పరారే.. పరారే.. పరిశ్రమలు పరారే!
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:34 AM
విశాఖ సదస్సులో పలు కంపెనీలతో ఒప్పందాలలో పేర్కొన్న గణాంకాలను చూసి ఆర్థిక నిపుణులు విస్తుపోతున్నారు.
ఐదేళ్ల పాలనలో కొత్త పెట్టుబడుల్లేవ్
ఇంజనీరింగ్ పూర్తయిందా? అయితే... ఉద్యోగం కోసం హైదరాబాద్ బస్సెక్కాల్సిందే! లేదా... బెంగళూరు, చెన్నై రైలు పట్టుకోవాల్సిందే! ఏపీ యువతది వలస బాటే! ఇటు సర్కారు కొలువులు లేవు. ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలూ రావు! ఇది... జగన్ సర్కారు అస్థిర విధానాలు, కక్షపూరిత నిర్ణయాల ఫలితం! దీనిని అనుభవిస్తున్నది మాత్రం రాష్ట్ర యువత!
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఖజానాకు ఆదాయం రావాలన్నా... కొత్తగా పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు ఏర్పాటు కావాలి. దీనికోసం... పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలి. పెట్టుబడులకోసం పరితపించాలి. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. జగన్ సర్కారు మాత్రం అంతా ‘రివర్స్’. అప్పుల కోసం, స్వీయ రక్షణ కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం... ప్రతిపక్షనేతలను, ప్రశ్నించినవారిని వేధించడం తప్ప పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలే చేయలేదు. ఐదేళ్ల పాలనలో మొక్కుబడిగా జగన్ ఒకేఒక్కసారి దావోస్ పర్యటనకు వెళ్లొచ్చారు. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, వ్యతిరేకత రావడంతో గతేడాది మార్చిలో విశాఖపట్నంలో హడావుడిగా పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేశారు. గతంలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతోనే మళ్లీ చేసుకోవడంతో పాటు ఊరూపేరూ లేని వాటితో కూడా ఎంవోయూలు కుదుర్చుకుని.. ఇక రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చేసినట్టేనన్నంత బిల్డప్ ఇచ్చారు. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కలరింగ్ ఇచ్చారు. ఇప్పటికీ వాటి జాడలేదు. జగన్ ఐదేళ్ల పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాల బాట పట్టాయి. మరోవైపు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమలకు ప్రభుత్వం ఏమాత్రం చేయూత ఇవ్వలేదు. కొవిడ్ దెబ్బకు కుదేలైన చిన్నపరిశ్రమలను ఆదుకునేందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల విషయంలో చేతులెత్తేసింది. ఐదేళ్ల పాలనలో జగన్ సర్కారు పారిశ్రామిక రంగంలో సాధించిన ‘ఘనత’ ఇదీ. దీని ఫలితం... దేశంలోనే అత్యధికంగా 24 శాతం నిరుద్యోగం ఏపీలోనే ఉంది.
గతంలో ఓ బ్రాండ్...
టీడీపీ హయాంలో ప్రపంచస్థాయి సంస్థలు, విదేశీ పెట్టుబడులు, దేశంలోనే దిగ్గజ కంపెనీల పెట్టుబడుల రాకతో రాష్ట్రం కళకళలాడుతుండేది. రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు, పెట్టుబడులను ఆకర్షించడం కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనువైన వాతావరణం కల్పించారు. ఏపీకి ఒక బ్రాండ్ సృష్టించారు. పెద్దపెద్ద కంపెనీల రాకతో విడిపోయిన రాష్ట్రానికి, ప్రజలకు అభివృద్ధిపై ఒక ఆశ కల్పించారు.
జగన్ రాకతో ‘తిరోగమనం’
2019లో జగన్ ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమన బాట పట్టింది. వైసీపీ నాయకుల కమీషన్ల కక్కుర్తి, జగన్ రాజకీయ కక్షతో పరిశ్రమలు, పెట్టుబడులను తరిమేశారు. ఒకేఒక్కసారి దావోస్ వెళ్లి... అరబిందో ప్రతినిధులకు షేక్‌హ్యాండ్ ఇచ్చి వచ్చేశారు. గత ఏడాది మార్చిలో విశాఖ పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా... ‘మొత్తం ఆరు శాఖలు.. 18 రంగాలు.. 386 ఒప్పందాలు.. రూ.13.11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు.. 6 లక్షల ఉద్యోగాల కల్పన.. దేశంలోనే ఏపీ కీలకంగా మారబోతోంది’... అని జగన్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అదంతా ఉత్తిదే! కోటి రూపాయలు కూడా పెట్టుబడి పెట్టే స్థాయి లేని కంపెనీలు.. ఊరూ పేరూ లేని కంపెనీలతో పాటు చివరికి యూట్యూబ్ చానళ్లు, టీవీ యాంకర్లతో కూడా ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. ఏడాది అయినా ఒప్పందాలు చేసుకున్నట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదు. జగన్ చెప్పిన ఉద్యోగాలూ ఇవ్వలేదు. ఎంవోయూలు చేసుకున్న చాలామంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపే చూడటం లేదు.
