ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

ABN, Publish Date - Jul 20 , 2024 | 04:28 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

Heavy Rains

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం.. తూర్పు, పశ్చిమలో ఎర్ర కాలువ కన్నెర్ర

నీట మునిగిన పలు గ్రామాలు.. గోదావరికి భారీ వరద.. సముద్రంలోకి 4 లక్షల సెక్కులు

ఉత్తరాంధ్రలో స్తంభించిన జనజీవనం.. కోనసీమ, పశ్చిమ, విశాఖ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

తూర్పులో ఒకరు, కోనసీమలో ఒకరు మృతి.. 15 వేలకుపైగా ఎకరాల్లో అన్నదాతకు నష్టం

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు గోదావరి నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన వర్షాలతో 15 వేల ఎకరాల్లో నాట్లు నీటమునిగి రైతులకు అపారనష్టం వాటిల్లింది. కోనసీమలో వేటకు వెళ్లిన ఒక మత్స్యకారుడు మృతి చెందగా, తూర్పులో మరో వ్యక్తి ఎర్రకాలువ ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.


ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్ వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఎర్రకాలువ కన్నెర్ర చేయడంతో పదుల సంఖ్యలో గ్రామాలు, వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాజమహేంద్రవరంలో పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో 1922.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


పొంగిన డ్రెయిన్లు

పశ్చిమ గోదావర్లిలో భారీ వర్షాలకు ప్రధాన పట్టణాల్లో డ్రైయిన్లు పొంగిపొర్లాయి. ఎర్రకాలువ ఉప్పొంగి.. వరద బీభత్సం సృష్టించింది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం మాధవరం, జగన్నాథపురం, నందమూరు, మారంపల్లి, అప్పారావుపేట, వీరంపాలెం గ్రామాల్లో వందలాది ఎకరాలు మునిగిపోయాయి.


స్తంభించిన జనజీవనం..

కోనసీమ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. వరి పొలాలు, వరి నారుమడులు ముంపునకు గురయ్యాయి. కలెక్టరేట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా తొమ్మిది మండలాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వేల ఎకరాల్లోవరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పి.గన్నవరం పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఉడిమూడి శివారు ఉడిమూడిలంక గ్రామస్తులు ఇంజన్‌ పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.


పొంగిన వాగులు

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో ఎడతెరపిలేని వర్షం కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతూరు, వీఆర్‌పురం మండలాల ప్రధాన రహదారిపై జల్లేరు గూడెంవాగు పొంగి ప్రవహిస్తోంది. ఉమ్మడివరం వద్ద వాగు ఉధృతికి వంతెన సైడ్‌ బర్మ్‌ కోతకు గురైంది. ఎటపాకలో పత్తి, వరి నారు నీట మునిగింది. కూనవరం మండలంలో శబరి, సీలేరు, గోదావరి నదుల సంగమం ఉధృతి దాల్చింది.


ముందు జాగ్రత్త చర్యలు

ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ వాగులు, ఎర్రకాలువ, తమ్మిలేరు ఉధృతంగా పొంగుతున్నాయి. తమ్మిలేరు వరద కారణంగా ఏలూరులో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి ప్రకటించారు. జిల్లాలోని 12 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పార్ధసారథి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి కొగువారిగూడెం ఎర్ర కాలువ ప్రాజెక్టు నుంచి 12,713 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా వేలేరుపాడు మండలంలో 26.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


ఐదు రోజులుగా వర్షాలు

అల్లూరి జిల్లాలో 5రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో గోదావరి ముంపు ప్రాంతాలున్న చింతూరు డివిజన్‌ పరిధిలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 08935293120, 08935293448కు కాల్‌ చేయాలని సూచించారు.


పొలాల్లోకి నీరు

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా చెరువులు, పంట పొలాల్లో నీరుచేరింది. అన్ని మండలాల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేయాలని సూచించారు.


ఉధృతంగా ప్రవహిస్తోన్న వాగు

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలతో కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగుపై ఉన్న వంతెనలపై రాకపోకలను నిలిపేశారు. కృష్ణాజిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు డ్రెయిన్‌ మచిలీపట్నం, చల్లపల్లి, ఘంటసాల మండలాల పరిధిలోని గుండేరు, శివగంగ డ్రెయిన్‌లు పొంగి ప్రవహిస్తున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంశధార, నగావళి నదులకు వరద పోటెత్తుతోంది.

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో లోతట్టుప్రాంతాలు మునిగాయి.


రైతు కష్టం- అపార నష్టం!

తూర్పుగోదావరి జిల్లాలో 7,500 ఎకరాల్లో వరి నీట మునిగినట్టు వ్యవసాయాధికారి ఎస్‌. మాధవరావు తెలిపారు.

పశ్చిమగోదావరిలో 15,485 ఎకరాల్లో నాట్లు ముంపునకు గురయ్యాయి.

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం, గుడ్లవల్లేరు, పెడన, తదితర మండలాల్లో వరినాట్లు వేసిన పొలాల్లోకి వర్షపునీరు చేరింది. దీంతో రైతులకు అపార నష్టం ఏర్పడింది.


ఇద్దరు మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ ఉధృతికి నిడదవోలు మండలం తీరుగూడెం గ్రామానికి చెందిన ఘంటసాల వెంకటేశ్ (56) కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మృతుడి కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేశ్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక లోని గంగాపురం కాలనీకి చెందిన కొప్పనాతి రాంబాబు(38) అనే మత్స్యకారుడు మృతి చెందారు. వేటకు వెళ్లిన రాంబాబు.. చేపల కోసం విసిరిన వల గాలికి తిరిగి అతడి మీదే పడింది. దీంతో ఉప్పుటేరులో పడి ప్రాణాలు కోల్పోయారు.

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి- చీపురుపల్లి గ్రామాల మధ్య రోడ్డు మీదకు కొండవాగు నీరు రావడంతో శివ అనే యువకుడు బైక్‌మీద దాటే యత్నంలో కొట్టుకుపోయాడు. స్థానికులు రక్షించారు.


స్కూళ్లకు సెలవు

వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖ జిల్లాల్లో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా తాడివలస పంచాయతీ లచ్చయ్యపేటలోని ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలలో వర్షపునీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Jul 20 , 2024 | 07:21 AM

Advertising
Advertising
<