YS Jagan: తాకట్టులో సచివాలయం.. హెచ్‌డీఎఫ్‌సీకి రాసిచ్చేసిన జగన్!
ABN, Publish Date - Mar 03 , 2024 | 03:28 AM
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి..
జగన్ సర్కారు మరో దా‘రుణం’
370 కోట్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీకి రాసిచ్చేశారు
గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్
తొలుత ఐసీఐసీఐని కోరిన సర్కారు
కాదు పొమ్మనడంతో హెచ్‌డీఎ్‌ఫసీకి
అధికారుల భవనాలపైనా తాకట్టు అప్పు
పూర్తయినట్లు చూపేందుకే అద్దె చెల్లింపు
కట్టడం చేతకాదుకానీ.. అప్పులకు ‘సిద్ధం’
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మూడు రాజధానులంటూ (Three Capitals) మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి... చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని (Amaravati) రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. అడ్డగోలుగా తెస్తున్న అప్పులు చాలక... చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం నవ్యాంధ్ర ఆత్మ గౌరవ ప్రతీక, ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రధాన వేదిక అయిన సచివాలయాన్ని తాకట్టు పెట్టడం జగన్ సర్కారు దా‘రుణ’ దాహానికి నిదర్శనం. సచివాలయంలో ఐదు బ్లాకులు (భవంతులు) ఉన్నాయి. శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పు కోసం తొలుత ఐసీఐసీఐ బ్యాంకును ఆశ్రయించినట్లు సమాచారం. ‘కుదరదు’ అని ఐసీఐసీఐ తేల్చడంతో, హెచ్‌డీఎ్‌ఫసీకి వెళ్లారు. ‘ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు. సచివాలయ భవనాలను తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిస్తే... మొత్తం నిర్మాణ వ్యయంలో సగం అప్పుగా ఇస్తాం’ అని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో... గుట్టుచప్పుడు కాకుండా సచివాలయ భవనాలను హెచ్‌డీఎ్‌ఫసీకి తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిచ్చేశారు.
త్వరలో ఆ భవనాలూ...
జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించిన సంగతి తెలిసిందే. చివరికి... 90 శాతం పూర్తయిన అఖిలభారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల భవన సముదాయాలను కూడా గాలికి వదిలేశారు. కానీ... ఇటీవల ఆ భవనాల్లో అధికారాలు నివసిస్తున్నారని, సీఆర్డీయేకు రూ.70 కోట్లు అద్దె కూడా చెల్లించామంటూ జీవో విడుదల చేశారు. నిర్మాణం పూర్తికాని భవనాల్లో నివాసం ఉండటమేంటి... దానికి అద్దె చెల్లించడమేమిటనే అనుమానాలు అప్పట్లోనే తలెత్తాయి. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోతే తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించాలనే షరతుతో రుణం సేకరించి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. మొత్తం అప్పు కట్టలేక, అవి పూర్తయినట్లుగా తప్పుడు జీవోలు సృష్టించారని అప్పుడు భావించారు. కానీ, ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ భవనాలను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చేందుకే ‘అద్దె’ నాటకం ఆడినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనాల తాకట్టు అనంతరమే... అధికారుల భవన సముదాయాలనూ తాకట్టు పెట్టి అప్పు తెచ్చే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం.
AP Elections: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీలో ఫుల్ జోష్!
‘ఎడారి’లో నేడు కాసుల వేట!
చంద్రబాబు హయాంలో అమరావతి కోసం భూసమీకరణ జరిపారు. తర్వాత సచివాలయం, అసెంబ్లీ నిర్మించి 2017లో ప్రారంభించారు. 2019లో హైకోర్టు భవనం పూర్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్ల నిర్మాణం 90 శాతం పూర్తయింది. మిగతా ఉద్యోగుల క్వార్టర్లు 75 శాతం పూర్తయ్యాయి. కొంత మినహా సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా పూర్తయింది. శాశ్వత సచివాలయ భవనాలు, జడ్జీల క్వార్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంత జరిగినా... ‘అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు. అది ఎడారి, శ్మశానం’ అని వైసీపీ పెద్దలు దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే... అమరావతిని అటకెక్కించి, అక్కడి భూములు, నిర్మాణాలతో అప్పులు తెచ్చుకునే పనిలో పడ్డారు. దొండపాడు, పిచ్చుకలపాలెం వద్ద భూములను ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించాలని ప్రయత్నించారు. కానీ, అప్పటికే మూడు రాజధానుల వ్యవహారం బయటికి రావడంతో, స్థిరమైన విధానాలు లేని జగన్ సర్కారును ఎవరూ నమ్మలేదు. తర్వాత రాజధాని రైతులు కోర్టును ఆశ్రయించి భూముల విక్రయాన్ని అడ్డుకున్నారు. ప్రజల ఆస్తులు, సంపదను తాకట్టు పెట్టి అప్పులు తేవడం జగన్ సర్కారుకు కొత్తేమీ కాదు. రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారాన్ని తాకట్టు పెట్టి రూ.48 వేల కోట్ల అప్పులు తెచ్చారు. వైజాగ్‌లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా రూ.25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. రోడ్లు, భవనాల శాఖ ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7000 కోట్లు తెచ్చుకున్నారు. చివరికి.. రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 03 , 2024 | 07:50 AM