పోలవరం సొరంగాలకు ముప్పు!
ABN, Publish Date - Nov 25 , 2024 | 03:36 AM
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాలు ముప్పు ముంగిట నిలిచాయి. లైనింగ్ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండమే ఇందుకు కారణం! సొరంగాలు లైనింగ్ పనులకు నోచుకోకపోవడంతో నీటి ఊట కారణంగా నేడు అవి కూలి, మూసుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ ప్రభుత్వంలో నోచుకోని లైనింగ్ పనులు
నీటి ఊట కారణంగా కూలుతున్న పైభాగాలు
సొరంగాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం
మళ్లీ తవ్వాలంటే అదనపు వ్యయ భారం
(పోలవరం-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాలు ముప్పు ముంగిట నిలిచాయి. లైనింగ్ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండమే ఇందుకు కారణం! సొరంగాలు లైనింగ్ పనులకు నోచుకోకపోవడంతో నీటి ఊట కారణంగా నేడు అవి కూలి, మూసుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కొండలపై ఊట నీటి ప్రభావంతో సొరంగం లోపల పైభాగాన రాళ్ల మధ్య ఉన్న మట్టి, ఊట నీటితో కలిసి కిందకు జారి, పైభాగాలు కుప్పకూలుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జంట సొరంగాలు పూర్తిగా మూసుకుపోయి, వాటిని మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అదనపు వ్యయం చేయాల్సి ఉంటుంది.
వీటి ఉపయోగం ఏంటి?
ఈ సొరంగాల సాయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కుడి కాలువ నుంచి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, రాయలసీమకు 80 టీఎంసీల జలాలతో 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల్లో 28 లక్షల మందికి తాగునీరు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు కుడి వైపున తోటగొంది, మామిడిగొంది గ్రామాల మధ్య ఉన్న కొండను తొలచి జంట సొరంగాలను తవ్వారు. జంట సొరంగాల్లో మొదటిది తోటగొంది- మామిడిగొంది సొరంగాలు. వాటిలో ఎడమ సొరంగం 826 మీటర్ల పొడవు, కుడి సొరంగం 735 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున తొలిచారు. మామిడిగొంది-దేవరగొంది గ్రామాల మధ్య కొండను తొలచి 735 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పున మరో జంట సొరంగాలను, అదే తరహాలో నిర్మించారు.
ప్రాజెక్టు నిర్మాణ ఆరంభంలో జలవనరుల శాఖ అధికారులు 2005లో ఈ పనులను ప్రారంభించారు. 2018లో రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల పర్యావరణ పరిరక్షణ కమిటీ బోర్డు అనుమతులు, కోర్టు అభ్యంతరాల నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. అనంతరం 2019లో అప్పటి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే ధ్యేయంగా పనులను ముందుకు నడిపించారు. జంట సొరంగాల నిర్మాణం జాప్యం కాకూడదనే ఉద్దేశంతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా, జర్మనీ నుంచి దిగుమతి చేసిన అధునాతన యంత్రాలతో రెండు జంట సొరంగాల తొలచే పనులు 2019 మార్చిలో ప్రారంభించి, పూర్తి చేశారు.
టన్నెళ్లకు నీళ్లు ఎలా చేరుతాయంటే..
పోలవరం ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు కుడి కాలువకు జలాల తరలింపు కోసం కుడి కాలువ కనెక్టివిటీ నిర్మాణంలో భాగంగా 5 మీటర్ల పొడవున 9 గేట్లతో హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. దీని ద్వారా విడుదలైన జలాలు మామిడిగొంది-దేవరగొంది గ్రామాల మధ్య నిర్మించిన జంట సొరంగాల ద్వారా 325 మీటర్ల పొడవు, 44 మీటర్ల ఎత్తున రిజర్వాయర్ కోసం నిర్మించిన ఎఫ్ శ్యాడిల్ డ్యాం ప్రాంతంలోకి చేరుకుని, అక్కడి నుంచి తోటగొంది-మామిడిగొంది గ్రామాల మధ్య 725 మీటర్ల పొడవున నిర్మించిన మరో ఇ-శ్యాడిల్ డ్యాం రిజర్వాయర్ ద్వారా జంట సొరంగాల్లోకి ప్రవేశించి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా దిగువకు ప్రవహించి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలోకి ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించారు. కుడి కాలువ ద్వారా విడుదలైన జలాలు 174 కిలోమీటర్లు పొడవునా ప్రవహించి మార్గమధ్యలో కొవ్వాడ, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు, ఎర్ర కాలువలను దాటి విజయవాడ వద్ద బుడమేరు నీటి ప్రవాహంలో కలిసి, వెలగలేరు డైవర్షన్ రెగ్యులేటర్ ద్వారా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి అనుసంధానం అవుతాయి.
