మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్‌పైకి రాళ్లు!

ABN, Publish Date - Apr 14 , 2024 | 04:06 AM

ముఖ్యమంత్రి జగన్‌ ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షోలో రాళ్ల దాడి జరిగింది. శనివారం రాత్రి విజయవాడ సింగ్‌నగర్‌లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి రెండు రాళ్లు విసిరారు. ..

జగన్‌పైకి రాళ్లు!

నుదుటిపై స్వల్ప గాయం..

మాజీ మంత్రి వెలంపల్లికీ..

బెజవాడ రోడ్‌షోలో ఘటన

ప్రథమ చికిత్స తర్వాత ముందుకు..

ఆనక ప్రభుత్వాస్పత్రికి..

సీఎం గాయానికి కుట్లు!

భద్రతా చర్యల నుంచి దాడి వరకు ఎన్నెన్నో అనుమానాలు

కరెంటు తీయించి మరీ చీకట్లో రోడ్‌షో..

కానరాని రోప్‌ పార్టీ, బస్సు చెంతకు జనం

అప్పుడే దూసుకొచ్చిన రాళ్లు..

కచ్చితత్వంతో తగలడంతో క్యాట్‌బాల్‌ వాడారనే డౌట్స్‌

ఇంతజరిగినా జనాన్నీ క్లియర్‌ చేయలేదు..

బుల్లెట్‌ ప్రూఫ్‌ షీట్స్‌ వాడలేదెందుకో?

అంతా అయ్యాక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సతో సరి!..

టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు..

దాడిని ఖండించిన మోదీ, చంద్రబాబు

విజయవాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ ‘మేమంతా సిద్ధం’ రోడ్‌షోలో రాళ్ల దాడి జరిగింది. శనివారం రాత్రి విజయవాడ సింగ్‌నగర్‌లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి రెండు రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్‌ ఎడమ కంటికి పైభాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ ఇన్‌చార్జ్‌, వృత్తిరీత్యా సీనియర్‌ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి, గాయానికి ప్లాస్టర్‌ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచే ప్రజలకు అభివాదం చేసిన జగన్‌.. తర్వాతి సెంటర్‌లో మళ్లీ బస్సుపైకెక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్‌సభ అభ్యర్థి, డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌.. మరోసారి జగన్‌ గాయాన్ని శుభ్రపరచి, ఇంకోసారి ప్లాస్టర్‌ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్‌ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా, వద్దని వారించిన జగన్‌.. ఆస్పత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో జగన్‌ను ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం హెచ్‌వోడీ మోహన్‌ ఆధ్వర్యంలో చికిత్స అందించా రు. గాయానికి 3కుట్లు పడ్డాయని, నాలుగైదు రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కూడా అదే ఆస్పత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకుని వెళ్లారు.

జగన్‌ త్వరగా కోలుకోవాలి: ప్రధాని

సీఎం జగన్‌ త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా..

తీవ్రంగా ఖండిస్తున్నా: చంద్రబాబు

జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులైన అధికారులను శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

దాడి బాధాకరం: వైఎస్‌ షర్మిల

సీఎం జగన్‌పై దాడి, ఆయన ఎడమ కంటిపై గాయం బాధాకరం. దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.

ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై శనివారం జరిగిన దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పేట్టారు. దాడి నుంచి వైఎస్‌ జగన్‌ సురక్షితంగా బయటపడినందుకు కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు చోటు లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 07:09 AM

Advertising
Advertising