ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan : ‘చెత్తతో సంపద’పై సర్కార్‌ దృష్టి

ABN, Publish Date - Aug 16 , 2024 | 03:22 AM

పర్యావరణపై పరిరక్షణపై విపరీతమైన ఆసక్తి ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. చెత్తతో సంపద అంశానికి ఆకర్షితుడయ్యారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు శ్రీనివాసన్‌ను మళ్లీ చెత్తతో సంపద తయారీకి సంబంధించి కన్సల్టెంట్‌గా నియమించి గ్రామ పంచాయతీల్లో ఈ ప్రయోగాన్ని మళ్లీ మరోసారి అమలు చేయాలని భావించారు.

  • గ్రామాల్లో ఆదాయవనరుల పెంపునకు ప్రణాళికలు

  • డిప్యూటీ సీఎం పవన్‌ చొరవతో కార్యాచరణ

  • 10వేల ఘన వ్యర్థాల షెడ్లు వినియోగంలోకి

  • తడి, పొడి చెత్త వేరుచేసి వర్మీకంపోస్టు తయారీ

  • వర్మీకి రైతులే వినియోగదారులు

  • స్వయం సమృద్ధి దిశగా పంచాయతీలు!

  • ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా పిఠాపురం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పర్యావరణపై పరిరక్షణపై విపరీతమైన ఆసక్తి ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. చెత్తతో సంపద అంశానికి ఆకర్షితుడయ్యారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు శ్రీనివాసన్‌ను మళ్లీ చెత్తతో సంపద తయారీకి సంబంధించి కన్సల్టెంట్‌గా నియమించి గ్రామ పంచాయతీల్లో ఈ ప్రయోగాన్ని మళ్లీ మరోసారి అమలు చేయాలని భావించారు.

ఇందులో భాగంగా ముందుగా ఆయన తన నియోజకవర్గం పిఠాపురంలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించారు. చెత్త సేకరణ ద్వారా పరిసరాలు శుభ్రంగా ఉంచడమే కాకుండా పంచాయతీలకు ఆదాయ వనరుగా మార్చడం వల్ల గ్రామసీమల ముఖచిత్రమే మార్చవచ్చన్న యోచనలో ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టు సక్సె్‌సకు సమర్థుడైన అధికారి కోసం అన్వేషించారు. కేరళలో పనిచేసే తెలుగు ఐఏఎస్‌ కృష్ణతేజను ఏరికోరి పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా తెచ్చుకున్నారు.

ప్రస్తుతం కృష్ణతేజ కేరళలో పంచాయతీలు బలోపేతం కావడానికి, మన రాష్ట్రంలో బలహీనంగా ఉండటానికి కారణాలను అధ్యయనం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో చెత్తను అంత తేలికగా తీసుకోరాదని, దాని సంపదగా మలుచుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయని చెప్తున్నారు. స్వచ్ఛభారత్‌ పుణ్యమా అని గ్రామాల్లో ఇప్పటికే గ్రీన్‌ అంబాసిడర్లను నియమించారు.

ఉపాధి హామీ పథకం నిధులతో ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్లు నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తగా సుమారు 10 వేలకు పైగా షెడ్లు ఉన్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా సచివాలయ కార్యదర్శులను నియమించి ఉన్నారు. అన్నీ ఉన్నా.. సరైన ప్రణాళికలతో పనిచేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.


అన్ని వర్గాల అభిప్రాయాలతో...

పవన్‌ కల్యాణ్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని వర్గాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించి గ్రామాభివృద్ధికి ఏయే చర్యలు తీసుకోవాలో వారి నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు.

వారి సమస్యలను ప్రతి ఒక్కటీ నోట్‌ చేసుకుని ఏం చేస్తే గ్రామీణులకు మేలు చేయగలమో యోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులు జరుపుకోవాలంటే రూ.100లు, రూ.200ల కంటే ఎక్కువగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండేది కాదు.

సర్పంచ్‌లతో సమావేశమైన తర్వాత ఈ విషయాలు తెలుసుకున్న వెంటనే ఆ మేరకు నిర్ణయం తీసుకోగలిగారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి అన్ని విభాగాల ఉద్యోగులతో కూడా సమావేశమవుతున్నారు. వారి సాధకబాదకలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను కూడా స్వీకరిస్తున్నారు. సర్పంచ్‌లతో మాట్లాడటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వీర్యంగా ఉన్న ఘన వ్యర్థాల షెడ్ల ప్రస్తావన వచ్చింది.

వాటిని వినియోగంలోకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న సుమారు 10 వేల ఘన వ్యర్థాల షెడ్‌లను వినియోగంలోకి తెచ్చి వర్మీకంపోస్టు తయారుచేసి రైతులకు విక్రయించడం ద్వారా చెత్త సమస్య లేకుండా పోవడమే కాకుండా పంచాయతీలకు ఆదాయం గడించేలా చేయవచ్చని భావిస్తున్నారు.


