YS Sharmila : ఆస్తులపైనే మీ ప్రేమ!
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:08 AM
ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మరిచిపోయారని తన సోదరుడు వైఎస్ జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
అనుబంధాలను మరిచిపోయారు: షర్మిల
నాలుగు గోడలమధ్య మాట్లాడుకోవాల్సింది
ఇప్పుడు తల్లీ చెల్లిని కోర్టుకు ఈడ్చారు
ఇది మామూలు విషయం కాదు జగన్ సార్!
ఓటమి తర్వాత మనసు మారింది
కంపెనీలను వదులుకోవద్దనే ఈ కథలు
షేర్లు బదిలీ చేస్తే బెయిలు రద్దవుతుందా?
ఇది ఈ శతాబ్దపు జోక్: షర్మిల
‘‘ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు. సామరస్యంగా పరిష్కరించుకోవాలని, నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని నాకూ తెలుసు. కానీ... కుటుంబ విషయాలను జగన్ రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కోర్టు వరకూ తీసుకువెళ్లారు. తల్లినీ, చెల్లినీ కోర్టుకు ఈడ్చడం సాధారణ విషయం కాదు జగన్ సార్!’’
- మీడియాతో షర్మిల
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మరిచిపోయారని తన సోదరుడు వైఎస్ జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకు వచ్చారని ఆగ్రహించారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కోర్టు వరకూ తీసుకువెళ్లారని విమర్శించారు. ఆస్తులు ఇచ్చేది లేదంటూ లేఖ రాయడంతోపాటు, తల్లిపైనా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)లో జగన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన సోదరి షర్మిల గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘కుటుంబ కలహాలు మామూలే’ అని జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘కుటుంబాల్లో గొడవలు సాధారణమే అని జగన్ చెబుతున్నారు. కుటుంబ కలహాలు సామాన్యమేనంటూ తల్లిని, చెల్లిని కోర్టుకెందుకు ఈడ్చారు. ఇది సామాన్యమైన విషయం కాదు జగన్ సార్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎందుకీ బీద ఏడుపులు...
కేవలం ఆస్తులను లాక్కోవడం కోసమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులని, బెయిల్ రద్దు అవుతుందని జగన్ రకరకాల సాకులు చెబుతున్నారన్నారు. ఆయన చెప్పినవేవీ నిజాలు కావని స్పష్టం చేశారు. ‘‘సరస్వతీ పవర్‌లో నాకు వాటాలివ్వడంవల్ల బెయిల్ రద్దవుతుందంటూ జగన్ బీద ఏడుపు ఏడుస్తున్నారు. ఇది ఈ శతాబ్దపు జోక్. చట్ట విరుద్ధమని తెలిసినా ప్రేమతో నాకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధం’’ అని షర్మిల పేర్కొన్నారు. 2016లో ఈడీ అటాచ్ చేసినందున షేర్లు బదిలీ చేయకూడదన్న జగన్ వాదనను తోసిపుచ్చారు. ‘‘సరస్వతీ కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. రూ.32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసింది. షేర్లను ఏ సమయంలోనైనా బదిలీ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లలో ఉన్న చాలా కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయినా వాటి ట్రేడింగ్ జరుగుతోంది కదా!’’ అని షర్మిల ప్రశ్నించారు. సరస్వతీ పవర్ షేర్లను 100 శాతం తనకు బదిలీ చేస్తామని 2019లోనే జగన్ ఎంఓయూపై సంతకం చేశారని షర్మిల తెలిపారు. అప్పుడు బెయుల్ సంగతి గుర్తుకు రాలేదా అన్నారు. ‘‘2021లో క్లాసిక్ రియల్టీ, సండూర్ పవర్‌లో ఉన్న కంపెనీ షేర్లను రూ.42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి వైఎస్ విజయమ్మకు ఎలా అనుమతి ఇచ్చారు? 2021లో జగన్, ఆయన సతీమణి కలిసి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ఇవ్వలేదా? అప్పుడు బెయిల్ రద్దు గుర్తుకురాలేదా?’’ అని ప్రశ్నించారు.
ఇదీ అసలు విషయం...
మొన్నటి ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయాక జగన్ మనసు మారిందని... ఈ ప్రాజెక్టులను వదులుకోవడానికి ఇష్టపడటం లేదని షర్మిల చెప్పారు. అసలు విషయం ఇదే అన్నారు. ‘‘సరస్వతీ పవర్‌ను కూడా భారతీ సిమెంట్స్ కంపెనీ కింద నిర్వహించాలనుకుంటున్నారు. అందుకే షేర్లను బదిలీ చేయలేమని చెబుతున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.
ఎందుకంత ‘పగ’.. అంటే!
‘జన్మతః మన మధ్య సంక్రమించిన బాంధవ్యం, చిన్నతనం నుంచీ పంచుకున్న అనుభూతులు, ప్రశాంతమైన జ్ఞాపకాలన్నీ.. మారిన నీ వైఖరితో గతంగా మారాయి. సోదరుడినన్న ప్రేమ, ఆప్యాయతలు లేకుండా నువ్వు చేస్తున్న చర్యలతో నా హృదయం తీవ్రంగా గాయపడింది. నాపై పదేపదే అసత్యాలు చెప్పావు. తప్పుడు ప్రచారం చేశావు. రాజకీయంగా నాతో విభేదించడమే కాకుండా వ్యక్తిగతంగా నా ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించావు. ఇంత చేశాక నీ మీద ప్రేమ, ఆప్యాయతలు ఎందుకు ఉండాలి. మన మధ్య సఖ్యత, సుహృద్భావ పరిస్థితులు లేవన్న దాంట్లో రహస్యమేమీ లేదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో... ఆస్తుల్లో వాటాలకు సంబంధించిన ఒరిజినల్ ఎంవోయూ అమలు చేసేందుకు సిద్ధంగా లేను. సరస్వతీ పవర్‌లో వాటాలను ఇస్తూ చేసిన డిక్లరేషన్‌ను రద్దు చేసుకుంటున్నాను. న్యాయస్థానంలో కేసులు తేలాక, నీ వైఖరి మారితే... అప్పుడు అన్నా చెల్లెళ్ల బంధం మళ్లీ చిగురించే అవకాశం ఉంది!’’
- ఆగస్టు 27న షర్మిలకు రాసిన లేఖలో జగన్
Updated Date - Oct 25 , 2024 | 07:38 AM