AP Assembly: పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి ఊతం
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:15 PM
ఆంధ్రప్రదేశ్‌లో నూతన పర్యాటక పాలసీని మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా పాలసీ వివరాలను అసెంబ్లీలో వివరించారు. అలాగే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
అమరావతి, నవంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన రాష్ట్రంగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పేరు నిలిచి పోతుందన్నారు. పరిశ్రమ హోదా ఇవ్వడంతో పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్లు అయిందని ఆయన తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో నూతన టూరిజం పాలసీని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన నూతన పాలసీని ఇలా వివరించారు.
Also Read: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా
పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ కొత్త టూరిజం పాలసీ ఉందన్నారు. ప్రపంచంలోనే అద్భుత పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా ఏపీలో 20 శాతం పైబడి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
Also Read: సీసీ టీవీలపై అసత్య ప్రచారం.. రంగంలోకి దిగిన భారతీయ రైల్వే
ఆ క్రమంలో బాధ్యతాయుతమైన పర్యాటకం, టూరిజంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. అయితే 4.6 శాతంగా ఉన్న జీవీఏను 28 శాతానికి పెంచడం, పర్యాటక రంగంలో 12 శాతం ఉపాధిని 15 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఈ పాలసీ రూపొందించామన్నారు.
Also Read: స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం
పర్యాటక రంగంలో ఏపీని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అయితే ఈ నూతన పర్యాటక విధానం.. 2024-2029 మధ్య రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఇది చాలా కీలకమైనదని మంత్రి కందుల దుర్గేశ్ అభివర్ణించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక జన సమూహాలను బలోపేతం చేయాలన్న దార్శనికతతో ఈ టూరిజం పాలసీని రూపొందించామని వివరించారు.
దేశానికి విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే టాప్ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా నిలపాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో ఒక పర్యాటకుడు పెట్టే ఖర్చు రూ. 1,700 నుంచి రూ. 25,000 వరకు ఉండే విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
అలాగే పర్యాటకుడు ఐదు రోజులు ఉండే విధంగా టూరిజం సర్క్యూట్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో టూరిజం హోటళ్లలో ప్రస్తుతం 3,500 రూములు ఉన్నాయని గుర్తు చేశారు. వాటి సంఖ్యను 10 వేలకు పెంచాలని ఆలోచన చేస్తున్నామన్నారు. పర్యాటక రంగంలో పీపీపీ విధానంలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఒకే తరహా పర్యాటకాభివృద్ధి కాకుండా అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్‌నెస్, అగ్రి టూరిజం తరహాలో పర్యాటక విధానాలు నెలకొల్పాలని భావిస్తున్నామన్నారు.
డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో ఏడు యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి - నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయమన్నారు.
అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు తదితర ఆలయాలను కలిపేలా 10 సర్క్యూట్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక కోస్టల్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నంలలో ఐదు బీచ్ సర్క్యూట్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రివర్ టూరిజం సర్క్యూట్‌తోపాటు 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్‌ల అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళం- విశాఖపట్నం, తూర్పు గోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలు.. పర్యాటక రంగంలో అమలు చేస్తూ అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీకి హైవ్యాల్యూ టూరిజం ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు సీఎం చంద్రబాబు సూచనల మేరకు పీ 4 విధానంలో ముందుకు వెళ్తామన్నారు.
ఈ రంగంలో సైతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తామన్నారు. పర్యాటకానికి సంబంధించిన ప్రాజెక్టులు ఆరు కేటగిరీలుగా విభజన చేస్తున్నామన్నారు. పర్యాటక ప్రాజెక్టుల్లో భద్రతా చర్యలు, ప్రమాణాలు దృష్టిలో పెట్టుకొని వృద్ధి చేస్తామని చెప్పారు. ఆపరేటింగ్ గైడ్ లైన్స్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
పర్యాటక రంగంలో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని నెంబర్ 1 స్థానానికి తెచ్చేందుకు కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక రంగానికి సంబంధించిన నూతన పాలసీపై మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించిన అంశాలపై డిప్యూటీ స్పీకర్ కె. రఘురామకృష్ణరాజు స్పందించారు.
పర్యాటక రంగంపై మంత్రి కందుల దుర్గేష్ వివరించిన విజన్ అద్బుతంగా ఉందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. మంత్రి ప్రసంగం వింటే.. అందమైన ఆంధ్రప్రదేశ్‌ను ఊహించుకున్నట్లుగా ఉందన్నారు. ప్రతి జిల్లాలో ఒక పర్యాటక ప్రాంతాన్ని సంబంధిత ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి చేద్దామని మంత్రి దుర్గేష్‌తో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పారు.
For Andhra pradesh News And Telugu News
Updated Date - Nov 22 , 2024 | 06:16 PM