ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Higher Education Council : ఇప్పటికీ వాళ్లేనా?

ABN, Publish Date - Nov 29 , 2024 | 04:37 AM

ప్రభుత్వం మారిన వెంటనే కీలక విభాగాల్లోని ముఖ్యమైన అధికారులు కూడా మారుతూ ఉంటారు. అయితే రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాత్రం ఇందుకు భిన్నం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు దాటినా ఇంకా అక్కడ పాతవాసన మాత్రం పోలేదు.

  • ఉన్నత విద్యామండలిలో వైసీపీ నియమించిన అధికారులదే హవా

  • ప్రభుత్వం మారినా చక్రం తిప్పుతున్న పాత అధికారులు

  • చైర్మన్‌ నియామకంపై లేని స్పష్టత

  • ఇన్‌చార్జ్‌ అధికారుల మధ్య కుదరని సఖ్యత

  • యూనివర్సిటీల్లోనూ ఇన్‌చార్జ్‌ వీసీలే కొనసాగింపు

  • అడ్ర్‌సలేని సెర్చ్‌ కమిటీల నియామకం

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారిన వెంటనే కీలక విభాగాల్లోని ముఖ్యమైన అధికారులు కూడా మారుతూ ఉంటారు. అయితే రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాత్రం ఇందుకు భిన్నం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు దాటినా ఇంకా అక్కడ పాతవాసన మాత్రం పోలేదు. వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అధికారుల హవానే ఇంకా కొనసాగుతోంది. నారా లోకేశ్‌ మంత్రిగా ఉన్న ఉన్నత విద్యాశాఖలో మొత్తం పాత అధికారులతోనే పాలన సాగుతోంది. ఉన్నత విద్యామండలిలో అన్ని విభాగాల్లోనూ పాత అధికారులనే కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో చైర్మన్‌గా చక్రం తిప్పిన కె.హేమచంద్రారెడ్డి ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ వెంటనే కూటమిప్రభుత్వం కొత్త చైర్మన్‌ను నియమిస్తుందని ప్రచారం జరిగింది. ఇంతవరకూ కొత్త చైర్మన్‌ ఊసే లేకుండా పోయింది. పైగా గత ప్రభుత్వంలో రెండు విడతలు వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన కె.రామ్మోహన్‌రావుకు ఈ ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి చైర్మన్‌తో అంటకాగినట్లు ఆరోపణలున్న వ్యక్తిని ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా నెలల తరబడి కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

  • సెర్చ్‌ కమిటీలు ఎప్పుడు?

ప్రభుత్వం మారిన తర్వాత మండలిలో పాలన చాలావరకు కుంటుపడింది. కొత్త అధికారులను నియమించుకుంటారనే ఆలోచనలో పాత అధికారులు ఉన్నారు. కానీ చైర్మన్‌ నియామకంపై కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. చైర్మన్‌ను నియమిస్తే మండలి తిరిగి పట్టాలెక్కుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో 17 యూనివర్సిటీల్లో వీసీలు లేరు. ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించి నెల దాటినా సెర్చ్‌ కమిటీల నియామకం కనుచూపుమేరలో కనిపించడం లేదు. రెగ్యులర్‌ వీసీలు ఉంటే తప్ప వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించే సెట్లకు కన్వీనర్లను నియమించడం సాధ్యం కాదు.


మరోవైపు వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన సెట్లకు షెడ్యూలు ప్రకటించాల్సిన సమయం వచ్చింది. ఆ షెడ్యూలు ఇవ్వాలంటే రెగ్యులర్‌ వీసీలు, చైర్మన్‌ ఉండాలి. పోనీ పాత అధికారులతోనే మండలిని నడిపించాలనుకుంటే దానిపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  • కీలక శాఖలో సఖ్యత లేదు

ఉన్నత విద్యామండలి... ఉన్నత విద్యాశాఖకు సలహా మండలి తరహాలో పనిచేస్తుంది. ఎంట్రన్స్‌ టెస్ట్‌ల నిర్వహణ, డిగ్రీ అడ్మిషన్ల బాధ్యత కూడా మండలికే ఉంది. మండలిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, సెట్స్‌ అధికారులు, అకడమిక్‌ అధికారులు అంతా వర్సిటీల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి పనిచేస్తారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని ఆయా ప్రభుత్వాలు నియమిస్తుంటాయి. అలా గత ప్రభుత్వంలో నియమితులైన వారే ఇప్పటికీ కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇద్దరు వైస్‌ చైర్మన్లు, అకడమిక్‌ అధికారులు, ఇతర ప్రాజెక్టుల అధికారులు పాత స్థానాల్లోనే ఉన్నారు. నెల కిందట మాత్రం మండలి కార్యదర్శిని మార్చి, జాయింట్‌ డైరెక్టర్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన జేడీకి, మిగిలిన అధికారులకు మధ్య సఖ్యత కుదరట్లేదు. ఇన్‌చార్జ్‌ చైర్మన్‌, ఇన్‌చార్జ్‌ కార్యదర్శి మధ్య సమన్వయం లేదు. గత ప్రభుత్వంలో మండలి ఆర్థిక వ్యవహారాలను క్యాష్‌బుక్స్‌తో సహా సమర్పించాలని జేడీ అడుగుతుంటే, అవి లేవని పాత అధికారులు చెబుతున్నారు. ఇదీ ఇటీవల వివాదానికి దారితీసింది. దాని ఫలితంగా ఉద్యోగులకు జీతాలు కూడా అందలేదు.

  • వివాదాలకు కేరాఫ్‌

ఇటీవల మండలి నుంచి రిలీవైన ఓ అధికారిణి నేరుగా ఇన్‌చార్జ్‌ కార్యదర్శి చాంబర్‌కే వెళ్లి ఆయన్ను బెదిరించారు. భవిష్యత్తులో పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరిగిందంటే దానికి పాత అధికారుల కొనసాగింపే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్‌చార్జ్‌ కార్యదర్శిని బెదిరించిన అధికారిణికి మండలిలోనే కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఓవైపు ఇన్‌చార్జ్‌ కార్యదర్శిని బెదిరించడం.. మరోవైపు ఇతర అధికారులతో సమావేశంకావడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. బయటి వ్యక్తులను కార్యాలయంలోకి అనుమతించవద్దని ఆదేశించినప్పటికీ కొందరు అధికారుల సహకారంతో పలువురు మండలిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో వివాదాలకు కేంద్రంగా మారుతోంది. కొత్త పాలనా యం త్రాంగాన్ని నియమిస్తే వివాదాలకు ఆస్కారం ఉండదు.

Updated Date - Nov 29 , 2024 | 04:37 AM