అసభ్య పోస్టులపై ఉక్కుపాదం
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:33 AM
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఇతర మంత్రులు సహా వారి కుటుంబాల్లోని మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
పంచ్ ప్రభాకర్ సహా పలువురి పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు
నారా లోకేశ్‌ను కించపరుస్తూ పోస్టు పెట్టిన వ్యక్తికి రిమాండ్
వైసీపీ మాజీ మంత్రి కాకాణిని 2 గంటలు విచారించిన పోలీసులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ఇతర మంత్రులు సహా వారి కుటుంబాల్లోని మహిళలపై బండ బూతులతో విరుచుకుపడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరాచక శక్తులను గుర్తించి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరింత మందిని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. పలు జిల్లాల్లో కొత్తగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు రెండు గంటలపాటు విచారించారు. టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై ఆయనను ప్రశ్నించారు. మూడు నెలల క్రితం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపాకుల పెంచలయ్య నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు రాజగోపాల్‌రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని కాకాణి తన వ్యక్తిగత ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ..
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్య లు చేశారు. దీనిపై తెలుగురైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణమనాయు డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర గంటలకుపైగా కాకాణిని పలు కోణాల్లో విచారించారు. విశాఖ జిల్లా, గాజువాక మండలానికి చెందిన బోడి వెంకటేశ్‌ను బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అతనికి అద్దంకి కోర్టు రిమాండ్ విధించగా ఒంగోలు జైలుకు తరలించారు. వైసీపీకి చెందిన వెంకటేశ్ తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వచ్చిందని, అలాగే మంత్రి నారా లోకేశ్‌ను కించపరుస్తూ, అసభ్యకరంగా ఫొటోను పోస్టు చేశారు. మరోవైపు విదేశాల్లో ఉంటూ టీడీపీ, జనసేన నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై ప్రభాకర్ అసభ్య పోస్టులు పెట్టడంతోపాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా చందలూరుకు చెందిన మురకొండ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రేణంగివరం ఎస్‌ఐ వినోద్‌బాబు తెలిపారు. సోషల్ మీడియాలో వైసీపీ తరఫున యాక్టివ్‌గా ఉండే పెద్దిరెడ్డి సుధారాణిపై చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పెరుగు ముద్దుకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సైబర్ నేరాలపై రాజీపడం: డీజీపీ
తిరుపతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సైబర్ నేరాలను కట్టడి చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ‘సైబర్ క్రైం, డ్రగ్స్ క్రైం- అగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ర్డెన్’ అంశంపై సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. సైబర్, డ్రగ్స్ వంటి నేరాలతోపాటు, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. నేరాలు రూపాంతరం చెందుతున్నాయని, సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు ఉంచకపోవడం మంచిదన్నారు. ప్రతి జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ చెప్పారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, పద్మావతి వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజని, విద్యార్థినులు పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 04:33 AM