఉందని, గతంలో సిటీ బస్సు వచ్చేదని, ఆర్‌యూబీ పూర్తి కాకపోవడంతో బస్సులు రావడం లేదని, రోడ్లు బాగాలేదని, డ్రెయినేజీ సరిగ్గా లేదని, మంచినీరు, దోమల సమస్య తీవ్రంగా ఉందని.. ఒకదాని తర్వాత ఒకటి ఏకరువు పెట్టారు. దీనికి వెలంపల్లి స్పందిస్తూ.. కొన్ని కారణాల వల్ల ఆర్‌యూబీ ఆలస్యమైనా రెండు నెలల నుంచి యుద్ధ ప్రాతిపాదికన పనులు చేస్తున్నారని, మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే విష్ణు కూడా ఇలాగే చెబుతున్నారని, ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన వాస్తవ పరిస్థితులు తెలిసినా ఇంకా ఇలా ప్రవర్తించడం సరికాదని, మీరు నాకు ఓటు వేయకపోయినా పర్లేదని చెప్పి వెళ్లిపోయారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక వైసీపీ కార్పొరేటర్‌ కొంగితల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

మా ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తారా?

‘మా ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తారా.. సమస్యలేమైనా ఇప్పుడే వచ్చాయా... ముందు నుంచి లేవా’ అంటూ ఎమ్మెల్యే వెలంపల్లి అనుచరులు స్థానికులను బెదిరించే ప్రయత్నం చేశారు. వారిపై తిట్ల పురాణంతో విరుచుకుపడ్డారు. మరికొందరు అనుచరులు ఏకంగా ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 12:44 AM