ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Petitioner : జగన్‌పై సుప్రీంలో మళ్లీ పిల్‌

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:48 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై అప్పటి సీఎం స్థానంలో ఉన్న జగన్‌ పలు ఆరోపణలు చేశారని, అవన్నీ నిరాధారమని పిటిషనర్‌ పేర్కొన్నారు.

  • మాజీ సీజేఐ జస్టిస్‌ రమణపై గతంలో వైసీపీ అధినేత ఆరోపణలు

  • మాజీ సీఎంపై చర్యలు కోరుతూ వ్యాజ్యం

  • గతంలో వేసిన పిల్‌ స్థానంలో మరొకటి

  • పాత విషయాలు ఇప్పుడెందుకన్న ధర్మాసనం

  • విచారణ జనవరికి వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై అప్పటి సీఎం స్థానంలో ఉన్న జగన్‌ పలు ఆరోపణలు చేశారని, అవన్నీ నిరాధారమని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థ పట్ల సున్నితమైన వైఖరిని అవలంభించాలని అభిప్రాయపడింది. ‘‘పాత విషయాలన్నీ అనవసరంగా ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు? న్యాయ వ్యవస్థ పట్లయినా కనీసం మీరు సున్నితంగా ఉండాలి’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. అయితే, తాము పాత విషయాలేమీ తవ్వే ప్రయత్నం చేయడం లేదని, 2020 అక్టోబర్‌లోనే ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశామని పిటిషనర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ తరఫున న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి.. జనవరికి వాయిదా వేసింది.

  • అసలేం జరిగింది?

2020, అక్టోబరు 6న సీఎం జగన్‌ అప్పటి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, అలా చేయడం సరైందికాదని సునీల్‌కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు గుప్పిస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డేకు జగన్‌ లేఖ రాయడమే కాకుండా అక్టోబరు 11న జగన్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న అజయ్‌ కల్లం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారని వివరించారు.


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేశారని, కొంతమంది న్యాయమూర్తుల రోస్టర్‌ను కూడా మార్పించారని జగన్‌ తన లేఖలో వివరించినట్టు తెలిపారు. జస్టిస్‌ ఎన్వీ రమణ.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏపీ హైకోర్టును ఉపయోగించుకుంటున్నారని కూడా తన లేఖలో జగన్‌ ఆరోపించారని పిటిషనర్‌ ప్రస్తావించారు.

అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే జస్టిస్‌ రమణ కుమార్తెలు అక్కడ భూములు కొన్నారని కూడా పేర్కొన్నారన్నారు. అయితే, జస్టిస్‌ ఎన్వీ రమణపై జగన్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నియమించిన అంతర్గత కమిటీ తేల్చిందన్నారు. దీంతో జస్టిస్‌ ఎన్వీ రమణను 48వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సీజేఐ జస్టిస్‌ బాబ్డే కేంద్రానికి సిఫారసు చేశారని తెలిపారు. జస్టిస్‌ రమణపై జగన్‌ చేసిన ఆరోపణలు సాధారణ ప్రజానీకాన్ని ద్రిగ్భాంతికి గురిచేశాయని, దేశవ్యాప్తంగా అడ్వకేట్‌ సంఘాలతోపాటు అనేక మంది న్యాయ నిపుణులు జగన్‌ వైఖరిని ఖండించారని పిటిషనర్‌ తన పిల్‌లో వివరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పిల్‌ దాఖలు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 04:48 AM