విద్యార్థులకు 6,500కోట్ల బకాయిలు పెట్టి..
ABN, Publish Date - Nov 25 , 2024 | 05:07 AM
విద్యార్థులకు రూ.6,500కోట్లు బకాయిపెట్టి పోయిన జగన్ సుద్దపూసలా ‘ఎక్స్’లో రాసుకొచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన పాపం మీదే జగన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుద్దపూసలా.. ఆ రాతలేంటి జగన్!
‘ఎక్స్’లో విద్యా మంత్రి లోకేశ్ ఫైర్
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు రూ.6,500కోట్లు బకాయిపెట్టి పోయిన జగన్ సుద్దపూసలా ‘ఎక్స్’లో రాసుకొచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన పాపం మీదే జగన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విధానాలతో విద్యా వ్యవస్థ ఎలా మారిందో ఆదివారం ‘ఎక్స్’లో లోకేశ్ పేర్కొన్నారు. ‘గుడ్లు, చిక్కీలు మొదలు ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకూ మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాలా రూ.6,500కోట్లు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను తక్షణమే అందజేయాలని కళాశాలలను ఆదేశించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును నేరుగా కళాశాలలకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నాం. మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా? గత ఐదేళ్లలో మీ వల్ల భ్రష్టుపట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత. ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డీఎస్సీతో భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాం. మీలాంటి మారీచులు ఎంత తప్పుడు ప్రచారం చేసినా విద్యారంగ సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ మాట్లాడడం సిగ్గుచేటు: స్వామి
టంగుటూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడడం సిగ్గుచేటని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టింది మీరే కదా జగన్.. అని మంత్రి ప్రశ్నించారు. ఐదేళ్లపాటు విద్యార్థులను మోసం చేసిన జగన్ అధికారం కోల్పోయాక మొసలి కన్నీరు కార్చుతున్నాడని విమర్శించారు.
Updated Date - Nov 25 , 2024 | 05:07 AM