ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan Kalyan : తండాల అభివృద్ధే లక్ష్యం

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:50 AM

గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.

  • ప్రతి గిరిజన గ్రామానికీ రహదారి: పవన్‌ కల్యాణ్‌

  • డోలీ మోతల రహిత రాష్ట్రంగా ఏపీ.. గిరిజనుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర

  • రెండు నెలలకొకసారి ఏజెన్సీలో పర్యటిస్తా.. వారి అభ్యున్నతికి కృషి చేస్తా

  • యువత గంజాయికి దూరంగా ఉండాలి.. పర్యాటకంపై దృష్టి పెట్టాలి

  • జనవరిలో రోడ్ల నిర్మాణానికి మరో రూ.250 కోట్లు: డిప్యూటీ సీఎం

  • ఏజెన్సీలో రూ.105 కోట్లతో చేపట్టే 19 రోడ్లకు శంకుస్థాపన

అనంతగిరి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గిరిజన తండాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో మారుమూలనున్న పినకోట పంచాయతీ బల్లగరువు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాజంగి జంక్షన్‌లో గుమ్మంతి నుంచి రాచకీలం మీదుగా రెడ్డిపాలెం వరకూ రూ.5.86 కోట్లతో, సమీధ నుంచి తట్టబూడి మీదుగా చింతపాక వరకూ రూ.16.67 కోట్లతో నిర్మించనున్న రోడ్లు సహా మొత్తం రూ.105 కోట్లతో 19 రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజనులతో మాట్లాడి డోలీ మోతల గురించి అడిగి తెలుసుకుని చలించిపోయారు. తర్వాత బల్లగరువులో సభా ప్రాంగణం వద్దకు చేరుకుని.. గిరిజన కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలను వాయించారు. ఐసీడీఎస్‌, జీసీసీ, వన్‌ వికాస్‌ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గిరిజనులు మంచి మనసున్నవారు. వారి ఆచార, సంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. రాష్ట్రంలో డోలీమోతలు లేకుండా అన్ని గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తాం. డోలీ మోతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. జిల్లాలో 90 శాతం గిరిజన గ్రామాలకు పీఎం జన్‌మన్‌ కార్యక్రమం ద్వారా రోడ్లు వేసేందుకు కృషిచేస్తున్నాం. వంద మంది కంటే ఎక్కువ జనాభా కలిగి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మించాలని నిర్ణయించాం.


గిరిజన ప్రాంతాల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యటిస్తా. వారి అభ్యున్నతికి కృషిచేస్తా. ఐదేళ్ల తర్వాత మా పనితీరుపై ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇవ్వాలి’ అని గిరిజనులకు సూచించారు. ఈ 19 రోడ్ల వల్ల 4,500 మంది జనాభాకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రోడ్ల కోసం జనవరి నెలలో మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని, రహదారుల నిర్మాణానికి దశల వారీగా రూ.2,869 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతగిరి మండలానికి జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తామన్నారు. గిరిజన అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వారి పంటలకు మార్కెటింగ్‌ సదుపాయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గిరిజనులు ఇళ్లు నిర్మించుకునేందుకు అదనపు నిధుల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లా కలెక్టర్‌ సమక్షంలో అదాలత్‌ ఏర్పాటుచేసి, గిరిజనులకు పట్టాలను మంజూరు చేస్తామని చెప్పారు. జీవో నంబర్‌ 3 విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

  • జీవితాలు నాశనం చేసుకుంటున్నారు

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా స్వచ్ఛ సంకల్పం పేరుతో జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా, సాగు వంటి వాటికి దూరంగా ఉండాలని వారికి పిలుపిచ్చారు. జిల్లాను, రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేసేందుకు ముందుకురావాలన్నారు. గిరిజన యువత పర్యాటకంపై దృష్టిపెట్టాలని.. 2-3 గ్రామాలను కలిపి.. పర్యాటకంగా విడిది గదులను ఏర్పాటుచేసి, మంచి ఆదాయం పొందవచ్చని పవన్‌ సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్‌, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, కొప్పుల వెలమ సంఘం చైర్మన్‌ పీవీజీ కుమార్‌, ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్‌ సివేరి దొన్నుదొర, కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, జేసీ అభిషేక్‌ గౌడ్‌, ఐటీడీఏ పీవో అభిషేక్‌, డీఎస్పీ ప్రమోద్‌, డీఎ్‌ఫవో సందీ్‌పరెడ్డి, ఈఈ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 03:50 AM