Dowleswaram: బాలికల కిడ్నాప్ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. అదుపులో నిందితుడు
ABN, Publish Date - Aug 12 , 2024 | 06:55 PM
జల్సాలకు అలవాటుపడి ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన నిందితుడు వెంకటేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. ఎస్పీ నర్సింహ కిశోర్ కేసు వివరాలను వెల్లడించారు.
రాజమండ్రి: జల్సాలకు అలవాటుపడి ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన నిందితుడు వెంకటేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బయటకొచ్చాయి. ఎస్పీ నర్సింహ కిశోర్ కేసు వివరాలను వెల్లడించారు. "గత నెల జులై 27న సాయంత్రం నెల్లూరులో పిల్లలతో కలిసి నిందితుడు కనిపించాడు. అతను ఇతర ప్రాంతాల్లో మూడు లాడ్జీల్లో ఉన్నాడు. విజయవాడ, గుంటూరు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపి గాలించాం. నెల్లూరు పోలీసులు, స్థానికులు ఆర్పీఎఫ్‌జీఆర్పీ సాయంతో.. నిందితుడు చెన్నై మీదుగా పిల్లలను ఊటీ తీసుకెళుతుండగా పట్టుకున్నాం. విజయనగరం జిల్లా పెదమానాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ ఒక యువతిను పెళ్లి చేసుకుని విడిచిపెట్టాడు. జల్సాలకు అలవాటుపడి కిడ్నాప్‌లు తదితర దందాలు చేస్తున్నాడు. నిందితుడుపై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తాం. ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి" అని కిశోర్ సూచించారు.
బాలికలను నమ్మించి అపహరణ..
బాలికలను కిడ్నాప్ చేసేందుకు నిందితుడు వెంకటేష్ తాను రైల్వే టీసీగా పని చేస్తున్నట్లు సదరు బాలికల తల్లిని నమ్మించాడు. ఒడిశా బరంపురానికి చెందిన సునీత కుటుంబం కొన్నేళ్లుగా ధవళేశ్వరంలో నివాసం ఉంటోంది. సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలో హాస్టల్లో ఉంటున్న వీరి కూతుళ్లలో ఒకరు 9, మరొకరు పదో తరగతి చదువుతున్నారు.
ఇదిలావుండగా, గత నెల 22న వెంకటేష్ అనే యువకుడు సునీతతో తాను రైల్వే టీసీ అని చెప్పి బాలికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే చివరకు కనిపించకుండా పోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి తమ కూతుళ్లను రక్షించాలని కోరింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు క్రమంలో అతను తన భార్యను వదిలిపెట్టి ఓ యువతితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు.
Updated Date - Aug 12 , 2024 | 06:59 PM