Share News

Pawan Kalyan: ‘జల్‌జీవన్‌’లో జనం భాగస్వామ్యం

ABN , Publish Date - Dec 19 , 2024 | 05:46 AM

జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచించారు.

Pawan Kalyan: ‘జల్‌జీవన్‌’లో జనం భాగస్వామ్యం

వారి ఫిర్యాదులు, సూచనలకు పెద్దపీట

గత పాలకుల తీరుతో పథకం అస్తవ్యస్తం

5 లక్షలతో అయ్యే పనులూ పెండింగ్‌లోనే..

కోటి మందికి రక్షిత తాగునీరు కూటమి లక్ష్యం

త్వరలో కేంద్రానికి 70 వేల కోట్లతో ప్రతిపాదనలు

కొత్త నీటి వనరుల సృష్టికి సమష్టిగా పనిచేద్దాం

వర్క్‌షాపులో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పిలుపు

నేను 2008లో ఆదిలాబాద్‌ తండాలో తిరుగుతున్నప్పుడు చూపులేని ఓ వృద్ధుడు ఎదురుపడ్డాడు. ‘కాస్త నీళ్లిప్పించయ్యా...’ అని నన్ను వేడుకున్నాడు. ఆ వృద్ధుడు అన్న మాట ఎప్పుడు గుర్తుకువచ్చినా, నా కళ్లలో గిర్రున నీళ్లు తిరుగుతాయి. నా శాఖల్లో అత్యంత కీలకమైంది... నాకు ఇష్టమైంది గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని అందించే ఆర్‌డబ్ల్యూఎస్‌. స్వచ్ఛమైన తాగునీరు అందిస్తే ప్రజల సంతోషానికి హద్దు ఉండదు. చాలా వరకు ఇతర సమస్యలు కూడా తొలగిపోతాయి.

- పవన్‌ కల్యాణ్‌

అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఇప్పుడున్న నీటి వనరులకు కొత్త రూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం ఈ పథకం లక్ష్యం కావాలని వివరించారు. బుధవారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటుచేసిన జల్‌జీవన్‌ మిషన్‌ వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. నీటి నిర్వహణ, సరఫరా విషయంలో పటిష్ఠమైన ప్రణాళిక ఉండాలని అధికారులకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే బృహత్తర ప్రణాళికతో అంతాకలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు ఎలా మొదలుపెట్టాలి, ఎలాముందుకు తీసుకెళ్లాలి, పటిష్ఠంగా ఎలా పూర్తి చేయాలనే విషయాలపై అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, పనులు చేసి వదిలేయడం కాకుండా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలు వినడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివశించే ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి ముందుకెళ్లాలని కోరారు. జల వనరుల లభ్యత, వాటి నుంచి పొందాల్సిన ప్రయోజనం, ఇతర అంశాలను నిశితంగా పరిశీలించి శాశ్వతంగా ఫలితాలు అందేలా జల్‌జీవన్‌ మిషన్‌ పనులను మొదలుపెట్టాలన్నారు. ఇంకా పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..

yhjl;.jpg


ఇప్పటికీ తాగునీటి వెతలు..

స్వాతంత్ర్యానంతరం తాగునీటిని అందించేందుకు రూ.లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అయినా ఇప్పటికీ తాగునీటి వెతలు తప్పడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకునే 2019లో జల్‌జీవన్‌ మిషన్‌ పథకం మేరకు మొదలైంది. ప్రతి మనిషికీ సగటున 55 లీటర్లు రక్షిత తాగునీరు అందించాలనేది పథకం లక్ష్యం. నేను ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా.. తాగునీరు అందడం లేదని జనం చెబుతున్నారు. జల్‌జీవన్‌ పనుల్లో గత ప్రభుత్వం అసలేం చేసిందనేదానిపై పల్స్‌ సర్వేను యుద్ధ ప్రాతిపదికన చేయాలని అధికారులకు చెప్పాం. గత పాలకులు చెప్పిన లెక్కల్లో 70.04 లక్షల కుటుంబాలకు నీటి కుళాయిలు ఇచ్చారు... ఇంకా 25.40 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలి. కానీ, 85.22లక్షల కుటుంబాలకుగాను 55.37 లక్షల కుటుంబాలకు ఇంకా కుళాయిలు బిగించాల్సి ఉన్నదని పల్స్‌ సర్వేలో తేలింది.