ఐదేళ్ల పాలనలో కొత్త పెట్టుబడుల్లేవ్
ఆ దిశగా ప్రయత్నాలే చేయని జగన్ సర్కారు
ఒకే ఒక్కసారి దావోస్ పర్యటన
గొప్పకోసం విశాఖ సదస్సులో ‘షో’
పాత కంపెనీలతో మరోసారి ఒప్పందాలు
13 లక్షల కోట్ల పెట్టుబడులంటూ షో
6 లక్షల ఉద్యోగాల కల్పనంటూ బిల్డప్
వైసీపీ సర్కారు అస్థిర విధానాలతో
రాష్ట్రంవైపు చూడని పారిశ్రామికవేత్తలు
ఎంఎ్‌సఎంఈలకూ ప్రోత్సాహకాలు కరువు
4 వేల కోట్లకుపైగా బకాయిలు పెండింగ్
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేల్
ఉపాధి అవకాశాల్లేక యువత విలవిల
ఆ కంపెనీల జాడేదీ...
విశాఖ సదస్సులో పలు కంపెనీలతో ఒప్పందాలలో పేర్కొన్న గణాంకాలను చూసి ఆర్థిక నిపుణులు విస్తుపోతున్నారు. ఉదాహరణకు ఎన్టీపీసీ ఏకంగా రూ.2,35,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ కంపెనీ మొత్తం మూలధనం కేవలం 25 వేల కోట్లు. ఏబీసీ లిమిటెడ్ రూ.12,000 కోట్లు, రెన్యూ పవర్ 97,550 కోట్లు, ఇండోసోల్ 76,033 కోట్లు, ఏసీఎంఈ 68,976 కోట్లు, టీసీపీఎ్‌సవోఎల్ 65,000 కోట్లు, జేఎ్‌సడబ్ల్యూ 50,632 కోట్లు, హంచ్ వెంచర్స్ 50,000 కోట్లు, గ్రీన్‌కో 47,600 కోట్లు, ఓసీఐవోఆర్ 40,000 కోట్లు, హీరో ఫ్యూచర్స్ సంస్థ 30,000 కోట్లు చొప్పున పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీలన్నీ పత్తా లేకుండా పోయాయి.
ప్రోత్సాహకాలపై వంచన
‘రాష్ట్రంలో దాదాపు 25 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎ్‌సఎంఈ) పరిశ్రమలున్నాయి. దాదాపు 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కొవిడ్ దెబ్బతో చిన్నపరిశ్రమలు ఒక్కసారిగా కుదేలైపోయాయి. తిరిగి కోలుకునేలా రీస్టార్ట్ ప్యాకేజీ అమలు చేస్తాం. విద్యుత్ చార్జీల రీయింబర్స్‌మెంట్, అమ్మకం పన్ను మూలధన రాయితీ తదితర ప్రయోజనాలు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తాం’ అని గొప్పలు చెప్పిన జగన్ సర్కారు పారిశ్రామికవేత్తలను నమ్మించి గొంతు కోసింది. ఎంఎ్‌సఎంఈలకు చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాల పాత బకాయిలే రూ.4 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. కొత్తగా వచ్చిన క్లైయిములు మరో రూ.3 వేల కోట్ల వరకు ఉంటాయని సమాచారం. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో యూనిట్ల నిర్వహణ భారంగా మారిపోయిందని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎంఎ్‌సఎంఈలకు ప్రతి ఏటా ఆగస్టులో ప్రోత్సాహకాలు అందజేస్తామంటూ జగన్ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండరులో ప్రకటించింది. కానీ, దానిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా.. విద్యుత్ ట్రూఅప్ చార్జీలు, విద్యుత్ డ్యూటీ, గ్రిడ్ మద్దతు చార్జీలు అంటూ రకరకాల పేర్లతో భారం మోపింది. మరోవైపు ఇంధన ధరలు, ముడిసరుకులు, లాజిస్టిక్స్, లేబర్ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ మూడేళ్లలోనే ఉత్పత్తి వ్యయం రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలను నడపలేక, బ్యాంకులకు అప్పుల వాయిదాలు చెల్లించలేక నలిగిపోతున్నారు.
కరెంటు షాకులే...
