Doctors : పిల్లలకు సొంత వైద్యం
ABN, Publish Date - Nov 27 , 2024 | 03:58 AM
చిన్నారులకు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగకారక సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ-ఏఎంఆర్) పెరిగిపోతోంది.
ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు
ఫలితంగా చిన్నారుల్లో ప్రభావం చూపని మందులు
చిన్న చిన్న జబ్బులూ తగ్గక ఆస్పత్రులకు పరుగులు
60% ఈ తరహా కేసులే..
వేరే ఔషధాలు వాడాల్సిన దుస్థితి
మితిమీరిన యాంటీబయాటిక్స్‌తో ముప్పే: వైద్యులు
ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు. జలుబు, దగ్గు వచ్చింది. ఇంటి పక్కనే ఉన్న ఔషధ దుకాణానికి వెళ్లి మందులు తెచ్చి వాడారు. 2 రోజుల్లో తగ్గింది. తర్వాత మరోసారి జ్వరం, జలుబు వచ్చింది. ఈ సారి యాంటీబయాటిక్స్ వాడినా తగ్గలేదు. దీంతో డాక్టర్ వద్దకు వెళ్లారు. పరిస్థితి గమనించి ఆ చిన్నారికి వేరే మందులు ఇవ్వాల్సి వచ్చింది.
మరో పాపకు వైరల్ జ్వరం వస్తే పిల్లల వైద్యుడికి చూపించి, మందులు వాడడంతో తగ్గింది. ఆర్నెల్ల తర్వాత మళ్లీ జ్వరం వస్తే.. గతంలో డాక్టర్ రాసిచ్చిన ఆ చీటీతోనే మందులను తెచ్చి వాడారు.కానీ, జ్వరం తగ్గలేదు. మళ్లీ వైద్యుడి దగ్గరకు పరుగులు పెట్టారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో రోగకారక సూక్ష్మజీవుల ఔషధ నిరోధకత (యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ-ఏఎంఆర్) పెరిగిపోతోంది. ఫలితంగా పిల్లలకు జ్వరం, జలుబు వంటి సమస్యలు వచ్చినా.. ఆస్పత్రుల్లో చేర్చి అధిక డోసులో యాంటీబయాటిక్స్ వాడితే కానీ తగ్గడం లేదు.
ఇటీవలి కాలంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పిల్లల వైద్యుల వద్దకు వచ్చే వారిలో దాదాపు 60 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదో ఒక యాంటీబయాటిక్ మందులు వేసిన వారే ఉంటున్నారు. సొంత వైద్యం, మెడికల్ షాప్‌లో ఇచ్చిన మందుల్ని పిల్లలకు వేసేస్తున్నారు. ఆ మందులతో వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తగ్గకపోవడంతో పరిస్థితి తీవ్రమవుతోంది. అలాంటి పిల్లల్ని కొన్నిసార్లు ఆస్పత్రిలో చేర్చుకొని హైడోసు మందులు ఇస్తే కానీ జబ్బులు తగ్గడం లేదని వైద్యులు చెబుతున్నారు.
చిన్నారుల ఎదుగుదలపైనా ప్రభావం..
పిల్లలకు వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్లకు ఎడాపెడా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఏఎంఆర్ పెరుగుతోంది. చిన్నారుల ఎదుగుదలపైనా ప్రభావం పడుతోంది. రెండేళ్ల లోపు పిల్లలకు పదేపదే యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వారు బరువు పెరగడం, ఎముకలు అసాధారణ రీతిలో పెరగడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన సెప్సిస్ కేసుల్లో కూడా యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మున్ముందు సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా చికిత్సకు లొంగకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణ వైరల్ జ్వరాలైతే రోగలక్షణాలను బట్టి చికిత్స చేసి, నయం చేయవచ్చని చెబుతున్నారు. తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకు త్వరగా నయం కావాలన్న ఆత్రుతలో యాంటీబయాటిక్స్‌ను ఉపయోగిస్తున్నారని అంటున్నారు. కొందరైతే యాంటీబయాటిక్స్ మందులు రాయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ మితిమీరి వినియోగిస్తే పిల్లల్లో న్యుమోనియా, గ్యాస్ట్రిక్ ఇన్‌ఫెక్షన్లు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా పిల్లల్లో తరచూ రోగనిరోధక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. చాలా మంది పిల్లలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని చెప్పారు. జీర్ణాశయ వ్యాధులు, చెవి, ముక్కు సమస్యలకు కారణమవుతాయని, ఇలాంటి సమయాల్లో సొంత వైద్యం వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలికంగా వాడితే..
యాంటీబయాటిక్స్ మందులను దీర్ఘకాలికంగా వాడితే రోగనిరోధక శక్తి తగ్గితుంది. తరుచూ వినియోగించడం వల్ల ప్రస్తుతమున్న జబ్బులను నయం చేయడం మాట దేవుడెరుగు.. లేనిపోని కొత్త రోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడకం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బ్యాక్టీరియా శక్తిమంతమవుతుందని హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులు వాడేస్తున్నారన్నారు. పిల్లలకు ఓవర్ డోస్ అయితే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. పిల్లలకు డాక్టర్లు రాసిన చీటీ ప్రకారం కూడా కొన్ని దుకాణాల్లో మందులు ఇవ్వడం లేదని.. వారికి తెలిసిన మందుల్ని అంటగడుతున్నారని చెబుతున్నారు.
గూగుల్‌లో వెతుకుతున్నారు..
చాలా మంది తల్లిదండ్రులు గూగూల్‌లో వెతుక్కోవడం, పాత చీటీ ఉంటే అవే మందులు తీసుకుని పిల్లలకు వేయడం చేస్తున్నారు. డోసు ఎక్కువ.. తక్కువ తీసుకుంటున్నారు. ఇలా వినియోగించడం వల్ల ఆ మందులు పనిచేయడం లేదు. ఆస్పత్రి ఓపీలో 60 శాతం యాంటీబయాటిక్స్‌ను ముందే తీసుకొని వస్తున్నారు. అలాంటి వారికి డోసు పెంచుతున్నాం. లేకపోతే మందులు మార్చి ఇస్తున్నాం. ఫీవర్ పెరిగితే అడ్మిట్ చేసుకుని ఇంజెక్షన్ల ద్వారా ఇస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు సొంత వైద్యం చేయడం చాలా ప్రమాదకరం.
- డాక్టర్ కాంచన్, పీడియాట్రిషన్, కామినేని ఆస్పత్రి
వైద్యులు సూచించిన మేరకే వాడాలి..
పిల్లలైనా, పెద్దలైనా ఇష్టానుసారం యాంటీబయాటిక్స్ వాడితే ఇబ్బందులు వస్తాయి. ఏ జబ్బుకైనా డాక్టర్లు చెప్పిన మందులు, అదీ సరైన డోసులోనే వేసుకోవాలి. బ్యాక్టీరియాకు మందులు ఇచ్చినప్పుడు కోర్సు ప్రకారం వాడాలి. జబ్బు తగ్గగానే మందులు వాడడం మానేస్తున్నారు. పూర్తి కోర్సును వాడకపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తయారు కావడం లేదు. రెండు, మూడు రోజులు వాడి మానేస్తే ఆ తర్వాత మందులు పనిచేయవు. పూర్తిగా వైద్యులు సూచించిన మేరకు మందులు వాడాలి.
- డాక్టర్ రవికుమార్, ఇన్‌చార్జి సూపరింటెండెంట్,
నిలోఫర్ ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest AP News and Telugu News
Updated Date - Nov 27 , 2024 | 09:50 AM