నడి సంద్రంలో చిక్కుకున్న పడవ
ABN, Publish Date - Nov 28 , 2024 | 05:38 AM
ఇంజన్ మరమ్మతులకు గురై సముద్రంలో నిలిచిపోయిన మెకనైజ్డ్ బోటును మత్స్యశాఖ అధికారులు, కృష్ణపట్నం పోర్టు సిబ్బంది సహకారంతో బుధవారం ఒడ్డుకు తీసుకొచ్చారు.
బిక్కుబిక్కుమంటూ 9 మంది మత్స్యకారులు
కలెక్టర్ చొరవతో కాపాడిన మత్స్య శాఖ, పోర్టు అధికారులు
నెల్లూరు (వ్యవసాయం)/వాకాడు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇంజన్ మరమ్మతులకు గురై సముద్రంలో నిలిచిపోయిన మెకనైజ్డ్ బోటును మత్స్యశాఖ అధికారులు, కృష్ణపట్నం పోర్టు సిబ్బంది సహకారంతో బుధవారం ఒడ్డుకు తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం చెన్నారాయనిపాళెం పంచాయతీ పాతపాళెం, తాటిచెట్లపాళెం గ్రామాలకు చెందిన 9 మంది మత్స్యకారులు మెకనైజ్డ్ బోటులో చెన్నై వైపు నుంచి కృష్టపట్నం పోర్టుకు వస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం వైట్‌కుప్పం, ఓడపాళెం తీరానికి 14 కిలోమీటర్ల దూరాన సముద్రంలో వీరి బోట్ ఇంజన్ పాడైంది. అలలతాకిడికి కదలలేనిస్థితిలో ఆ బోట్‌లో మత్స్యకారులు చిక్కుకుపోయారు. బోట్‌లోని అత్యవసర ఇండికేటర్‌ను వేయడంతో కృష్ణపట్నం పోర్టు కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందగానే వారు.. నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే సముద్రంలో అల్పపీడన ప్రభావంతో వాయుగుండం బలపడి తీవ్ర తుఫాన్‌గా మారడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సమాచారం అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంకటేశ్వర్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వాతావరణం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కృష్ణపట్నం ఓడరేవు నుంచి కోస్ట్‌గార్డ్ నావికా దళం, అధికారులు, సిబ్బంది ప్రత్యేక బోట్‌లో సముద్రంలోకి వెళ్లారు. చిక్కుకుపోయిన మెకనైజడ్ బోట్‌ను గుర్తించి బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణపట్నం తీసుకొచ్చారు. పోర్టు వైద్య సిబ్బంది వారికి వైద్య పరీక్షలు చేయగా, మత్స్యశాఖ అధికారులు భోజన సదుపాయం కల్పించారు. రాత్రంతా సముద్రంలో ఎగిసిపడే రాకాసి అలల మధ్య ప్రాణభయంతో అల్లాడిన మత్స్యకారులు.. తమను ఒడ్డుకు చేర్చిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Nov 28 , 2024 | 05:38 AM