AP Election 2024: సొంత ఇలాకాలో షాకులు!
ABN, Publish Date - May 01 , 2024 | 05:02 AM
సొంత ఇలాకా... అందులోనూ సొంత పార్టీ నేతలు! చెప్పింది విని, జేజేలు కొట్టడంతప్ప... ఎదురు మాట్లాడిందీ, డిమాం డ్లు చేసిందీ లేనేలేదు.
పులివెందులలో భారతికి ప్రశ్నలు
రైతులకు వైఎస్ మేలు చేశారు
రుణమాఫీపై జగన్‌కు చెప్పండి
పదేపదే వైసీపీ నేతల డిమాండ్
పాస్‌బుక్‌పై ఆయన ఫొటో ఎందుకు?
రైతు భరోసాలో వాటా పెంచాలి
కడప, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సొంత ఇలాకా... అందులోనూ సొంత పార్టీ నేతలు! చెప్పింది విని, జేజేలు కొట్టడంతప్ప... ఎదురు మాట్లాడిందీ, డిమాం డ్లు చేసిందీ లేనేలేదు. మొట్టమొదటిసారిగా ఈ సీన్ రివర్స్ అవుతోంది. పులివెందుల నియోజకవర్గంలో వరుసగా రెండో రోజున జగన్ సతీమణి భారతికి వైసీపీ నేతలనుంచి ‘డిమాండ్లు’ వినిపించాయి. భారతి మంగళవారం పులివెందులలో ప్రచారం చేశారు. పిరమిడ్‌నగర్‌లో తువ్వపల్లె గ్రామానికి చెందిన వైసీపీ నేతలు వెంకటనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ భర్త ధనుంజయరెడ్డి, వేంపల్లె వైసీపీ నాయకులు రెడ్డెయ్య తదితరులు రైతుల అసంతృప్తిని ఆమెకు తెలిపారు. ‘‘రైతులకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేలు చేశారు. రుణమాఫీ చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఈ విషయం జగన్‌కు చెప్పండి’’ అని భారతిని కోరారు. రుణమాఫీ సాధ్యమయ్యేదైతే జగనే చెప్పేవారని, సాధ్యం కాదు కాబట్టి చెప్పలేదని ఆమె బదులిచ్చారు. అయినా సరే... రుణమాఫీ విషయాన్ని జగన్‌కు తెలపాలని వైసీపీ నేతలు పదేపదే కోరారు.
మా పాస్‌బుక్‌పై ‘జగన్’ ఎందుకు?
రైతుల పట్టాదారు పాసుబుక్కులపై జగన్ ఫొటో వద్దంటూ వైసీపీ నేత, కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త భాస్కర్‌రెడ్డి వైఎస్ భారతికి ముఖాన్నే చెప్పారు. ఆమె సోమవారం వేంపల్లెలోని జీఎం కాంప్లెక్స్ వద్ద ప్రచారం నిర్వహిస్తుండగా... భాస్కర్‌రెడ్డి ఆమెతో మాట్లాడారు. ‘‘మా తాతల కాలం నుంచి పట్టాదారు పాసుబుక్కులపై రైతుల ఫొటోలే ఉన్నాయి. ఇప్పుడు జగన్ ఫొటోలు పెట్టడం పద్ధతి కాదు... తీసేయమని జగన్‌కు చెప్పండి. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడమే తప్ప, జగన్ ఎప్పుడైనా ‘నా రైతు’ అని చెప్పారా?’’అని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా కింద ఇచ్చే 13,500లలో కేంద్ర వాటాయే రూ.6 వేలని... రాష్ట్రం తన వాటా పెంచాలని జగన్‌కు చెప్పాలని భారతిని కోరారు.
Updated Date - May 01 , 2024 | 08:21 AM