ఘనంగా కార్తీక పౌర్ణమి
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:55 AM
జిల్లాలో శుక్రవారం శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి.
నంద్యాల కల్చరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. నంద్యాలలోని ప్రథమనంది, నాగనంది, సోమనంది, సంజీవనగర్ రామాలయం, అమ్మస్పటికలింగేశ్వ రాలయం, బ్రహ్మనందీశ్వరాలయం, మల్లికార్జున స్వామి, శ్రీకృష్ణ మందిరం తదితర ఆలయాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. పలు శివాలయాలలో ఆకాశదీపాలు, జ్వాలాతోరణం వెలిగించారు. సంజీవనగర్ కోదండ రామాలయంలో భగవత్ సేవాసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, అరుణాచల కార్తీక దీపోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, జ్వాలాతోరణం నిర్వహించారు. అమ్మస్పటికలింగేశ్వరాలయంలో స్వామికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అన్నదానం ఏర్పాటు చేశారు.
మహానంది: మహానంది క్షేత్రంలో కార్తీకపౌర్ణమి పురష్కరించుకొని వేలాదిమంది భక్తులు శుక్రవారం దర్శనం కోసం తరలి వచ్చారు. ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. నంద్యాల నుంచి రాధా మనోహర్ దాస్ స్వామిజీ ఆధ్వ ర్యంలో నందుల ప్రదక్షిణగా తరలివచ్చిన భక్తులకు మహానంది గ్రామ గ్రామాన ప్రజలు స్వాగతం పలికారు. మసీదుపురానికి చెందిన టీడీపీ నాయకుడు నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వందలాది బైక్‌ల ద్వారా భక్తులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ఓంకారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురష్కరిం చుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వేకువజామున్నే ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కాశిరెడ్డినాయన, ఆర్యవైశ్య ఆశ్రమాల్లో భక్లుకు అన్నదానం చేశారు.
పాణ్యం: పాణ్యం బృంగేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులు లక్ష దీపాలతో అర ఎకరంలో మహా శవలింగం ఆకృతిని నిర్మించారు. ఈదీపోత్సవంలో గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బృంగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గడివేముల: గడిగరేవుల సమీపంలో వెలసిన దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం స్వామి వారి కళాణోత్సవం కమనీయంగా జరిగింది. స్వామి వారి ఉత్సవమూర్తులకు గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు.
ఆత్మకూరు: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణంలోని శివాలయాలు శోభిల్లాయి. పట్టణంలోని సిద్ధేశ్వరాలయం, ఉమామహేశ్వరాలయం, ఆత్మలింగేశ్వరాలయం, మార్కండేయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆయా ఆలయాల్లో శివలింగాలను అభిషేకించడంతో పాటు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మకూరు శివారులోని జంబులాపరమేశ్వరీ అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆత్మకూరు రూరల్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లమల అభయారణ్యంలో వెలసిన రుద్రకోటేశ్వరాల యానికి శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రుద్రాణిసహిత రుద్రకోటేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల సమయంలోనే ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు చేశారు. క్షేత్ర పరిధిలో ఉన్న నాగులకట్ట వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు.
నందికొట్కూరు: నియోజకవర్గంలోని శివాలయాల్లో పూజలు నిర్వహించారు. శుక్రవారం కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా నందికొట్కూరులోని నగరేశ్వరుడు శివాలయంలో పత్తి ఒత్తులతో అలంక రణతో ఆ పరమశివుడిని అలంకరించి పూజలు నిర్వహించారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలోని శివాల యాన్ని జ్వాలాతోరణంలో అలంకరించారు. అనంతరం జ్వాలా తోరణాన్ని నిర్వహించారు.
పాములపాడు: మండలంలోని శివాలయాలలో తెల్లవారుజాము నుంచే భక్తులు శివలింగానికి పంచామృతాభిషేకాలు నిర్వహించి, బిల్వ పత్రాలు సమర్పించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు. పాములపాడు బ్రహ్మంగారి ఆశ్రమంలోని శివాలయం ప్రాంగణంలోని ఉసిరి చెట్టు, నందీశ్వరుడి విగ్రహం వద్ద, భక్తులు కార్తీక దీపాలు వెలగించారు. నిర్వాహకులు ఆకాశ దీపాన్ని వెలగించారు.
కొత్తపల్లి: సప్తనదుల సంగమేశ్వరానికి భక్తులు పోటెత్తారు. ఉమామహేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. పురోహితుడు తెలకపల్లి రఘురామశర్మ ఉమా మహేశ్వరస్వామి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. కొలను భారతి అమ్మవారిని, సప్త శివాలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:55 AM