లైనింగ్ పనులకు మరో ఏడాది
గత ప్రభుత్వ హయాంలో జంట సొరంగాల వెడల్పు పనులు చేపట్టడం జరిగింది. తోటగొంది-మామిడిగొంది జంట సొరంగాల్లో ఎడమవైపు టన్నెల్ వెడల్పు పనులు 50 శాతం, కుడివైపు టన్నెల్ 90 శాతం, మామిడిగొంది-దేవరగొంది సొరంగాల్లో కుడివైపు టన్నెల్ 70 శాతం, ఎడమవైపు టన్నెల్ 30 శాతం పనులు పూర్తయ్యాయి. జంట సొరంగాలకు రక్షణ కల్పించే లైనింగ్ పనులు పూర్తి చేయడానికి మరో ఏడాది సమయం పడుతుంది.
- బాలకృష్ణ, ప్రాజెక్టు ఈఈ
సొరంగాల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
నాటి నుంచి నేటి వరకూ జంట సొరంగాల లైనింగ్ పనులు పూర్తి కాలేదు. తాజాగా ఇప్పుడు తోటగొంది-మామిడిగొంది జంట సొరంగాల్లో.. ఎడమ వైపు టన్నెల్‌లో కూలిన ప్రాంతంలో పైభాగం పూర్తిగా పడి, మార్గం మూసుకుపోయింది. ఆ ప్రాంతంలో కొండ పైనుంచి ఊట జలాలు కిందికి జలపాతంలా ప్రవహిస్తున్నాయి. కుడి సొరంగాన్ని 50 మీటర్ల మేర వెడల్పు చేసి పనులు నిలిపివేశారు. ఈ సొరంగాలకు రక్షణ కోసం లైనింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కొండపై నుంచి సొరంగాల్లోకి వస్తున్న ఊట జలాల ఉధృతికి రెండు టన్నెళ్లలో పలు చోట్ల మట్టి, కొండరాళ్లు భారీ స్థాయిలో కిందకు పడుతున్నాయి. లైనింగ్ ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. మామిడిగొంది-దేవరగొంది జంట గుహల పనులు సైతం అసంపూర్తిగా నిలిచిపోయాయి.
జగన్ ప్రభుత్వం చేసిందేంటి..?
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట కొంత కాలం జాప్యం చేయడం, ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన పనుల పట్ల దృష్టి సారించకపోవడంతో జంట సొరంగాల పనులు ఐదేళ్ల పాటు పడకేశాయి. జంట సొరంగాలకు చేపట్టాల్సిన లైనింగ్ పనులను విస్మరించడంతో లైనింగ్ నిర్మాణం పూర్తికాక 2021 అక్టోబరులో తోటగొంది-మామిడిగొంది గ్రామాల మధ్య నిర్మించిన జంట సొరంగాల్లో ఎడమవైపు ఉన్న సొరంగం.. మామిడిగొంది గ్రామం వైపు టన్నెల్ ప్రారంభం నుంచి 50 మీటర్ల దూరంలో సుమారు 30 మీటర్ల మేర కొండ పైభాగం కూలిపోయింది. అప్పట్లో ప్రసార మాధ్యమాల్లో ఈ వార్త హల్‌చల్ చేసింది.
Updated Date - Nov 25 , 2024 | 03:38 AM