బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా?
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:47 AM
చంద్రబాబు అరెస్టుకు.. తాను సీఐడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లే ప్రాతిపదికంటూ ఆ విభాగం అధికారులు చెప్పడాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ గతంలోనే ఖండించారు.
పోలీసుల ప్రకటన దిగ్ర్భాంతికరం
ఆయన అరెస్టుకు దారితీసే అంశాలేవీ వాటిలో లేవు
కేబినెట్ ఆమోదంతోనే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు
నిబంధనలకు అనుగుణంగానే డిజైన్‌టెక్‌కు నిధులు
నాటి ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు అరెస్టుకు.. తాను సీఐడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లే ప్రాతిపదికంటూ ఆ విభాగం అధికారులు చెప్పడాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ గతంలోనే ఖండించారు. మేజిస్ట్రేట్ ముందు, పోలీసులకు తానిచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే చంద్రబాబును అరెస్టుచేశామని వారు చేసిన ప్రకటన తనకు ఆందోళన, దిగ్ర్భాంతి కలిగించినట్లు అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. వారి ప్రకటన అసంబద్ధంగా ఉందని.., నమ్మశక్యంగా లేదని.. అరెస్టుకు కారణమయ్యే ఎలాంటి అంశాలూ ఆ స్టేట్‌మెంట్లలో లేనేలేవని తేల్చిచెప్పారు. ‘నేను, నాటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత రాసిన నోటింగ్స్‌ను వేరే విధంగా వక్రీకరించారు. కేబినెట్ ఆమోదం మేరకే స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మంత్రివర్గం నిర్ణయం లేకుండా ఏ శాఖా, కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యం కాదు, బడ్జెట్ కేటాయింపు కూడా కుదరదు.
కార్పొరేషన్ ఇప్పటికీ అమల్లోనే ఉందికదా! లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఫైళ్లను మాయం చేశారనడమూ అసంబద్ధమే, సీఎం గానీ, మంత్రులు గానీ, కార్యదర్శులు గానీ ఫైళ్ల సంరక్షకులు కాదు. అలా మాయమై ఉంటే బాధ్యులెవరో గుర్తించి చర్యలు చేపట్టాలి. చంద్రబాబు అసాఽధారణ విజనరీ. (రాష్ట్ర విభజన జరిగిన) రెండేళ్లలో తన సామర్థ్యంతో విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం పలు సంస్థల నుంచి 30 వేల కోట్ల రుణం తీసుకురాగలిగారు. ఆయనతో సన్నిహితంగా పనిచేశాను. ఆయనపై ఎనలేని గౌరవం ఉంది. నా స్టేట్‌మెంట్లలో ఆయన్ను అరెస్టు చేసేందుకు దారితీసే అంశం ఒక్కటీ లేదు. డిజైన్‌టెక్ సంస్థకు నిబంధనల ప్రకారమే నిధులు విడుదలయ్యాయి. ఇందులో అవకతవకలకు ఆస్కారమే లేదు. నేను రాసిన నోట్‌ఫైల్‌కు చట్టబద్ధతే లేదు. అది చిత్తుపుస్తకం లాంటిది. దాని ఆధారంగా అరెస్టు చేశామనడం హాస్యాస్పదం. శాసనసభ కేటాయించిన.. ఆర్థికశాఖ ఆమోదించిన బడ్జెట్‌పై ఇంత గగ్గోలు చేయడం, క్రిమినల్ చర్యగా పరిగణించడం తొలిసారి చూస్తున్నాను’ అని పేర్కొన్నారు.