గంజాయి, డ్రగ్స్‌పై ‘ఈగిల్’ కన్ను
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:33 AM
గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
సరఫరా, అమ్మకాల నియంత్రణకు కొత్త పోలీస్ విభాగం
అసెంబ్లీ ముందుకు 20 బిల్లులు.. రాష్ట్ర కేబినెట్ ఆమోదం
స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం బిల్లులు మాత్రం వాయిదా
ఆలయ ట్రస్టుల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు
ప్రాజెక్టులకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పునరుద్ధరణ
జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు.. పర్యాటకం, క్రీడా విధానాలకు ఓకే
పది పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోద ముద్ర
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, అమ్మకాలను అదుపు చేయడానికి కొత్త పోలీసు విభాగం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ‘ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్‌గా వ్యవహరించే ఈ విభాగానికి ‘ఈగిల్’ అని నామకరణం చేశారు. గత ప్రభుత్వం రూ.100 కోట్లకు పైబడిన టెండర్లకు సంబంధించి సమీక్షకు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను రద్దుచేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే ఇరవై బిల్లులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం 22 బిల్లులు దాని ముందుకు రాగా.. 20 బిల్లులపై ఆమోదముద్ర వేసింది. ఆమోదించని రెండు బిల్లులూ స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలకు సంబంధించినవి. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం పెట్టడానికి నాలుగేళ్ల గడువు ఉండాలని గతంలో నిర్ణయించారు. దానిని రెండున్నరేళ్లకు తగ్గిస్తూ పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు మంత్రివర్గ సమావేశం ముందుకు బిల్లులను తెచ్చాయి. ఈ వ్యవహారంలో మరికొంత చర్చ అవసరమని, తర్వాత చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదావేశారు. ఆయన అధ్యక్షతన బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. లోకాయుక్త నియామకానికి సంబంధించి చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. గతంలో చేసిన చట్టం ప్రకారం.. లోకాయుక్త నియామకాన్ని ఆమోదించే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత ఎవరూ లేరు.
దీంతో ప్రతిపక్ష నేత బదులు.. చట్ట సభల సభ్యులు ఎవరైనా ఉండవచ్చన్న సవరణను ప్రతిపాదించారు. రేషన్ బియ్యం అక్రమాలను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం పరిధిలోకి తెస్తూ చేసిన సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ఈ చట్టం కింద గతంలో కేవలం ఐదు రకాల నేరాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో 8 రకాల నేరాలను చేర్చారు. అందులో రేషన్ బియ్యం అక్రమాలూ ఒకటి. భూ కబ్జాల నిరోఽధ చట్టానికి కూడా మరిన్ని కోరలు తొడిగి కఠిన శిక్షలు పడేలా సవరణ బిల్లులో ప్రతిపాదించారు. తగిన భద్రత ఉంటే రాష్ట్రంలో పర్యాటకం పెరుగుతుందని, పర్యాటకులు పెరిగితే ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. దీని కోసం బీచ్‌ల వద్ద ఈతగాళ్లను నియమించాలని, పోలీసు భద్రత కల్పించాలని, లోపలి ప్రాంతాల్లో కూడా పర్యాటకులకు తగినంత భద్రత కల్పించి ఎక్కడికైనా వెళ్లి క్షేమంగా తిరిగి రాగలిగే పరిస్థితులు కల్పించాలని నిర్ణయించింది. కేరళలో కత్తి యుద్ధం మాదిరిగా మన రాష్ట్రంలో స్థానికంగా పేరు పొందిన ఽథింసా నృత్యం వంటి వాటిని కూడా పర్యాటకంలో భాగం చేయాలని, దీనివల్ల మన ప్రత్యేకత నిలబడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. క్రీడా విధానంగా భాగంగా దివ్యాంగులకు చిన్న నాటి నుంచే క్రీడల్లో ప్రవేశం కల్పించే వ్యవస్థ తీసుకురావాలని.. వారు పతకాలు సాధించిన తర్వాత సన్మానాలు చేయడం కాకుండా కింది స్థాయి నుంచి ప్రోత్సహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విద్యా మంత్రి లోకేశ్ తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో క్రీడకు ప్రాధాన్యమిచ్చి శిక్షణ ఇస్తే బాగుంటుందని పవన్ సూచించారు. ఇప్పటికే ఆ దిశగా పని జరుగుతోందని, కొన్నిచోట్ల కొన్ని క్రీడలకు శిక్షణ సౌకర్యాలు ఏర్పడ్డాయని లోకేశ్ చెప్పారు.
