Volunteers: రాజీనామాకు ససేమిరా!
ABN, Publish Date - Apr 02 , 2024 | 04:05 AM
అంతా అధికార వైసీపీ స్కెచ్ ప్రకారమే నడుస్తోంది. అధికార పార్టీ ఒత్తిడి మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు.
అధికార వైసీపీ ఒత్తిడికి లొంగని కొందరు వలంటీర్లు
ఎన్టీఆర్ జిల్లాలో ఆరుగురే రాజీనామా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్):
అంతా అధికార వైసీపీ (YSRCP) స్కెచ్ ప్రకారమే నడుస్తోంది. అధికార పార్టీ ఒత్తిడి మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామాలు చేశారు. కానీ కొన్నిచోట్ల రాజీనామా చేసేందుకు వలంటీర్లు ససేమిరా అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 880 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. కృష్ణా జిల్లాలో 9,600 మంది వలంటీర్లకుగాను మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పేర్ని నాని బలవంతం, బెదిరింపుల కారణంగా 860 మంది రాజీనామాలు చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో కేవలం 14 మందే రాజీనామా చేశారు. మొత్తంగా కృష్ణా జిల్లాలో 874 మంది రాజీనామాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 10,418 మంది వలంటీర్లకు గాను ఆరుగురే రాజీనామా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగించేస్తారని, మీకు ఉద్యోగాలు కావాలంటే మేమే అధికారంలో ఉండాలని ఎంతగా బలవంతం పెట్టినా వలంటీర్ల నుంచి స్పందన రావటం లేదు. జీతం బకాయిలు వైసీపీ పార్టీనే చెల్లిస్తుందని నేతలు చెబుతున్నా.. వలంటీర్లు విశ్వసించడం లేదు. ‘పార్టీ కోసం పనిచేయండి.. ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం పార్టీయే చెల్లిస్తుంది’ అని నమ్మించేందుకు పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
జీతం బకాయిలు చెల్లిస్తేనే డివైజ్‌లు ఇస్తాం!
అధికార పార్టీ నేతల ఒత్తిడితో నరసరావుపేట డివిజన్‌లో పలువురు వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయితే వారివద్ద ఉన్న మొబైల్, వేలి ముద్రల స్కానింగ్ పరికరాలను అప్పగించలేదు. వలంటీర్లకు 3 నెలల నుంచి గౌరవ వేతనాలు ఇవ్వలేదు. దీంతో రూ.15 వేలు జీతం ఇచ్చిన తర్వాత డివైజ్‌లను అప్పగించాలనే యోచనలో వలంటీర్లు ఉన్నారు. నరసరావుపేటలో 435 మంది వలంటీర్లకు 200 మందికిపైగా రాజీనామా చేసినట్టు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది డివైజ్‌లను అప్పగించలేదు. వలంటీర్ల వద్ద ఉన్న మొబైల్, ఇతర పరికరాలను మంగళవారం ఉదయం 10 గంటల కల్లా స్వాధీనం చేసుకోవాలని మునిసిపల్ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ, రాజీనామాలు చేస్తున్న వలంటీర్లు డివైజ్‌లు మాత్రం అప్పగించడం లేదు.
Updated Date - Apr 02 , 2024 | 08:48 AM