Kurnool: విద్యార్ధినిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ అత్యాచార యత్నం
ABN, Publish Date - Nov 13 , 2024 | 08:29 AM
కర్నూలు జిల్లా, కోసిగి మండలం, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
కర్నూలు: ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చి, కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ మహిళలపై అత్యాచార ఘటనలు (Rape Incidents) ఆగడం లేదు. మహిళలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా ఓ విద్యార్ధినిపై (Student) వైఎస్సార్సీపీ సర్పంచ్ (YSRCP Sarpanch) అత్యాచార యత్నం (Rape attempted) చేశాడు. కర్నూలు జిల్లా, కోసిగి మండలం, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన నరసరావుపేటకు చెందిన వెలమూడి సుధారాణిపై ఆదోని వెంకన్నపేటకు చెందిన టిడిపి బూత్ కమిటీ సభ్యుడు కురువ రవి ఫిర్యాదు చేశారు. దీంతో ఆదోని టూ టౌన్ పోలీసులు సుధారాణిపై కేసు నమోదు చేశారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’
ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు.. ఇదో... వ్యవస్థీకృత నేరం.. కులాల మధ్య కుంపట్లు రాజేయడం.. సమాజంలో చిచ్చు పెట్టడం.. మహిళలను మానసికంగా వేధించడం.. బాలికలనూ వదలకుండా కామెంట్లతో హింసించడం.. గౌరవంగా బతికే దళితులను అవమానించడం.. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం.. పనిలోపనిగా బలవంతపు వసూళ్లకూ పాల్పడటం.. వైసీపీ సోషల్ మీడియా వెనుక ఇంతటి విషం దాగుందని పోలీసులు పేర్కొన్నారు.
కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకూట విషం చిమ్మే ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు అనేక సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో వర్రాను ఏ1గా పేర్కొనగా... వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డిని రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. వర్రాతోపాటు... అతడికి సహకరించిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వర్రా వాంగ్మూలం ఆధారంగా అనేక కీలక అంశాలను గుర్తించామని, ఈ వ్యవస్థీకృత నేరంలో భాగస్వాములైన మొత్తం 45 మందిపై కేసు నమోదు చేశామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పులివెందుల కోర్టుకు దీనిని సమర్పించారు. వర్రా రవీంద్రా రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన 40 నీచమైన వ్యాఖ్యల స్ర్కీన్‌షాట్లను కూడా సేకరించామని... అవి తాను పోస్టు చేసినవే అని అతడు అంగీకరించాడని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా పేరుతో జరిగే ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’లో వర్రా రవీంద్రా రెడ్డి భాగస్వామిగా ఉంటూ నీచమైన పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్‌లో తప్పుడు వార్తలు సృష్టించడం, నీచమైన వ్యాఖ్యలు చేయడం వ్యవస్థీకృతంగా జరుగుతోందన్నారు. ఇందులో... సజ్జల భార్గవ్ రెడ్డితోపాటు సిరిగిరి అర్జున్ రెడ్డి (ఏ3)ది కీలక పాత్ర అని తెలిపారు. ‘‘వైసీపీ సోషల్ మీడియా నుంచి వచ్చే కంటెంట్ తీసుకుని చిన్నపిల్లలు, మహిళలపై అసభ్య, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం.. తమకు నచ్చని పార్టీలనేతలపై జుగుప్సాకరమైన మార్ఫింగ్ ఫొటోలు పెట్టడం.. హోంమంత్రి అనిత వ్యక్తిత్వాన్ని హననం చేయడం.. వ్యవస్థలంటే లెక్కలేకుండా రెచ్చిపోవడం వర్రా రవీందర్ రెడ్డి నేర స్వభావం’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
భయానక వాతావరణం...
‘‘అనుచిత పోస్టులు వ్యాప్తిచేసే వైసీపీ సోషల్ మీడియా విభాగంలో వర్రా రవీందర్ రెడ్డి 2012 నుంచే భాగస్వామిగా ఉన్నాడు. అతడికి సజ్జల భార్గవ్‌రెడ్డి తదితరులతో మంచి సంబంధాలున్నాయి. వైసీపీ సోషల్ మీడియా విభాగం కోకన్వీనర్‌గా వర్రా క్రియాశీలక పాత్ర పోషించాడు. అప్పట్లో అధికారంలో ఉండటంతో... ఏమాత్రం భయంలేకుండా తప్పుడు వార్తలు సృష్టించి, ప్రచారం చేశారు. ఏ1 వర్రా రవీంద్రా రెడ్డి, ఏ2 సజ్జల భార్గవ రెడ్డి, వారి బృందంలోని సభ్యులు నైతికత, నీతి లేకుండా... విచ్చలవిడిగా, దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తమకు గిట్టని పార్టీల నాయకులను, వారి కుటుంబ సభ్యులను, పిల్లలను అవమానించేలా పోస్టులు పెట్టారు. సాధారణ జీవితం గడిపేందుకే భయపడేలా చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి... హింసను రాజేశారు. తాడేపల్లి నుంచి వచ్చే కంటెంట్‌ను వీలైనంత ఎక్కువ మందికి చేరవేసేందుకు ప్రతినెలా 13వేలు వేతనం తీసుకొంటున్నట్లు వర్రా రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పాడు’’ అని పోలీసులు తెలిపారు. చట్టంపై గౌరవం, భయం ఏమాత్రంలేని ఇటువంటి వ్యక్తిని బయటికి వదిలితే సమాజానికి నష్టం జరుగుతుందని, జైల్లో పెట్టాలని కోర్టును అభ్యర్థించారు.
ఇదీ కేసు...
2023 డిసెంబరు నుంచి మంద కృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి కలత చెందారు. పులివెందులలో జయమ్మ కాంప్లెక్స్‌లో ఉంటున్న వర్రా రవీందర్ రెడ్డి వద్దకెళ్లి... ఆ వ్యాఖ్యలను తొలగించాలని అడిగారు. అందుకు ఆయన ఇందుకు నిరాకరించి, కులం పేరుతో దూషించాడు. 2లక్షలిస్తే పోస్టులు తొలగిస్తానని డిమాండ్ చేశాడు. విధిలేని పరిస్థితుల్లో హరి 20వేలు ఇచ్చి మిగతా డబ్బు విడతల వారీగా ఇస్తానని చెప్పాడు. అయినా కామెంట్స్ తొలగించలేదు. దీంతో ఈనెల 8న పోలీసులకు హరి ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి దోర్నాల-కుంట మార్గంలో ఒక కారులో వర్రా పారిపోతున్నట్లు గుర్తించారు. కారు నడుపుతున్న గురజాల ఉదయ్ కుమార్‌రెడ్డి భారతీ సిమెంట్స్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మరొకరు... గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి. వీరిద్దరూ వర్రా రవీంద్రా రెడ్డికి సన్నిహితులు. ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండు విధించింది.
సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎల్‌వోసీ..
రాజకీయ ప్రత్యర్థులపై బూతు పురాణానికి బీజం వేసిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యుడు సజ్జల భార్గవ్‌రెడ్డి కోసం పోలీసుల వేట ముమ్మురం చేశారు. ఆయన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో గాలింపు మొదలుపెట్టారు. ఆయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ చేశారు. కడప జిల్లాలో నమోదైన కేసుల్లో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కోసం ఎల్‌వోసీ జారీ చేశామని, వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరు సోషల్ సైకోలపైనా ఎల్‌వోసీలు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 13 , 2024 | 08:29 AM