కేబినెట్ నిర్ణయాలివీ..
దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ వర్గాలకు విధిగా చోటు కల్పించడానికి ట్రస్టు బోర్డుల్లో సభ్యుల సంఖ్య పెంపు.
జలవనరుల శాఖ పనులకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానం పునరుద్ధరణ. మెటీరియల్ సమకూర్చుకునేందుకు కంపెనీలకు అడ్వాన్సు చెల్లిస్తారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటారు.
సహజ వాయువును వినియోగించే కంపెనీలపై గతంలో విధించిన 24 శాతం పన్ను ఐదు శాతానికి తగ్గింపునకు ఆమోదం. పారిశ్రామిక గ్యాస్, పైప్డ్ గ్యాస్‌కు కూడా ఇదే పన్ను వర్తిస్తుంది.
టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లో విలీనానికి ఓకే.
అమరావతిలో గతంలో పనులు పొందిన కం పెనీలకు ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలన్న టెక్నికల్ కమిటీ సిఫారసులకు ఆమోదం.
ప్రధానమంత్రి గృహ యోజన-2 పథకానికి సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆమోదం.
విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు డీపీఆర్‌ను కేంద్రానికి పంపడానికి ఆమోదం. ఈ ప్రాజెక్టులకు వంద శా తం నిధులను కేంద్రమే భరించాలని తీర్మానం. తొలి దశలో రూ.11 వేల కోట్లతో పనులకు ప్రతిపాదన.
రాష్ట్ర పర్యాటక విధానానికి ఆమో దం. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమల హోదా కల్పన.
రాష్ట్ర క్రీడా విధానానికి ఆమోదం
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో ఆమోదించిన పది పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం. నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ రూ.60 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ కూడా ఇందులో ఉంది. ఈ మొత్తం పరిశ్రమల విలువ రూ.85 వేల కోట్లు.
భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల నుంచి తప్పించి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అప్పగించే చట్ట సవరణకు ఆమోదం.
హనీమూన్ సమయం ముగిసింది..!
హనీమూన్ సమయం ముగిసిందని, మంత్రులందరూ తమ శాఖలపై సీరియ్‌సగా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘మనం చేస్తున్న పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఎవరి శాఖ విజయాలను వారు ప్రచారం చేయాలి. మన పని మరెవరో చేస్తారని అనుకోవద్దు. అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులూ బాగా జరిగాయి. మిగిలిన రెండు రోజులు కూడా ఇలాగే జరిగేలా బాధ్యత తీసుకోండి’ అని మంత్రులకు సూచించారు.
ఆర్సెలార్ మిట్టల్‌కు కేంద్ర అనుమతి సాధించిన బాబు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అభ్యంతరం వ్యక్తం కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకొని కేంద్రంతో మాట్లాడి అనుమతి సాధించారని మంత్రివర్గ సమావేశంలో అధికారులు తెలిపారు. ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమల విషయంలో అవి త్వరగా రావడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నామని సీఎం చెప్పారు. ‘మడకశిర వద్ద ఆయుధ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీ.. ఎకరానికి రూ.5 లక్షల రేటు పెడతామని చెప్పింది. వాళ్లతో మాట్లాడి రూ.7 లక్షలకు ఫైనల్ చేశాం. విశాఖలో టీసీఎస్ కంపెనీ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి భవనం కావాలని కోరింది. వారికి నచ్చిన భవనం చూశాం. అద్దె వద్ద కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. భవన యజమానితో మాట్లాడి కొంత బేరమాడి అది కూడా ఖరారుచేశాం. విశాఖకు త్వరలోనే టీసీఎస్ కంపెనీ వస్తోంది’ అని ఆయన తెలిపారు. విజయవాడ సమీపంలో నిర్మించిన తూర్పు బైపాస్ నుంచి రాజధాని అమరావతిలోకి రావడానికి కిలోమీటరు దూరం ఫ్లై-ఓవర్ నిర్మించాలని, దీనికి రూ.150 కోట్ల వ్యయమవుతుందని అధికారులు చెప్పారు. మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
Updated Date - Nov 21 , 2024 | 05:35 AM