Nara Lokesh: బాబు కాదు.. ఢిల్లీలో ఇకపై చక్రం తిప్పేది చినబాబేనట..!!
ABN, Publish Date - Aug 21 , 2024 | 01:06 PM
ఒకప్పుడు మనం చూసిన నారా లోకేష్‌ను కాదు.. ఇప్పుడు మనం చూస్తున్నది. చిరుత రామ్ చరణ్‌కి.. రంగస్థలం రామ్ చరణ్‌కి ఎంతైతే తేడా ఉందో నారా లోకేష్ కూడా అలాగే ట్రాన్స్‌ఫామ్ అయ్యారు
ఒకప్పుడు మనం చూసిన నారా లోకేష్‌ను కాదు.. ఇప్పుడు మనం చూస్తున్నది. లోకేష్ రాజకీయాల్లో ఊహించని రీతిలో పరిణతి చెందారు. ఒకప్పుడు ఏకధాటిగా విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలకు సైతం ఆయనను విమర్శించేందుకు మాటలు దొరకట్లే. పప్పు అంటూ ఎద్దేవా చేసిన వారికి నిప్పులా కనిపిస్తున్నారు. ఏపీలో మంత్రిగా చకచకా పనులు చక్కబెడుతున్నారు. సామాన్యులతో సామాన్యుడిలా కలిసి పోతున్నారు. హస్తినకు సైతం వెళ్లి రాష్ట్రానికి ఏం కావాలో కేంద్ర పెద్దలకు స్పష్టంగా చెప్పి వస్తున్నారు. అసలు అప్పుడు చూసిన లోకేష్‌నేనా? ఇప్పుడు చూస్తున్నదని వైసీపీ నేతలు సైతం నోరెళ్లబెడుతున్న పరిస్థితి. ఏపీలో ప్రాజెక్టులను రప్పించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయన ఢిల్లీలో పనులను చక్కబెడుతున్నారు.
మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉండవల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు. సాయంత్రం పలువురు ఎన్డీయే కీలక నేతలను నారా లోకేష్ కలవనున్నారు. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. పలు రాజకీయ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఢిల్లీ నుంచి తిరిగి అమరావతికి రానున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా హస్తినకు సీఎం చంద్రబాబు వెళ్లేవారు. ఇప్పుడు నారా లోకేష్ వెళుతుండటం గమనార్హం. ఇప్పటికే లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారంటూ పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.
మంత్రి పదవులను సైతం నారా లోకేష్‌ను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కేటాయించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఢిల్లీకి సైతం నారా లోకేష్‌నే పంపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి చంద్రబాబు జైలులో ఉన్నప్పుడే నారా లోకేష్ మరింత యాక్టివ్ అయ్యారు. అప్పటికే యువగళం పాదయాత్రతో చాలా యాక్టివ్‌గా ఉన్న ఆయన చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలతో పార్టీ పూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఎప్పుడంటే అప్పుడు ఢిల్లీకి వెళ్లడం అక్కడి న్యాయవాదులతో మాట్లాడటం.. పార్టీ పార్లమెంటరీ నేతలతో మాట్లాడటం.. కేంద్ర పెద్దలను కలవడం.. ఫైనల్‌గా చంద్రబాబును బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో ఎప్పుడూ హస్తినకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ క్రమంలోనే చంద్రబాబు హస్తిన బాధ్యతలను సైతం తనయుడు లోకేష్‌కే అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట సైతం హస్తినకు నారా లోకేషే వెళతారని సమాచారం. ఢిల్లీలో ఇకపై చినబాబే చక్రం తిప్పుతారని సమాచారం.
Updated Date - Aug 22 , 2024 | 02:15 PM