Minister P. Narayana : మున్సిపాలిటీలకు ఏప్రిల్ నుంచి నేరుగా నిధులు
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:44 AM
పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సీఎఫ్ఎంస్‌తో పని లేకుండా ...
5 అంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి నిర్మాణాలు
మున్సిపాలిటికీ డబ్బు చెల్లిస్తే
అన్ని అనుమతులూ మంజూరు
అన్ని శాఖలూ దానితో అనుసంధానం: మంత్రి నారాయణ వెల్లడి
పెదకాకాని, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సీఎఫ్ఎంస్‌తో పని లేకుండా నేరుగా మున్సిపాలిటీలకే బిల్లులు చెల్లించేలా నిధులు కేటాయిస్తామని పురపాలక మంత్రి పి.నారాయణ తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖ ఖజానా పూర్తిగా ఖాళీ అయిందన్నారు. సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్ల రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ప్రతి కుటుంబానికి రోజుకు 135 లీటర్ల మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. వీలైనంత త్వరగా డీపీఆర్, టెండర్లు పూర్తి చేస్తామని తెలిపారు. భవన నిర్మాణానికి ఐదు అంతస్తుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని.. ఈ నేపథ్యంలో దానితో సంబంధం లేకుండా.. లేఅవుట్, భవనాల నిర్మాణం కోసం మున్సిపాలిటికీ డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులూ మంజూరు చేస్తారని చెప్పారు. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని, అన్ని శాఖలనూ మున్సిపాలిటీతో అనుసంధానం చేస్తున్నామన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 03:47 AM