YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:41 AM
వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. లైంగిక వేధింపులు,
మాజీ మంత్రి మేరుగపై మహిళ ఫిర్యాదు
తాడేపల్లి టౌన్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. లైంగిక వేధింపులు, మోసం తదితర అభియోగాలతో శుక్రవారం విజయవాడ నగరానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మాజీ మంత్రి నాగార్జున ఆయన నిర్వహించే శాఖ పరిధిలో పలు కాంట్రాక్టులు ఇప్పిస్తానని నా వద్ద రూ.90 లక్షలు తీసుకున్నారు. ఎన్నిసార్లు తిరిగినా పనులు ఇప్పించలేదు. కాంట్రాక్టు పనులు ఇప్పించమని అడగడానికి వెళ్లిన నాపై మాజీ మంత్రి నాగార్జున నాలుగుసార్లు అత్యాచారం చేశాడు.
మంత్రి పీఏ మురళీమోహన్‌రెడ్డి... ‘సార్ మీతో మాట్లాడాలి రమ్మంటున్నారు’ అంటూ తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఓ అపార్టుమెంటుకు తీసుకెళ్లాడు. బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడు. గత ప్రభుత్వ హయాంలో అధికార బలాన్ని చూసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆర్థికంగా బాధలు, ఇబ్బందులతో ఒత్తిడి తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని బాధితురాలు మీడియాకు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై కేసు నమోదు చేసినట్టు తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు తెలిపారు. కాగా, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని నాగార్జున అన్నారు. ‘ఆమె చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధం. ఇంతవరకు ఆమె ముఖం కూడా చూడలేదు. ఆమెపై గుంటూరు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేస్తా.’ అని తెలిపారు.