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో విద్యుత్తు చార్జీలు, ప్రోత్సాహకాలు చాలా కీలకం. కానీ... ‘మీరు రానక్కర్లేదు. మీరు మాకు అక్కర్లేదు’ అన్నట్లుగా పెట్టుబడిదారులకు జగన్ సర్కారు షాకులు ఇస్తోంది. ఒడిసా, గుజరాత్‌లలో పారిశ్రామిక విద్యుత్తుకు భారీ రాయితీలు ఇస్తుండగా... ఏపీలో అంతకు రెండింతలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కరెంటు షాకులు భరించేకంటే... పక్క రాష్ట్రాలకు పోవడమే మేలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు టారిఫ్ బెదిరించేలా ఉందని పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు.
చంద్రబాబు తెచ్చినవి..
కియా కార్ల పరిశ్రమ, హీరో టూవీలర్, ఇసుజు, అశోక్ లేల్యాండ్, ఫ్లెక్స్ ట్రానిక్స్, ఫాక్స్‌కాన్-ఐఫోన్ల తయారీ కేంద్రం, జియోమీ, సెల్‌కాన్, కార్బన్, డిక్సన్ మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలు, ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్, టీవీఎస్ గ్రూప్ బ్రేక్స్ ఇండియా ఆటోమొబైల్ పరిశ్రమ, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, రామ్‌కో సిమెంట్స్, ఫ్లోరా సిరామిక్స్, చెట్టినాడ్ సిమెంట్, కల్యాణి స్టీల్, కోకాకోలా యూనిట్, బ్రిటానియా, పెప్సీ, సెయింట్ గోబెయిన్ గ్లాస్ పరిశ్రమ, గూగుల్ ఎక్స్, భారత్ ఫోర్జ్, అపోలో టైర్స్, జియో తదితర పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. 2014-2019 మధ్యకాలంలో 5 లక్షల మందికి ఉద్యోగాలొచ్చాయి.
జగన్ తరిమేసినవి..
శ్రీకాకుళం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, విశాఖలో లులూ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌ఎ్‌సబీసీ, అదానీ డేటా సెంటర్ తన ప్రాజెక్టును రూ.70,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్లకు కుదించుకుంది. గోదావరి జిల్లాలలో ఆక్వా పరిశ్రమలు, కృష్ణాలో ఐటీ కంపెనీలు, అమరావతిలో సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, ప్రకాశంలో ఏషియన్ పేపర్ మిల్స్, నెల్లూరులో విండ్-సోలార్ కంపెనీలు, చిత్తూరులో రిలయన్స్ జియో, హోలీటెక్, అమర్‌రాజా, రాజపలాయం మిల్స్, ట్రైటన్ సోలార్, కర్నూలులో మెగాసీడ్ పార్క్, అనంతపురంలో కియా అనుబంధ సంస్థలు, జాకీ, కడపలో జువారి సిమెంట్స్.
లక్షల కోట్ల డబ్బా
సీఎం జగన్ నోరు తెరిస్తే.. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల కల్పన అంటూ మాటలు కోటలు దాటుతాయి. నిజానికి జగన్ సర్కారు దెబ్బకు కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. ఇప్పటికే ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలపైనా కక్షే! లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆయన పాలనలో 1200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు అంచనా. అయినా ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ ‘లక్షల కోట్ల’ మాటలు చెబుతారు.
మచ్చుకు రెండు.. అమర్‌రాజాపై కసి..
‘అమర్ రాజా’ అంతర్జాతీయంగా పేరొందిన బ్రాండ్! సొంత ప్రాంతానికి మేలు చేయాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని చిత్తూరు జిల్లాలో దీనిని ఏర్పాటు చేశారు. అయితే... ఇది టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది కావడంతో జగన్ సర్కారు కక్ష పెంచుకుంది. ‘కాలుష్యం’ పేరుతో వెంటాడి వేధించింది. ఏకంగా పరిశ్రమకు తాళం వేయించింది. దీని ఫలితమే... రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలకు అమర్‌రాజా స్వస్తి పలికింది. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీనివల్ల నష్టం ఎవరికి?
ఆగిన ‘కియా’ విస్తరణ
హ్యుండయ్ మాతృసంస్థ ‘కియా’! దీనిని అనంతపురం జిల్లాకు రప్పించేందుకు చంద్రబాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు! రికార్డు స్థాయిలో అక్కడ కార్ల కర్మాగారం సిద్ధమైంది. భారీ స్థాయిలో అనుబంధ పరిశ్రమల రాకకు తగిన వాతావరణం ఏర్పడింది. ‘కియా’ సైతం ఇక్కడ మరింత విస్తరించాలని భావించింది. కానీ... జగన్ సర్కారు తిరోగమన విధానాల కారణంగా ఇవన్నీ ఆగిపోయాయి. ఇది రాష్ట్రానికి చేసిన అన్యాయం కాదా?