మెడికల్ పీజీ అడ్మిషన్లలో పెనాల్టీ బాదుడు!
ABN, Publish Date - Oct 06 , 2024 | 05:04 AM
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ మెడికల్ పీజీ నోటిఫికేషన్‌పై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు
దరఖాస్తు గడువును పెంచాలని విద్యార్థుల డిమాండ్
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ మెడికల్ పీజీ నోటిఫికేషన్‌పై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా పీజీ సీట్ల భర్తీకి హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ గతనెల 27న నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే తేదీ నుంచి ఈ నెల 4లోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు దాటిన తర్వాత మరో మూడు రోజుల పాటు అంటే 5, 6, 7 తేదీల్లో రూ.10 వేలు ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా రూ.10వేలు వసూలు చేయడం ఏమిటని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పైగా ఆల్ ఇండియా స్థాయిలో పీజీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రారంభం కాకముందే రాష్ట్రంలో దరఖాస్తులు ఆహ్వానించడం, వాటిని 4వ తేదీతో పూర్తిచేయడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు గడువును పొడిగించడంతో పాటు జరిమానా రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ అంశంపై హెల్త్ వర్సిటీ వీసీ నరసింహం మాట్లాడుతూ, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చారు.
Updated Date - Oct 06 , 2024 | 05:04 AM