Minister Nimmala Ramanaidu : 14 నుంచి సాగు నీటి సంఘాలకు ఎన్నికలు
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:55 AM
ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
వర్గ, రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవాలు కావాలి: మంత్రి నిమ్మల
అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజోతి): ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణం. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, చివరి ఎకరం వరకూ సాగునీరందజేయాలన్నదే లక్ష్యం. అందులో భాగంగానే సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. సాగునీటి సంఘాలకు మూడు అంచెల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలిరోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు, మూడో రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నాం. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించాం. సేవా దృక్పథంతో పని చేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతి నిధులుగా ఉండడం ఎంతో అవసరం. ఎటువంటి వర్గ, పార్టీ పోరు లేకుండా సాధ్యమైనంత మేర ఏకగ్రీవంగా ప్రతినిధులను ఎన్నుకోవాలని అధికారులను ఆదేశించాం. గత ప్రభుత్వం సాగు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు విడుదల చేయలేదు. ప్రాజెక్టులన్నింటినీ గాలికి వదిలేసింది’ అని మంత్రి నిమ్మల తెలిపారు.
Updated Date - Dec 06 , 2024 | 04:55 AM