Yeluri Sambasiva Rao:రైతులకు మోసం చేయడంలో జగన్‌ను మించిన వారు లేరు
ABN, Publish Date - Mar 06 , 2024 | 08:29 PM
దేశానికి అన్నం పెట్టే రైతులను మోసం చేయడంలో సీఎం జగన్(CM Jagan)ను మించిన వారు దేశంలోనే ఉండరని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు( Yeluri Sambasiva Rao) అన్నారు.
అమరావతి: దేశానికి అన్నం పెట్టే రైతులను మోసం చేయడంలో సీఎం జగన్(CM Jagan)ను మించిన వారు దేశంలోనే ఉండరని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు( Yeluri Sambasiva Rao) అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.100లు ఖర్చుపెట్టని జగన్ రెడ్డి, నేడు ప్రారంభోత్సవం పేరుతో పెద్దడ్రామా నడిపారని మండిపడ్డారు. అసమగ్ర ప్రాజెక్ట్‌ను జగన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించడం ఎన్నికల్లో లబ్ధిపొందడానికేనని ప్రజలు గ్రహించారని చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో 3 గేట్లు పెట్టని ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ప్రారంభిస్తుంటే పశ్చిమ ప్రకాశం వాసులు ఫక్కున నవ్వుకున్నారని ఆరోపించారు.
ప్రాజెక్ట్ పరిధిలో 11 ముంపు గ్రామాలుంటే, 7 వేలమంది రైతులకు రూ.1500కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఫీడర్ కాలువ లైనింగ్ పనులు, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ వర్క్స్ పూర్తికాలేదని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణంతో పాటు, వాటిపై వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేసినా ప్రాజెక్ట్ పూర్తికావడానికి ఏడాదిన్నరకు పైగా పడుతుందని చెప్పారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.1500కోట్లతో కలిపి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంకా రూ.4వేలకోట్లు అవుతుందని తెలిపారు.ఇంతపని పెండింగ్‌లో ఉంటే ముఖ్యమంత్రేమో ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయిందని.. జాతికి అంకితం చేశానని నిస్సిగ్గుగా జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 06 , 2024 | 11:04 PM