Adhra Pradesh: వామ్మో జోగి.. ఓడిపోయినా ఆగని మాజీమంత్రి అక్రమాలు
ABN, Publish Date - Jul 27 , 2024 | 01:21 AM
Adhra Pradesh: పెడన నియోజకవర్గంలో ఇంకా జోగి రమేశ్ హవా కొనసాగుతోందా? నియోజకవర్గంలో ఆయన చేసిన భూదందాలు, అసైన్డ్, ప్రభుత్వ భూముల స్వాధీనంలో..
పెడన నియోజకవర్గంలో ఇంకా జోగి రమేశ్ హవా కొనసాగుతోందా? నియోజకవర్గంలో ఆయన చేసిన భూదందాలు, అసైన్డ్, ప్రభుత్వ భూముల స్వాధీనంలో జరిగిన అక్రమాలు బయటపడకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారా? పెడన నుంచి పెనమలూరు వెళ్లినా, ఆయనకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్న కీలక వ్యక్తులు, అధికారులు ఎవరు? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఐదేళ్లుగా జోగి రమేశ్ చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకు, తనకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
మచిలీపట్నం : కృత్తివెన్ను మండలం గరిసపూడి రెవెన్యూ గ్రామ పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ భూములున్నాయి. సముద్రపు ఆటుపోట్లు సంభవించే సమయంలో ఉప్పునీరు ఈ భూముల్లోకి వచ్చిపోతూ ఉంటుంది. దీంతో రైతులు ఈ భూములను సాగు చేయకుండా అలాగే ఉంచేశారు. ఈ గ్రామ పరిధిలోని భూములపై కన్నేసిన అప్పటి మంత్రి జోగి రమేశ్ లీజు పేరుతో 300 ఎకరాలను రైతుల నుంచి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కొంతమంది రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు లీజు చెల్లిస్తానని, ఏడేళ్ల పాటు లీజు అగ్రిమెంట్ చేసుకున్నాడు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 300 ఎకరాల అసైన్డ్ భూములు, మరికొంత ప్రభుత్వ భూమిని భీమవరానికి చెందిన బడాబాబులకు ఏడాదికి ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు సబ్‌లీజుకు ఇచ్చి, వారితోనే చెరువులుగా తవ్వించాడు.
ఈ వ్యవహారంలో అప్పట్లో రూ.కోట్లు చేతులు మారాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ భూములను చెరువులుగా తవ్వుతున్నా ఎవరూ ఆ వైౖపునకు వెళ్లకుండా అధికారులను కట్టడి చేశాడు. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ఇదే తరహాలో అసైన్డ్, ప్రభుత్వ భూములను చేపలు, రొయ్యల చెరువులుగా మార్పించాడు. ఈ భూ ఆక్రమణలకు ఎవరూ అడ్డు చెప్పకుండా అసైన్డ్ భూములకు పేదల పేరిట పట్టాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తన చుట్టూ తిరిగే కార్యకర్తలు, మాజీ సైనికుల పేర్లతో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని రెండువేల పేర్లతో జాబితాలు తయారు చేయించాడు. ఈ జాబితాల ఆధారంగా పేదలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని అప్పట్లో రెవెన్యూ అధికారులు, ఇద్దరు కలెక్టర్లపైనా ఒత్తిడి తెచ్చాడు. ఈ అంశం ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో వివాదాస్పదమైంది.
అధికారం మారినా..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. వీటిని జోగి రమేశ్ కబంధ హస్తాల నుంచి ఖాళీ చేయించేందుకు కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి భూములను లీజుకు తీసుకున్న భీమవరం బడాబాబులు ఆ భూములను ఖాళీ చేయాల్సి వస్తే తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. మాజీమంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన జోగి ఈ భూములకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఉండేందుకు వారంలో జరిగే తహసీల్దార్ల బదిలీల్లో తనకు అనుకూలమైన అధికారులను కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పోస్టింగ్ ఇప్పిస్తానని, కంగారు పడవద్దని అభయమిచ్చిన ట్లు సమాచారం. తనకు అనుకూలంగా ఉండే అధికారులను ఎంపిక చేసుకుని వారిని ఆ మండలాల్లో నియమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది. ఈ రెండు మండలాల తహసీల్దార్ల నియామకంలో కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Also Read:
ప్రతి నెలా ప్రోగ్రెస్ రిపోర్ట్..
ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్
బయబటపడనున్న వైసీపీ నేతల బండారం..!
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jul 27 , 2024 | 01:40 PM