కేరళ కంటే తక్కువగా ప్రతిపాదనలు....

‘‘నేను వ్యక్తిగతంగా చాలా సార్లు జల్‌జీవన్‌ మిషన్‌ పనులను సమీక్షించాను. కానీ, ప్రజలందరికీ మేలు చేసే ఇంత కీలకమైన పథకం విషయంలో రాష్ట్రంలో అనుకున్నంత విజయవంతంగా పనులు జరగడంలేదు. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించే ముందు... ఎంతమేర నిఽధులు అవసరమవుతాయని కేంద్రం.. రాష్ట్రాలను అడిగాయి. ఉత్తరప్రదేశ్‌ రూ.1.50 లక్షల కోట్లు, మధ్యప్రదేశ్‌ రూ.83 వేల కోట్లు, గుజరాత్‌ రూ.32 వేల కోట్లు, కేరళ రూ.45 వేల కోట్లు కావాలని అడిగాయి. ఆంధ్రప్రదేశ్‌ కంటే కేరళ చాలా చిన్నది. అయినా, భవిష్యత్‌ అవసరాలు, ప్రజలకు అందాల్సిన పూర్తి తాగునీటి పనులు పూర్తి కావాలంటే నిధులు ఎక్కువ అవసరం అనే కోణంలో ఆలోచించి అంత మొత్తం ఆ రాష్ట్రం అడిగింది. కానీ, గత ప్రభుత్వ పాలకులు మాత్రం ఏపీకి రూ.26వేల కోట్లు చాలంటూ ప్రతిపాదనలు పంపారు. దీంతో కేంద్రం మొదటి దశలో రూ.4,787 కోట్ల పనులు మంజూరుచేసింది. కేంద్ర పథకాల్లో కచ్చితంగా రాష్ట్ర వాటాగా మ్యాచింగ్‌ గ్రాంట్‌ కేటాయించాలనే నిబంధన ఉంటుంది. జల్‌జీవన్‌ మిషన్‌ పనులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయకపోవడంతో కేంద్రమిచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాం.’’


పథకం ఆశయాలకు తూట్లు....

‘‘గత ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌లో సమీపంలోని రిజర్వాయర్లు, ఇతర అతి పెద్ద నీటి వనరుల నుంచి నీటిని గ్రామాలకు ఇవ్వాల్సిందిపోయి భూగర్భ జలాలను బోర్ల ద్వారా అందించే ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 38 మేజర్‌ రిజర్వాయర్ల ద్వారా 95.44 లక్షల తాగునీటి కుళాయిలకు అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే గత పాలకులు మాత్రం జల్‌జీవన్‌ మిషన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి బోర్ల ద్వారా నీటిని అందించేందుకు ఇష్టానుసారంగా పనులు చేశారు. కూటమి ప్రభుత్వం దీన్నంతా సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర పెద్దలకు రూ.70 వేల కోట్లు అవసరమని చెప్పాం. దీనికి సంబంధించి డీపీఆర్‌ దృష్టి సారించాం. జనవరిలోగా రిపోర్టును రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.’’

ఫలాలు అందరికీ అందేలా..

‘‘జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నా...క్షేత్రస్థాయిలో మాత్రం దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం పిల్టర్‌బెడ్స్‌ కూడా చాలా చోట్ల మార్చలేదు. రూ.5 లక్షలు వెచ్చిస్తే అయిపోయే పని ఇది. అది కూడా చేయలేదు. మనం రాష్ట్ర ప్రజలందరికీ ఫలాలు అందించేందుకు శ్రమించాలి. డిప్యూటీ సీఎంగా నేను మిమ్మల్ని ఆదేశించడం లేదు. అందరం కలిసి రాష్ట్రంలోని కోటి మంది ప్రజల తాగునీటి కలను నిజం చేద్దాం’’ అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఆ శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సంజీవరెడ్డి, సీఈ హరిరామనాయక్‌, జలవనరుల చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, అన్నీ జిల్లాల నుంచి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు, ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 05:46 AM