Minister Payyavula Keshav : ఏపీని ఆదుకోండి
ABN, Publish Date - Jun 23 , 2024 | 05:03 AM
ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.
రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించండి
పోలవరం పూర్తికి సహాయ సహకారాలు అందించండి
హేండ్లూమ్స్, పాదరక్షలకు జీఎ్‌సటీ తగ్గించండి
కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల విజ్ఞప్తి
ఢిల్లీలో బడ్జెట్ సన్నాహక సమావేశానికి హాజరు
న్యూఢిల్లీ, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుకు ఉన్న చిన్నపాటి అభ్యంతరాలను త్వరగా పరిష్కరించి ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందించాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.15,000 కోట్లను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆదుకోవాలని కోరారు. శనివారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహక(ప్రీ బడ్జెటరీ), జీఎ్‌సటీ కౌన్సిల్ సమావేశాలలో పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఆ సమావేశాలలో రాష్ట్రప్రభుత్వం తరఫున చేసిన ప్రతిపాదనలను అనంతరం ఆయన ఏపీభవన్‌లో మీడియాకు వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం జిల్లా సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని అడిగామని తెలిపారు.
అవకాశం ఉన్న చోట పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని, ఏపీలో కేంద్రం చేపట్టిన పారిశ్రామిక కారిడార్‌లు, పార్క్‌ల దగ్గర పారిశ్రామిక క్లస్టర్‌లు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. మెగా టెక్స్‌టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్‌కు నిధులతో పాటు గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు సాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. తిరుపతి, వైజాగ్ ఎయిరుపోర్టుల కోసం స్వాధీనం చేసుకున్న భూములకు సంబంధించిన రీయింబర్స్‌మెంటు నిధులను విడుదల చేయాలని అడిగామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరామని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం చేయూత అత్యవసరమనే విషయాన్ని వివరించామని తెలిపారు.
రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోలియం కాంప్లెక్స్, రైల్వే జోన్‌కు సహకారం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం స్థాపించాలని కోరినట్లు తెలిపారు. 2047 కల్లా వికసిత్ భారత్ సాధనలో భాగంగా త్వరితగతిన దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ మార్క్‌ను చేరడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. హేండ్లూమ్స్, పాదరక్షలకు జీఎ్‌సటీ తగ్గించాలని కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. జగన్ పాలనలో ఏ స్థాయిలో ఆర్థిక అరాచకం జరిగిందో ప్రాధాన్యమైన ఐదారు అంశాలపై త్వరలో ప్రజలకు అన్ని పారదర్శకంగా వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా పయ్యావుల తెలిపారు.
Updated Date - Jun 23 , 2024 | 05:53 AM