ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు..

ABN, Publish Date - Sep 09 , 2024 | 07:15 AM

శ్రీకాకుళం జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

- జిల్లావ్యాప్తంగా కుంభవృష్టి

- అధికారులతో కలెక్టర్ సమీక్ష..

- పొంగుతున్న నదులు, వాగులు

- నీట మునిగిన పంట పొలాలు

- 500 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం..

- రహదారులపై వరదనీటి ప్రవాహం

- అప్రమత్తమైన అధికారులు

శ్రీకాకుళం జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా( Srikakulam Dist.,)లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి (Nagavali), వంశధార (Vamshadhara) ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వరద ముప్పు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, రహదారులపై వరదనీరు చేరి జలమయమయ్యాయి. వర్షపునీటితో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇదే రీతిన మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు.


500 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం..

వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో వరి పైరుకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ నష్టం నుంచి తేరుకోకముందే రైతులకు మరింత ఇబ్బంది కలుగజేసేలా వాతావరణం మారిపోయింది. జిల్లాలో అత్యధికంగా తీర ప్రాంతం ఉండడంతో బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్లు వల్ల తరుచూ ప్రభావం చూపుతూనే ఉంది. రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు సముద్రపు కెరటాలు కొన్ని మీటర్లు ముందుకు వచ్చాయి. తీరప్రాంత ప్రజలు సముద్రం వైపు వెళ్లనీయకుండా అధికారులు గ్రామాల్లో మకాం వేశారు.


అధికారులతో కలెక్టర్ సమీక్ష..

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌... అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మరో 3 నుంచి 5 రోజుల వరకు భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సముద్ర తీరం, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలు అత్యవసర సహాయం కోసం 08942-240557 నెంబరుకు ఫోన్‌ చేసి కంట్రోల్‌ రూమ్‌ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో నిత్యావసరాల కొరత లేకుండా ముందస్తుగా సరుకులను తరలించాలంటూ అధికారులను ఆదేశించి, చర్యలను పర్యవేక్షించారు.


కాగా ఆదివారం సాయంత్రానికి అత్యధికంగా రణస్థలంలో 70 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌, బలగ, హడ్కోకాలనీ, రామలక్ష్మణ జంక్షన్‌, డే అండ్‌ జంక్షన్‌ల్లో కాలువల నీరు వర్షపు నీరు కలిసి ప్రవాహాన్ని తలపించాయి. వాహనచోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అలాగే జి.సిగడాం మండలంలో పెంట గ్రామంలో సీసీ రహదారి కోతకు గురైంది.


పొంగిప్రవహిస్తున్న నదులు, గెడ్డలు

నాగావళి, వంశధార, బాహుదా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో మడ్డువలస ప్రాజెక్ట్‌, నారాయణపురం ఆనకట్ట, గొట్టా బ్యారేజీలో వరద ఉధృతి మరింత పెరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా నారాయణపురం ఆనకట్ట నుంచి 18,500 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టారు. గొట్టాబ్యారేజీ నుంచి గేట్లను కొద్దిమేర తెరిచి 7,196 క్యూసెక్కుల నీటిని వంశధారలోకి విడిచిపెట్టారు. ఇక చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. జలుమూరు, పోలాకి, సారవకోట, నరసన్నపేట, శ్రీకాకుళం మండలాల్లో వరిపైరు ముంపునకు గురైంది. బహుదానదిలో ఒడిశా నుంచి వర్షపు నీరు చేరడంతో ఉప్పొంగింది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు.


లావేరు మండలంలో అదపాక- గుర్రాలపాలేం, రాయినింగారిపేట, బెజ్జిపురం- బుడతవలస, లక్ష్మీపురం-పట్నవానిపేటలకు వద్ద పెదగెడ్డ ఉధృతంగా పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జిపురం- బుడతవలస మధ్య పెద్దగెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఆ వరద ఉధృతిలో ఓ లగేజీ వ్యాన్‌ కొంతదూరం వరకు కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే ట్రాక్టర్‌ సహాయంతో కొట్టుకుపోయిన వ్యాన్‌ను బయటకు తీసుకువచ్చారు. అలాగే రణస్థలం మండలంలోని కోటపాలేం రెవెన్యూ పరిధిలో ఉన్న బుచ్చివాని గెడ్డ పొంగి ప్రవహించింది. బీటీ రోడ్డుమీదకు నీరు రావడంతో రాకపోకలు స్తంబించాయి.


అధికారులు అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులంతా అప్రమ్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను సైతం అప్రమత్తం చేయాలన్నారు. అధికారులంతా సమన్వయంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

Updated Date - Sep 09 , 2024 | 07:15 AM

Advertising
Advertising