Fire Accident: విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..
ABN, Publish Date - Aug 04 , 2024 | 11:04 AM
వైజాగ్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో (Korba - Visakhapatnam Express ) ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి..
విశాఖపట్నం: వైజాగ్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్టేషన్‌లో ఆగివున్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో (Korba - Visakhapatnam Express ) ఒక్కసారిగా మంటలు వచ్చేశాయి. ఇవాళ ఉదయం కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు.. మరికాసేపట్లో విశాఖపట్నం నుంచి తిరుమల బయల్దేరాల్సి ఉండగా నాలుగో నంబర్ ఫ్లాట్ పారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మంటల్లో బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కాగా ఈ మూడూ ఏసీ బోగీలే. రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు.. రైల్వేస్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. హుటాహుటిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని అధికారులు బయటికి పంపారు. రైల్వే, ఫైర్ సిబ్బంది రంగంలోకి మంటలు ఆర్పారు.
ఎందుకు.. ఏమైంది..!?
ఏసీ బోగీల్లో మంటలు రేగినట్లు, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫైర్, రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణ నష్టం లేదు. రైల్లో మంటల వ్యాప్తిపై అన్ని కోణాల్లోనూ అధికార యంత్రాంగం దర్యాప్తు మొదలుపెట్టింది. రైల్లో ప్రయాణికులు లేకపోవడం.. స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి పంపడంతో పెను ప్రమాదమే తప్పినట్టయ్యింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆరా తీస్తున్నాం..!
ఈ ప్రమాదంపై జాయింట్ సీపీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ‘ఉదయం 10 గంటలకు బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులను సురక్షితంగా రైల్లో నుంచి దింపాం. నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నాలుగు అగ్నిమాపక కేంద్రాల ద్వారా మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం. కాలిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి వాటిని మరో ప్రదేశానికి తరలిస్తున్నాం. ట్రాక్‌ను క్లియర్ చేస్తున్నాం’ అని తెలిపారు. మరోవైపు.. ఈ ఘటనపై డీఆర్ఎంతో ఎప్పటికప్పుడు హోం మంత్రి అనిత వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Aug 04 , 2024 | 01:32 PM