డేటా సేకరణతో శ్రీకారం

ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తుండటం, చెత్త ఎక్కడ పడితే అక్కడే పడేయడం వల్ల గ్రామాల్లో ఏయే జబ్బులు వస్తున్నాయో? డేటా సేకరించి ఆ మేరకు అప్రమత్తం చేయనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించే ముందుగా సర్వే నిర్వహించనున్నారు.

ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించి ఎవరింట్లో ఎంత చెత్త వస్తుంది, ఆయా గ్రామాల్లో మొత్తం ఎంత చెత్త వస్తుంది?, ఆయా చెత్తలను వేరుచేయడం ద్వారా ఘన వ్యర్థాలకు సంబంధించిన చెత్త ఏ మేరకు వస్తుందనే దానిపై డేటా సేకరిస్తారు. అందుకు అనుగుణంగా చెత్త సేకరణ చేపట్టి ఘన వ్యర్థాల షెడ్లలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. తయరైన వర్మీ కంపోస్టు ఎలా మార్కెట్‌ చేయాలనేదానిపైనా కసరత్తు చేస్తారు.


తడి, పొడి చెత్తలు వేరుచేసి వర్మీ తయారీ

గ్రామాల్లో తడిచెత్త రకాలుగా పశువుల పేడ, మిగిలిన అన్నంకూరలు, మిగిలిన పోయిన మాంస పదార్థాలు, అన్నం తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలు, పువ్వులు, కొబ్బరిపీచులు, కూరగాయల తొక్కలు, పనికిరాని చీపుర్లు, కాచిన టీ, కాఫీ పొడి, వంటగదిలో ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థాలు, పెరటి నుంచి, పంట నుంచి వచ్చే ఆకులు, మొక్కలు, పండ్లతొక్కలు, పచ్చగడ్డి, ఎండుగడ్డి, అన్ని రకాల చనిపోయిన చిన్న కీటకాలు, పురుగులుగా గుర్తిస్తున్నారు. పొడి చెత్తగా చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ సంచులు, కవర్లు, గాజుసీసాలు, పనికిరాని గుడ్డముక్కలు, చెప్పులు, బ్యాగులు, వాటర్‌, కూల్‌డ్రింక్స్‌ బాటిల్స్‌, సబ్బు, షాంపూ, గుట్కా, బిస్కెట్‌, పాలకవర్లు, పాడైన బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వస్తువులు, పనికిరాని నోటు పుస్తకాలు, అట్టలు, అట్టపెట్టెలు, థర్మాకోల్‌ వస్తువులు, బల్బులు, ట్యూబులు, ట్యాబ్లెట్‌ కవర్లు, టూత్‌పే్‌స్ట, పౌడర్‌, ఆయిల్‌ డబ్బాలు, ఇనుప, స్టీలు వస్తువులు, కోడిగుడ్డు పెంకులు, వెంట్రుకలు, ఎముకలు, అన్ని రకాల ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాలను గుర్తించారు. ఈ విధంగా వేరుచేసిన తడి చెత్తను వానపాముల సాయంతో వర్మీ కంపోస్టు తయారుచేస్తారు.


కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు...

ఇప్పటికే పిఠాపురం పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన పంచాయతీరాజ్‌శాఖ ఘన వ్యర్థాల షెడ్లు వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖలోని అన్ని విభాగాలను అప్రమత్తం చేసి దీనిని ఒక ఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించారు. గ్రీన్‌ అంబాసిడర్లును ఉపయోగించుకుని వారికి ప్రతి నెలా జీతం అందేలా చేయనున్నారు. గ్రామాల్లో ఈ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన తీసుకురావాలని భావిస్తున్నారు. గ్రామాల్లో స్వయం సహాయ సంఘాలను కూడా వాటి కోసం వినియోగించుకోవడంతో పాటు గ్రామాల్లో అన్ని సంఘాల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.


గ్రామాల్లో చెత్తను సంపదగా మార్చాలి.. పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా మళ్లించాలి.. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిరోజూ చెత్త సేకరణ ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు ఆ చెత్తను ప్రాసెస్‌ చేయడం ద్వారా పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలి.. ఆయా సర్పంచులు నిధుల కోసం ప్రభుత్వాన్ని యాచించే పరిస్థితి రాకూడా చూడాలి.. ఇదీ కూటమి ప్రభుత్వ మహత్తర లక్ష్యం!.. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో ఈమేరకు పంచాయతీరాజ్‌శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే పిఠాపురంలో తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఈ దిశగా ప్రభుత్వ చర్యలు ఫలిస్తే పంచాయతీలు స్వయం సమృద్ధి దిశగా దూసుకుపోతుందనడంలో ఏ మాత్రం సందేహంలేదు! గతంలో ఈ ప్రయోగాలు విఫలమైనా... సెలబ్రిటీ అయిన పవన్‌ కల్యాణ్‌ పిలుపుతో గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమంలా ఈ పథకం సఫలీకృతమవుతుందని భావిస్తున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 03:22 AM

Advertising
Advertising
<