AP CM Chandrababu : అంగరంగ వైభవంగా ప్రమాణం
ABN, Publish Date - Jun 13 , 2024 | 03:42 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
అంగరంగ వైభవంగా కొలువుదీరిన ‘కూటమి’
అతిరథ మహారథుల సమక్షం..
అభిమానుల ఆనంద సందోహం..
ఆద్యంతం అంగరంగ వైభవం!
నవ్యాంధ్రలో నవ శకం ఆరంభం!
ఎల్లెడలా ఉల్లాసం... ఉత్సాహం... భావోద్వేగభరిత వాతావరణం నడుమ కొత్త సర్కారు కొలువు తీరింది. ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను...’ అనే మాటతో సంబరం అంబరాన్నంటింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు... జనసేన అధిపతి కొణిదెల పవన్ కల్యాణ్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రతి ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం, ప్రమాణ స్వీకారాలు జరగడం షరా మామూలే! కానీ... బుధవారం ఉదయం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద జరిగిన కార్యక్రమం వేరు! కేంద్రంలో చంద్రబాబుకు దక్కిన ప్రాధాన్యానికి నిదర్శనంగా... ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. మోదీ ఆద్యంతం ఉల్లాసంగా కనిపించారు. కరచాలనాలు, ఆలింగనాలు, శుభాకాంక్షలు, పలకరింపులు, అభివాదాలు, నవ్వులతో ఉత్సాహంగా గడిపారు! ఐదేళ్లుగా ఎక్కడా పేరు వినిపించని... ఒకరకమైన ‘చీకటి’లో మగ్గిన రాష్ట్రానికి తగిన గుర్తింపు వస్తుందనేందుకు సంకేతంగా పలు దేశాల దౌత్యవేత్తలూ హాజరయ్యారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చంద్రబాబు శ్రేయోభిలాషి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త కళ తీసుకొచ్చారు. బాలకృష్ణ తనదైన శైలిలో వేదికపై సందడి చేశారు. నారా, నందమూరి, మెగా కుటుంబ సభ్యులు ఈ సంబరాన్ని అబ్బురంగా వీక్షించారు. రాష్ట్రహితం కోరే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా వేదికపై ఆశీనులయ్యారు. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో వేదిక సంపూర్ణత సంతరించుకుంది. అన్నింటికీ మించి... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తల సందడి సరేసరి!
అమరావతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా అనేక మంది ప్రముఖుల నడుమ కొత్త సర్కారు కొలువు తీరింది. గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రి, మంత్రులచేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం ముహూర్తం! కానీ... ఆరు నిమిషాలు ఆలస్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులతో కలిసి చంద్రబాబు వేదికపైకి వచ్చారు. నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ నిర్వహించారు. జాతీయ గీతాలాపన అనంతరం... చంద్రబాబుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. ‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’’ అనగానే సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లింది. అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు కుర్చీల్లోంచి లేచి నిల్చుని చప్పట్లతో తమ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయేదాకా చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. నందమూరి, నారా కుటుంబ సభ్యులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
నందమూరి రామకృష్ణ మరింత పిడికిలి బిగించిన చెయ్యి పైకెత్తి తన ఉద్వేగం, ఉత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు గంభీరమైన స్వరం, గర్జన తరహాలో ప్రమాణ పాఠాన్ని చదివారు. కొన్ని పదాలను ప్రత్యేకంగా నొక్కి పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నేరుగా నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. మోదీ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని భుజం తట్టారు. ఆ సమయంలో ఇటు ప్రధాని, అటు చంద్రబాబులో హుషారు, ఆనందం తొణికిసలాడాయి. అనంతరం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ దంపతులకు చంద్రబాబు నమస్కారం చేశారు. అక్కడ నుంచి నేరుగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియ పటేల్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు, ఇతర అతిఽథులకు అభివాదం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రతి ఒక్కరూ కళ్లు అర్పకుండా చూశారు. ‘‘ఇదే కదా మేం కోరుకున్నది. ఈ క్షణం కోసమే వేచి ఉన్నది’ అనే ఆనందం అందరిలో కనిపించింది.
నారా లోకేశ్ అనే నేను...
చంద్రబాబు, పవన్ తర్వాత నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే కార్యకర్తలు, నాయకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. ఆ సమయంలో లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఉద్వేగంగా కనిపించారు. లోకేశ్ తర్వాత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకార సమయంలో కాస్త హడావిడిగా కనిపించారు. గవర్నర్‌తో సంబంధం లేకుండా ఆయన ముందుగానే రాజ్యాంగ ప్రమాణ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. దీంతో వెంటనే మైక్ కట్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ అనుమతితో ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం జనసేన పార్టీ ఎమ్మెల్యేల నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రశాంతంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. ఆ తర్వాత మోదీ, చంద్రబాబుకు నమస్కారం చేశారు. పవన్ కల్యాణ్ ఆయనను ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఆ తర్వాత... నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.నారాయణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రాంనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, డోల బాల వీరాంజనేయులు, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. వీరంతా తెలుగులో ‘దేవుడి సాక్షిగా’ ప్రమాణస్వీకారం చేశారు. ఫరూక్ ‘అల్లా సాక్షి’గా అని ప్రమాణం చేశారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ఇంగ్లి్‌షలో ప్రమాణం చేశారు. అనంతరం సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రమాణస్వీకారం అనంతరం మోదీ, చంద్రబాబు, గవర్నర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు.
పవన్ ప్రమాణం...
చంద్రబాబు అనంతరం ప్రాధాన్య క్రమంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’ అంటూ పవన్ పలకగానే సభావేదిక మొత్తం ఒక్కసారిగా హోరెత్తింది. పదేళ్ల కష్టం, గత ఐదేళ్ల పోరాటానికి ఫలితం దక్కిందనే ఆనందం జనసైనికుల్లో తాండవించింది. కొన్ని నిమిషాలపాటు ఈలలు, కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన వెంటనే మోదీ వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కారం చేశారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అక్కడ నుంచి పవన్ నేరుగా విశిష్ట అతిథుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. వేదికపైనే ఉన్న తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముడిని అన్నయ్య ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలో ఆసీనులైన ‘మెగా ఫ్యామిలీ’ మొత్తం ఈ క్షణాలను ఆనందంగా ఆస్వాదించింది.
Updated Date - Jun 13 , 2024 | 04:30 AM