ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam: ఫెంగల్‌ ముప్పు!

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:10 AM

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఇది నాగపట్నానికి 320 కి.మీ. ఆగ్నేయంగా, చెన్నైకి 500 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది.

  • నేటి ఉదయానికి తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం

  • రేపు రాత్రికి చెన్నై వద్ద తీరం దాటుతుందని అంచనా

విశాఖపట్నం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఇది నాగపట్నానికి 320 కి.మీ. ఆగ్నేయంగా, చెన్నైకి 500 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తరువాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని తప్పించుకుని ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుందని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాత్రి ఉత్తర తమిళనాడులోని చెన్నై, కడలూరు మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక తీరానికి సమీపంగా వచ్చేటప్పుడు చలిగాలులు తీవ్ర వాయుగుండం వైపు వీచే అవకాశం ఉన్నందున దాని గమనం కొంత నెమ్మదిస్తుందని చెబుతున్నారు. గురువారం ఉదయం తుఫాన్‌గా మారిన తరువాత కొంతమేర బలపడుతుందని, శుక్రవారం ఉదయం నుంచి తిరిగి వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని, శుక్రవారం రాత్రి ఉత్తర తమిళనాడులో తీరం దాటుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. తీరం వెంబడి గాలులు తీవ్రత పెరిగింది. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయంది.


గురువారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే నెల ఒకటి, రెండు, మూడు తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈనెల 30వ తేదీ వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 నుంచి 65, అప్పుడప్పుడు 75 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరిక ఎగురవేశారు. కాగా, ఈ సీజన్‌లో వాయుగుండాలు/తుఫానులు దక్షిణ తమిళనాడు వైపు వస్తుంటాయని, దానికి భిన్నంగా ఇది ఉత్తర తమిళనాడు దిశగా వస్తోందని నిపుణులు చెబుతున్నారు. కోస్తాంధ్రలో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని, తీరం నుంచి 30 కి.మీ. దాటిన తరువాత ప్రభావం ఒక మోస్తరుగా ఉంటుందని వాతావరణ అధికారి ఎస్‌.జగన్నాథకుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 04:11 AM